ఎనిమిదిగంటల పని.కాని ఆ ఎనిమిదిగంటల్ని తీరిక లేకుండా షెడ్యూల్
 

నేను తొలినాళ్లలో చేసిన ఉద్యోగాల్లో ఆర్టీసీ ఒకటి.కండక్టరుగా సిటీలో పనిచేశాను.పర్మినెంటు కూడా అయింది.అయినా నాకు ఏ నెలా జీతం మూడువేలు దాటలేదు.అప్పట్లో కూడా లక్షల్లో జీతం తీసుకునేవారు ఆర్టీసీలో వుండేవారు.బస్ భవన్లో ఇ.డి లు గా.మేం కార్మికులం నాలుగంకెలజీతానికే పరిమితం.ఇప్పటికీ పరిస్థితి అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను.మహా అయితే ఈ పద్దెనిమిదేళ్లలో మూడువేలు ముప్ఫైవేలు అయివుంటుంది.

 

నేను ఆర్టీసీలో మానేసి కేంద్రప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లాక నాకు జీవితంలో హాయి అంటే ఎలావుంటుందో తెలిసింది.అయినా ఒక రెండు మూడేళ్లపాటు నిద్రలో ఆర్టీసీ పీడకలలు వచ్చేవి.ఢిల్లీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కూడా ఎప్పుడైనా కునుకుపడితే ,మళ్లీ మెలకువ రాగానే కొన్ని క్షణాలు బస్ లో అందరికీ టిక్కెట్లు కొట్టానా లేదా అని భయంవేసేది.కిటికీలోంచి ఏ జీప్ కనిపించినా ఒక్కక్షణం అది చెకింగ్ జీపేమో అని భయం వేసేది.ఆర్టీసీని నేను విడిచిపెట్టినా ఆర్టీసీ భయంరూపంలో నన్ను విడిచిపెట్టలేదు.అక్కడ అనుభవాలు అలాంటివి.

 

చెకింగ్ చేసే స్టాఫ్ బస్సు ఎక్కీఎక్కగానే కండక్టరుని దొంగలా భావిస్తారు.ఒకడేమో ఎస్సార్,ఇంకొకడేమో టిక్కెట్లు గుంజుకుంటాడు.వాళ్లు చెక్ చేసేంతవరకూ గుండె వేగంగా కొట్టుకూనేవుంటుంది.బస్సులో ఏ ఒక్కడు టిక్కెట్ తీయకపోయినా కండక్టర్ కి పనిష్మెంట్ చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది.టికెట్ తీయనివాడికి వందో ఐదువందలో ఫైన్.కాని ఆ బస్ కండక్టరుకి మొదట ఛార్జ్ మెమో,ఆ తర్వాత ఇంక్రిమెంటులు కట్.దురదృష్టముండీ ఎక్కువమంది తీయకపోతే కండక్టర్ ఉద్యోగంకూడా పోతుంది.న్యూఢిల్లీలో నేనెక్కిన బస్సుల్లో కండక్టర్ వెనుకవైపు కూర్చునేవాడు.ప్రయాణీకులందరూ అతని దగ్గరకెళ్లి టికెట్ తీసుకునేవారు.ఒకవేళ రష్ ఎక్కువుంటే ఒకరికొకరు డబ్బులు పాస్ చేసుకుంటూ కండక్టరుకిచ్చి అలాగే టికెట్ కూడా ఒకరికొకరు పాస్ చేసుకుంటూ తీసుకుంటారు.అక్కడ ప్రయాణికుడిదే రెస్పాన్సిబిలిటీ.మనదగ్గర కండక్టర్ ది రెస్పాన్సిబిలిటీ.

ఇక డ్రైవర్లు కూడా బస్సుకి అంత ట్రాఫిక్ లో ఏ డామేజి అయినా వాళ్లకే నష్టం.కె.ఎం.పి.ఎల్ అంటూ డ్రైవర్లను టార్చర్ పెడతారు.అంటే మైలేజ్ తక్కువొచ్చే వారికి ఛార్జ్ మెమోలు.

నా మొత్తం ఆర్టీసీ సర్వీసులో ఒక్క కండక్టర్నీ ఇంక్రిమెంటులు కట్ కాకుండా చూడలేదు.దానర్థం జీతం ఎప్పటికీ పెరగదు.

 

ఎనిమిదిగంటల పని.కాని ఆ ఎనిమిదిగంటల్ని తీరిక లేకుండా షెడ్యూల్ డిజైన్ చేసేవారు.సో మనం మధ్యలో ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే డ్యూటీ ముగియడానికి ఎక్కువ టైం అవుతుంది.పైగా డ్యూటీకన్నా ఒక గంట ముందే రిపోర్ట్ చేసి టిక్కెట్లు చెక్ చేసుకోవడం, చిల్లర ఇంప్రెస్ట్ చూసుకోవడంలాంటివి చేయాలి.బస్ డిపోకి తీసుకొచ్చేసాక ఒక గంటన్నర రెండుగంటలు క్యాష్ లెక్కపెట్టుకుని,టిక్కెట్లకు టాలీ చేసుకుని మొత్తం లెక్క అప్పచెప్పి డినామినేషన్లో డబ్బులు కట్టడం ఉండేది.అంటే డైలీ మినిమం పదిగంటల డ్యూటీ ఉండేది.ఫస్ట్ బస్ డ్యూటీపడితే ముందురోజు రాత్రికి డిపోలోనే పడుకునేవాణ్ని.అక్కడే సామూహిక స్నానాలు,టాయిలెట్లు.ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ కండక్టర్లకు చాలామందికి అమీబియాసిస్ అల్సర్లు ఉంటాయి.వేళకు తిండి ఉండదు.అదికూడా ఎక్కడబడితే అక్కడ తినడం నీళ్లు తాగడం ఉంటాయి.

చాలాసార్లు డబ్బులు కట్టి డ్యూటీ ముగిసేసరికి అర్ధరాత్రి అయ్యేది.రోజంతా అందర్ని బస్సుల్లో తిప్పిన నేను ఏ ఆటోకో ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చి ఇంటికెళ్లేవాడిని.మా వీధుల్లో తెల్లవారజామున,అర్ధరాత్రి కుక్కలబారిన పడకుండా ఉండటానికి చాలా దండాలు పెట్టుకునేవాడిని.ఇప్పుడు దేవుడ్ని నమ్మని నాస్తికులు కూడా అలాంటి సందర్భాలలో దేవుడికి మొక్కాల్సిందే.నేను ఇంకో రెండువిషయాల్లోకూడా రోజూ దేవుడికి మొక్కేవాడిని.ఒకటి ఈరోజు ఏ ప్రయాణికుడితో గొడవ కాకుండా చూడమని,రెండు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఈ నరకకూపంనుండి బయటపడెయ్యమని.

 

రోజూ ఎవడోవొకడితో లేదా సమూహంతో గొడవయ్యేది.ఆఖరికి ప్రభుత్వం టిక్కెట్లరేట్లు పెంచినా ప్రజలకి కనిపించేది కండక్టరు,డ్రైవరే కాబట్టి, పెంచింది మేమే అన్నట్లు మాతో గొడవ పడేవారు.కొందరైతే మీ ఆర్టీసీని ప్రైవేట్ చేసేయాలి చంద్రబాబే కరెక్టని శాపనార్ధాలు పెట్టేవారు.నేను కూడా ఊరుకునేవాడ్ని కాదు.చేస్తే మీ దూలా తీరిపోతుందనేవాడ్ని.ఇప్పుడు రాత్రుళ్లు కానీ,ఎర్లీ మార్నింగ్ కాని చాలా సర్వీసులు ప్రయాణీకులు సరిపడా లేకపోయినా ఆర్టీసీ కాబట్టి తిప్పుతుంది,ప్రైవేటు వాడెందుకు తిప్పుతాడు?వాడికి లాభంవచ్చే టైములలోనే,రూట్లలోనే తిప్పుతాడు.వాడికి సోషల్ సర్వీస్ చేయాల్సిన అవసరమేముంటుంది.వాడు బస్ పాసులను కూడా ఒప్పుకోడు.

 

ఈరోజు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో,ఒక డ్రైవరన్న ఖమ్మంలో ఆత్మాహుతికి పాల్పడుతూ,మంటల్లో కాలిపోతూ కూడా మాకన్ని జీతాలు లేవు మేం దయనీయంగా బతుకుతున్నాం అని చెప్తుంటే, నా అనుభవాలు కూడా చెప్పాలనిపించింది.నేను మొత్తం రెండు ప్రైవేట్ ఉద్యోగాలు,మూడు ప్రభుత్వరంగ(ఆర్టీసీ కలిపి)వుద్యోగాలు,రెండు ప్రభుత్వోద్యోగాలు చేశాను.ఈ ఏడింటిలో ఆర్టీసీలో పనిచేస్తున్నప్పుడు పడినంత వేదన,టార్చర్ ఇంకదేనిలోనూ కలగలేదు.అదృష్టంకొద్దీ నా మిత్రులు రామునాయుడు,ప్రభాకర్,నేను ఈ ఊబిలోంచి బయటపడ్డాం.కానీ మా రాజన్న డ్రైవర్ ఉండిపోయాడు.

ఇప్పటికీ మా ఊరెళ్లినప్పుడు మా డ్రైవరన్నని కలుస్తుంటాను.పరిస్థితులు ఏమన్నా మెరుగుపడ్డాయా అని అడుగుతుంటాను.

 

రాజన్న ఏం చెప్తాడో మీకు కూడా తెలుసు.