సంధ్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేతలపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 70లో సదరన్‌ స్పైస్‌ గ్రూప్‌ హోటల్స్‌ అధినేత పి. ప్రమోద్‌కుమార్‌ కార్యాలయం ఉంది. మంగళవారం సాయంత్రం స్టార్‌ క్యాటరర్స్‌ నుంచి వచ్చానంటూ అలీ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అతడికి అపాయింట్‌ మెంట్‌ లేకపోవడంతో ముందుగా సిబ్బంది ప్రమోద్‌కుమార్‌ను కలిసేందుకు అనుమతించలేదు. బలవంతంగా ప్రమోద్‌కుమార్‌ క్యాబిన్‌లోకి వెళ్లాడు. పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతానని అలీ కోరగా ఆయన అంగీకరించారు. అలీ తన ఫోన్‌ నుంచి సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌ అధినేతలు శ్రీధర్‌రావు, శ్రీనాథరావుతో మాట్లాడించాడు. సంధ్య కన్వెన్షన్‌ లీజును ఉపసంహరించుకోకపోతే అంతచూస్తానంటూ వారు బెదిరించారు. ఫోన్‌ పెట్టేశాక అలీ కత్తి చూపించి... చెప్పినట్టు వినకపోతే చంపేస్తానంటూ హెచ్చరించాడు. బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీ కత్తితో బెదిరిస్తున్న సీసీ ఫుటేజీని పోలీసులకు అందించాడు. గతంలో కూడా తనను అనేక సందర్భాల్లో శ్రీధర్‌రావు, శ్రీనాథరావు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.