నీవే దిక్కని ఆ దేవుడిని వేడుకుంటే..
నీవే దిక్కని ఆ దేవుడిని వేడుకుంటే.. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే' అన్నాడో సినీకవి._


 


నిజమే.. సమాజంలో ఎవరికి ఏ నష్టం, కష్టం వచ్చినా అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. నెక్ట్స్ పోలీస్‌స్టేషన్‌. అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో ప్రజలు ఉంటారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసి వాటిని పరిష్కరించుకుని ఉపశమనం పొందుతారు.


ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్‌ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారు. దీనికి తగ్గట్టుగానే విధులు నిర్వహించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన పోలీసుల ఎంతో మంది ఉన్నారు. ప్రజల కోసం 24 గంటలు కష్టపడుతూ.. వారు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎంతో మంది పోలీసులు తెల్లవార్లూ మేలుకొంటారు. ఉదయం, రాత్రి, చావు, పుట్టుక, శుభకార్యం, అశుభం ఇలా.. ఏ పనికైనా పోలీస్‌ సాయం అన్నది నేడు చాలా ముఖ్యంగా మారింది. ఒక్క శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా సమాజంలో వస్తున్న అనేక మార్పులకు తగ్గట్టుగా పోలీసులు అందిస్తున్న సేవలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి.


*ప్రజలతో స్నేహపూర్వకంగా..:*
పోలీస్‌ సేవలు ఎంతో ఉత్తమమైనవి. అవి ప్రజలకు పూర్తిస్థాయిలో లభించాలంటే ప్రజలకు పోలీసుల గురించి తెలియాలి. దీని కోసం ప్రజలతో స్నేహపూర్వంగా ఉండాలి. గతంలో పోలీసులంటే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవి. దీనివల్ల వారు ప్రజలకు దూరమవుతూ వచ్చారు. దీన్ని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలిగేలా సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. మైత్రి సంఘాలను ఏర్పాటుచేసి శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రజలకు భాగస్వాములను చేస్తున్నారు. ఏ ఆపద వచ్చినా పోలీస్‌స్టేషన్‌కి వస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా అందిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో ఫిర్యాదులు స్వీకరించకపోయినా 100 నెంబరుకి ఫోన్‌చేసి నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఫోన్‌ నెంబర్లను ప్రజలకు తెలిపేలా ప్రచారం చేస్తున్నారు.


*వత్తిళ్ళ మధ్య ఎన్నో సేవలు:*
నేరాలు జరగకుండా చూడడం.. నేరాలను కనుగొనడం.. ఇది లాఅండ్‌ ఆర్డర్‌ లో పోలీసుల ప్రధాన విధి.. సమాజంలో చెడును పారదోలేలా  అనేక విభాగాల్లో పోలీసులు నిఘా పెడుతున్నారు. శాంతి భద్రతల విభాగం, క్రైం, ట్రాఫిక్‌, స్పెషల్‌ బ్రాంచి, మహిళా పోలీసులు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌, జీఆర్‌పీ, కోస్టల్‌ సెక్యూరిటీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ట్రాన్స్‌కో విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌, తెలుగు రాష్ట్రాలలో  స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో మావోయిస్టులను పట్టుకోవడం, ఎక్కడైనా శాంతి భద్రలకు విఘాతం కలిగితే వెంటనే రంగంలోకి దిగడం చేస్తారు. బాంబ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం ఇలా అనేక విభాగాల్లో పోలీసులు సేవలు అందిస్తున్నారు. వినాయకచవితి, దసరా, పండగలు పబ్బాలు... మారుతున్న కాలంలో టెక్నాలజీని ఉపయోగించి నేరాలు అధిక జరుగుతున్న తరుణంలో సైబర్‌ నేరాలను అదుపుచేసేలా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కారానికి ట్రాఫిక్‌ పోలీసులు నిరంతం  శ్రమిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన గుర్తుతెలియని మృతదేహాలకు అన్నీ తామై దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులు అమర   వీరులుగా ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతున్నారు.


Box Item


*ఈ పవిత్ర దినోత్సవం చరిత్ర*
ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. 'హాట్ స్ప్రింగ్స్' అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన 'హాట్ స్ప్రింగ్స్' నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. మేరా భారత్ మహాన్.. జైహింద్.