అందరం ఒక్కటై ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం - చంద్రబాబు

 


" నాకున్న అపూర్వ శక్తీ పార్టీనే..నామీద, పార్టీపై వున్న నమ్మకం గొప్పది. ప్రాణం పోయినా పార్టీ మారం, పుట్టినప్పటినుంచి ఈ పార్టీలోనే వున్నాం, చనిపోయేదాకా టిడిపిలోనే ఉంటాం అన్న గంగలకుంట బిసి (యాదవ) ఆడబిడ్డల స్ఫూర్తి మనందరిలో ఉండాలి.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పార్టీకి తక్కువ సమయం ఇచ్చాను. మరో 20 % సమయం ఎక్కువగా పార్టీకి ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓడినప్పుడు నిందలు సహజం,వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి,పార్టీ కోసం పట్టుదలగా పని చేయాలి. అన్ని అనుబంధ సంఘాలు అనుసంధానం కావాలి. పార్టీ వ్యవస్థను అన్ని స్థాయిల్లో పటిష్టం చేస్తాం. అందరం ఒక్కటై ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం అని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజానికి మెరుగైన సేవలను అందించాలనే తపనతోనే శ్రమిస్తున్నానని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమర్థులను గుర్తించి పార్టీ విభాగాల్లో నాయకత్వ బాధ్యతను అప్పగిస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో తెదేపా ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదని  పేర్కొన్నారు.గుంటూరులోని తెలుగుదేశం పార్టీ  కార్యాలయంలో  సీబీఎన్ ఆర్మీ సభ్యులతో  జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.   ఓటమితో కృంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఓటమిని తానెప్పుడూ అంగీకరించమన్నారు.గత ఎన్నికల్లో తెదేపాలోని అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా, శక్తికొలదీ పని చేసినా ఓటమి పొందడంతో పోరాటాన్ని ఆపకూడదన్నారు. తెదేపా అన్నివిభాగాలను పటిష్టపరచడంపై దృష్టి పెట్టామని తెలిపారు. తెదేపా అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ అందరి శక్తిసామర్థ్యాలను సద్వినియోగం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణతో పార్టీ సిద్ధాంతాలపై పూర్తి నమ్మకం ఉన్న నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.గత అయిదేళ్ళూ రాష్ట్రం అభివృద్ధిపైనే పూర్తి శ్రద్ధ వహించడంతో ఫలితాలు సాధించామని తెలిపారు.. ఏపీని దేశంలో నెంబరు వన్ చేయడం మూలంగానే ఇప్పటికీ అవార్డులు వస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వంపైనా, అదేసందర్భంలో పార్టీపైనా దృష్టి పెట్టినట్లయితే ఫలితాలు మరో రకంగా ఉండేవని పేర్కొన్నారు. ఎవ్వరూ అధైర్యపడకుండా తమతమ విధులను, బాధ్యతలను నిర్వర్తించడంలో శక్తిమేరకు కృషి కొనసాగించాలని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే అవకాశం వస్తుందని పూర్తి నమ్మకం ఉందన్నారు.తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయడంలో వైకాపా విచ్చలవిడిగా వ్యవహరించడంతో ప్రజల్లో అపోహలు పెరిగి ఓటమికి కారణమైందన్నారు. ఇటీవల ఉండవల్లిలోని తన ఇల్లును ముంచడానికి వైకాపా ప్రయత్నించడం జగన్ శాడిస్టుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎంత వేధిస్తేనో డాక్టర్ కోడెల ఆత్మహత్యకు పాల్పడటం వైకాపా అరాచకాలకు పరాకాష్ట అన్నారు.  పిరికివాళ్ళు పార్టీ వదిలిపెట్టి పోయినా కార్యకర్తల బలం పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.  ఎంత హింసించినా ఎన్ కౌంటర్ చేస్తామన్నా తెదేపాను విడిచిపెట్టమని పల్నాడులో తెదేపా కార్యకర్తలు పేర్కొనడం గర్వకారణమన్నారు.అన్ని వర్గాలకు ప్రభుత్వంలో, పదవుల్లో, పార్టీలో సమప్రాధాన్యం కల్పించిన ఘనత తెదేపాదేనన్నారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా సమైఖ్యంగా ఉండి పోరాటం చేసి మంచి ఫలితాలు సాధిద్దామని పేర్కొన్నారు.  పోరాటయోధులను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు.నాలుగు నెలల్లో జగన్ దుర్మార్గ పాలనతో అపఖ్యాతిని మూటగట్టుకున్నాడన్నారు.                      సీబీఎన్ ఆర్మీ విభాగం అధ్యక్షుడు మానం బ్రహ్మం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు యువత, ఉద్యోగాలు హాజరయ్యారు.