విజయవాడకు 7.. హైదరాబాద్‌కు 17 స్వచ్ఛత ర్యాంకులు

విజయవాడకు 7.. హైదరాబాద్‌కు 17
స్వచ్ఛత ర్యాంకుల్ని ప్రకటించిన పీయూష్‌ గోయల్‌


దిల్లీ: దేశవ్యాప్తంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్లలో విజయవాడ టాప్‌ టెన్‌లో స్థానం దక్కించుకుంది. దేశంలోని రైల్వే స్టేషన్ల స్వచ్ఛతపై నిర్వహించిన సర్వే నివేదికను రైల్వే శాఖ బుధవారం విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. జయపుర రైల్వే స్టేషన్‌కు ఒకటో ర్యాంకులో నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ ఏడో ర్యాంకు దక్కించుకోగా.. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ 17వ ర్యాంకులో నిలిచింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 42వ స్థానంలో నిలిచింది.


ఏపీలోని సామర్లకోట స్టేషన్‌కు 45వ స్థానం దక్కగా.. తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస స్టేషన్‌ 92 ర్యాంకుల్లో నిలిచాయి. తెలంగాణలోని వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు  51వ ర్యాంకులో నిలవగా, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.


ఈసారి మొత్తం 720 స్టేషన్లలో సర్వే నిర్వహించగా రాజస్థాన్‌లోని జయపుర, జోధ్‌పూర్‌, దుర్గాపుర స్టేషన్లు తొలి మూడు ర్యాంకుల్లో నిలవడం విశేషం. అలాగే, 109 సబర్బన్‌ రైల్వే స్టేషన్లలో అంధేరి, విరార్‌, నయిగాం రైల్వే స్టేషన్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2016 నుంచి రైల్వే శాఖ ఏటా 407 ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వచ్ఛత అంశంపై థర్డ్‌ పార్టీతో సర్వే చేయిస్తోంది. కానీ.. ఈసారి మాత్రం తొలిసారిగా 720 రైల్వే స్టేషన్లు, సబర్బన్‌ రైల్వేస్టేషన్లలో ఈ సర్వే చేపట్టి ర్యాంకుల్ని ప్రకటించింది.