పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం

పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం
అనపర్తి ఎమ్మెల్యే వినతి పై జిల్లా కలెక్టర్ హామీ
పెదపూడి : జిల్లాలోని పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మురళీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాకినాడ కలెక్టరేట్ లో శనివారం అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పెదపూడి ప్రెస్ క్లబ్ నాయకులతో కలిసి  పాత్రికేయుల ఇళ్ల స్థలాల కై జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనపర్తి నియోజకవర్గం లోని పాత్రికేయులతో పాటు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్  సూర్యనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి  జీవో తీసుకురావడం జరిగిందని, జీవో ప్రకారం పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి కలెక్టర్ ను కోరారు.  పెదపూడి మండలంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అనువైన స్థలాన్ని గుర్తించడం జరిగిందని, ఆ స్థలంలో  ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం కలెక్టర్ కు వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పాత్రికేయులు అందరికీ  ఇళ్ల  స్థలాలతో పాటు ఇళ్లను నిర్మించుకోవడానికి రుణాలను కూడా మంజూరు చేస్తామని  అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పాత్రికేయులకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి  తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ వివరించారు. పాత్రికేయుల సమస్యలపై కలెక్టర్ ను కలిసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఎపిడబ్ల్యుజెఎఫ్ , పెదపూడి ప్రెస్ క్లబ్ తరఫున పాత్రికేయులు ధన్యవాదాలు తెలియజేశారు. కలెక్టర్  ను కలిసిన వారిలో వైకాపా నాయకులు ఎర్ర సత్తిబాబు, పెదపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరి సత్యనారాయణ, కార్యదర్శి  ఉండ్రు సత్యనారాయణ ఉన్నారు.