అంగన్‌వాడీ కేంద్రాలను మాయం చేయనున్న 'ముసాయిదా

అంగన్‌వాడీ కేంద్రాలను మాయం చేయనున్న 'ముసాయిదా'

 

             జాతీయ విద్యా విధానం ముసాయిదా భారతదేశ విద్యా వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చే ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 1968 కొఠారి విద్యావిధానం 10.2.3 ను 3.3.4 గా అంటే 5 (మూడు సంవత్సరాల పూర్వ శిశువిద్యం 1,2 గ్రేడ్లు), 3 (3,4,5 గ్రేడ్లు)గా మార్చాలని ప్రతిపాదించింది. అంటే ఇంతవరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరూ ఇకపై ప్రీ స్కూల్లో ఉంటారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ వైఫల్యాలను ఆసరా చేసుకొని వాటిని రద్దు చేయడం లేదా వాటంతట అవే మూతపడే విధంగా ముసాయిదా సిఫార్సులను తయారు చేసింది. కారణాలను విశ్లేషించి సరి చేయాలని భావించలేదు. ఇందులో పూర్వశిశు విద్యకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలిద్దాం.

 

అశాస్త్రీయ అవగాహన

మన దేశంలో విద్యార్థుల నమోదు తగ్గుతూ వస్తున్నది. భాష, సంఖ్యా శాస్త్రాల్లో తరగతికి తగ్గ స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యాలు లేవని, వారి సంఖ్య 5 కోట్ల వరకు ప్రస్తుతం ఉంటుందని, సరైన చర్యలు తీసుకోకుండా పరిస్థితిని ఇలాగే వదిలేస్తే రానున్న కొద్ది సంవత్సరాలలో వీరి సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని ముసాయిదా పేర్కొంది. పాఠశాల సంసిద్ధత సామర్ధ్యాలు విద్యార్థులకు లేకపోవటమే ఈ రెండు సమస్యలకు ప్రధానమైన కారణంగా చెప్పింది. దీనికి పరిష్కారం 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పూర్వ శిశువిద్యను ప్రవేశ పెట్టడమే పరిష్కారం అని బలంగా ప్రతిపాదించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్‌ ద్వారా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పూర్వశిశు విద్యను పాఠశాల విద్యలో భాగం చేయాలని ప్రతిపాదించింది. ఐసిడిఎస్‌ కేవలం ఆరోగ్య సేవలు చూసుకోవాలని చెప్పింది. ఈ రెండు ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటి తీవ్రతను ముసాయిదా సరిగానే వివరించింది. అయితే వీటికి కారణాలను విశ్లేషించి చూపిన పరిష్కార మార్గాలు ఈ సమస్యలను ఇంకా పెంచుతాయే తప్ప తగ్గించవు. డ్రాపౌట్‌ మరియు అభ్యాసన సామర్ధ్యాలు లేమి సమస్యలకు సామాజిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులే కారణాలని అనేక అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. తగిన పరిష్కారాలను కూడా చూపాయి. అయినప్పటికీ బాలలకు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని కన్నా వారి నుండి ఫలితాలను ఎలా రాబట్టాలన్న దానిపైనే ముసాయిదా దృష్టి పెట్టింది. ఇది పూర్తిగా వ్యాపార దృష్టి.

 

ముసాయిదా ప్రమాదకరమైన ప్రతిపాదనలు

మొదటిది పూర్వ శిశుసంరక్షణ విద్యను రెగ్యులర్‌ పాఠశాల విద్యలో భాగం చేయాలని చెప్పింది. 3-6 సంవత్సరాల వయస్సు బాల బాలికలకు రెగ్యులర్‌ స్కూలింగ్‌ సమగ్ర వికాసానికి ఆటంకం కలిగిస్తుంది. ఎన్‌సిఇఆర్‌టి కరిక్యులమ్‌, పెడగాజి రూపొందించి ఫలితాలను రాబట్టాలని చెప్పింది. దీనికిగాను ముసాయిదా చేసిన ప్రతిపాదనలు ఆ వయస్సు పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. 3-6 సంవత్సరాల పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో భాగంగా ప్రీస్కూల్‌లో ఉండడం వలన ఆరోగ్య సేవలకు దూరమౌతారు. ఫలితంగా సమగ్ర అభివృద్ధి దెబ్బ తింటుంది.

రెండవది పూర్వ శిశువిద్యను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తిపరమైన అర్హతలను కలిగిన విద్యా కార్యకర్తలను, ఎడ్యుకేటర్లను తయారు చేయాలని, వారికి స్థాయికి తగ్గ వృత్తి శిక్షణ ఇవ్వాలని చెప్పింది. అంటే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ శిశువిద్య భాగమైనప్పటికీ దీని నిర్వహణకు రెగ్యులర్‌ టీచర్లను నియమించరు. ఇప్పటివరకు ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు కాక, అటు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోనూ కాకుండా కొత్తగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని నిర్వహిస్తారు. బాలలు ఇటు రెగ్యులర్‌గా నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు దూరమై అటు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో శిక్షణ లేక రెండు వైపులా నష్టపోతారు. ఇది బాలబాలికల ప్రయోజనానికి నష్టం కలిగిస్తుంది.

మూడవది పూర్వ శిశు విద్యను మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధి లోకి చేర్చాలని చెప్పింది. ఇంతవరకు 0-6 సంవత్సరాల బాలబాలికల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, కనీస సామర్ధ్యాల బోధన వంటి కార్యక్రమాలను నిర్వహించిన అంగన్‌వాడీ కేంద్రాలు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్నాయి. అంటే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలన్ని రద్దవుతాయి. తద్వారా అంగన్‌వాడీ కేంద్రాలన్నీ మూత పడతాయి.

నాల్గవది స్కూల్‌ కాంప్లెక్సులు ఏర్పాటు చేసి 30 లోపు పిల్లలు ఉన్న పాఠశాలలన్నింటిని విలీనం చేయాలని చెప్పింది. అంటే 30 లోపు పిల్లలున్న పాఠశాలలు మూత పడతాయి. అప్పుడు ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండవు. కాబట్టి ప్రీస్కూల్‌, అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉండవు. ఇది విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 2లో పూర్వ శిశు విద్యకు ప్రభుత్వాలు తగు ఏర్పాట్లు చేయాలన్నదానికి విరుద్ధమే కదా! ఇది బాలబాలికల హక్కులను కాలరాస్తుంది.

ఐదవది ప్రస్తుతం పూర్వ శిశు విద్య అందుతున్న అంగన్‌వాడీ కేంద్రాల నుంచి దాన్ని తప్పించి ఎటువంటి భద్రతా లేని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దానిని నడపడం వల్ల తల్లిదండ్రులకు నమ్మకం తగ్గుతుంది. తమ పిల్లలను ఆర్థికంగా భారమైనప్పటికీ అప్పులు చేసైనా ప్రయివేట్‌ స్కూల్లలో కూడా ఫ్రీ స్కూల్‌ నడుస్తున్నది కాబట్టి అక్కడ చేరుస్తారు. కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు లేని తల్లిదండ్రులు ప్రీ స్కూల్‌లో చేర్చకుండా ఉందామంటే కుదరదు. అది ఫౌండేషనల్‌ స్టేజిలో ఉంది కాబట్టి చదివించక తప్పదు. అంటే ప్రీ స్కూల్‌ దశలో వ్యాపారం మరింత విస్తరిస్తున్నది.

ఆరవది ఈ ప్రతిపాదన ద్వారా పిల్లలకు, వారి తల్లులకు అందిస్తున్న సేవలకు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలకు మార్చడం ద్వారా ఆ సేవలను కూడా సమర్ధవంతంగా అందించలేదు. ఫలితంగా ఐసిడిఎస్‌ కూడా బలహీనపడే ప్రమాదం ఉంది.

 

అంగన్‌వాడీల ద్వారానే సాధ్యం

ఇప్పటి వరకు పూర్వశిశు విద్యను దేశంలో అందిస్తున్నది అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్‌ స్కూళ్లు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే. ఇందులో అంగన్‌వాడీలది ప్రధానమైన పాత్ర. మనదేశంలో ఐసిడిఎస్‌ గొప్ప విజయవంతమైన ప్రయోగం. పిల్లలు, తల్లుల ఆరోగ్య సంరక్షణలో చేస్తున్న కృషి చెప్పుకోదగ్గది. ఈ కేంద్రాలు గత నాలుగు దశాబ్దాలుగా కోట్లాది మందికి పూర్వ శిశు విద్యను, పోషకాహారాన్ని అందించింది. పస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానంలో బాలలపై ఒత్తిడి లేని విధంగా ఉంది. 2014లో ఎన్‌.జి రంగా యూనివర్శిటీకి చెందిన ఓ అధ్యయనం ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాలలో చేరిన విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లకుండా చేరిన విద్యార్థుల కంటే అన్ని సామర్ధ్యాల్లో ముందున్నారని చెప్పింది. మహారాష్ట్రకు చెందిన మాజీ సివిల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ వి.రమణి దేశ వ్యాప్తంగా 50 జిల్లాల్లో చేసిన అధ్యయనం చెప్పింది ఏమంటే...ఐసిడిఎస్‌ను ఇంకా బలోపేతం చేయాలని, పూర్వ శిశు విద్యను కూడా జోడించి ప్రభావంతంగా అమలు చేయాలని, ఐసిడిఎస్‌ లేకపోతే పట్టణాల్లోని మురికివాడల్లోని పిల్లలు గిరిజన ప్రాంత పిల్లలతో సమానంగా ఉంటారని చెప్పారు.

కానీ ఈ ముసాయిదా లక్ష్యం వేరుగా కనిపిస్తుంది. పూర్వశిశువిద్య ప్రధానమైనదని అందరూ అంగీకరిస్తారు. కానీ ముసాయిదా చెప్పిన అతిశయోక్తులు చూస్తే వెంటనే అంగన్‌వాడీ కేంద్రాల మూసివేసి, తద్వారా ఐసిడిఎస్‌ను బలహీన పర్చడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. ముసాయిదా ప్రతిపాదనలు చట్టంగా కాకముందే వీటిని ఆసరాగా చేసుకొని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేస్తున్నాయి. ప్రస్తుతమున్న ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అంగన్‌వాడీ కేంద్రాల నుండి వచ్చిన పిల్లలతో జరుగుతుంది. ఆ అంగన్‌వాడీ కేంద్రాలే రద్దయితే ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలకు ఏ గ్యారంటీ లేదు. 3-6 సంవత్సరాల పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలల్లోనే ప్రీస్కూల్లో చేరుతారు. కాబట్టి అంగన్‌వాడీల రద్దు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు నష్టం.

కేంద్ర ప్రాయోజిత పథకాలను బిజెపి ప్రభుత్వం తమ వారితో నింపడం, అది


...