కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా ..కలేకూరి ప్రసాద్ జయంతి నివాళులు

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా ..కలేకూరి ప్రసాద్ జయంతి నివాళులు


జోహార్ ! జోహార్ ! కలేకూరి  ప్రసాద్ జోహార్ !


కలేకూరి ప్రసాద్ అన్న కలం పేరు (యువక )ప్రముఖ కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు. జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు.


ప్రసాద్ అన్న 1964 అక్టోబర్ 25వ తేదీన కృష్ణా జిల్లా, కంచికచెర్లలో జన్మించాడు. ఆయన తల్లి తండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావులు ఇద్దరూ ఉపాధ్యాయులే. కలేకూరి ప్రసాద్‌ తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడ్ని పెత్తందార్లు సజీవదహనం చేయడంతో చలించిపోయి పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చేరారు. పార్టీ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా పనిచేశారు. కారంచేడులో దళితుల మారణకాండతో దళిత ఉద్యమాల్లో పనిచేశారు.  మే 17, 2013 న ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం అయ్యారు.


శ్రీరాములయ్య సినిమాలో వాడిన "భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో.." పాట కారంచేడును ఉద్దేశించి రాసినదే. అదే సమయంలో పీపుల్స్‌వార్‌ నుంచి విభేదించి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా, దళిత ఉద్యమాల్లో పనిచేశారు. టంగుటూరులో నవవధువు ఇందిర హత్యకు గురైన సమయంలో ఆయన రాసిన "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా.."
పాట రాసి మహిళా ఉద్యమానికి వూపిరిలూదారు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలేకూరి పలు సందర్భాల్లో చెప్పేవారు.


యువక అనే కలం పేరుతో కలేకూరి ప్రసాద్‌ అన్న రాసిన కవితలు ఎంతోమందిని కదిలించాయి. మండుతున్న చుండూరు, దళిత కవిత్వం లాంటి కవితా సంకలనాల్లో ఆయన కవితలు చోటుచేసుకున్నాయి. ప్రసాద్‌ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'.. 'భూమికి పచ్చాని రంగేసినట్టూ', చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా తదితర గీతాలు బహు ప్రాచుర్యం పొందాయి. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నారు.


ధిక్కార పతాక కలేకూరి 


"నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను" తనెవరో, తన మూలాలేమిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. "పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది"


కవిగా, కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, మధుపాత్రికేయుడుగా, ప్రేమికుడిగా,  సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు.


 ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత.అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్ళిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్.