హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు 31 మంది

 


హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతి, బీజేపీ అభ్యర్థి కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయితోపాటు మొత్తం 31 మంది మిగిలారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం అధికారులు వాటిని పరిశీలించారు. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు దాఖలుచేయగా.. 45 మంది అభ్యర్థుల పత్రాలు సరిగాలేవని రిటర్నింగ్ అధికారి చంద్రయ్య తెలిపారు. డిపాజిట్ చెల్లించకపోవడం, ఫారం 26 సరిగ్గా నింపకపోవడం, నామినేషన్ ఫారంలో కాకుండా వేరే ఫారంలో దరఖాస్తు చేయడం, సంతకాలు చేయకపోవడం, పది మంది ప్రతిపాదితులు లేకపోవడం వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరించినట్టు చెప్పారు. నామినేషన్ తిరస్కరణకు గురైన వారిలో సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు కూడా ఉన్నారు. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నెల 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో మరికొన్ని నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.


Popular posts