_అక్కడ ప్రాణం తీసింది... ఇక్కడ ప్రాణం ఇచ్చింది_

 


*_అక్కడ ప్రాణం తీసింది... ఇక్కడ ప్రాణం ఇచ్చింది_*


*_ఒకవైపు మానవ సంబంధాలు కనుమరుగు అవుతున్నాయి. మరో వైపు 'భరోస లేని బతుకు జీవితం ఎందుకు' అంటూ అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ రెండు విషయాలు మహిళల విషయంలో సమాజానికి ఇచ్చిన చేదు గుళికలు. 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం._*


https://www.facebook.com/100000061627171/posts/2809149085763785/


*తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే..:*
మంచిగా ఉండాలని తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. ఈ ఘటన హయత్‌ నగర్‌ లోని మునుగనూరులో చోటుచేసుకుంది. వివరాలు... రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా రజిత ఇంటివద్దే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో తమ కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా రజిత గుర్తించింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూతురిని మందలించింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకున్న కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెను కడతేర్చాలని భావించింది. 


*పథకం రచించి తల్లిని హత్య చేసి.. :*
తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడితో పాటు అక్కడే మూడురోజుల పాటు గడిపింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని భయపడి... ప్రియుడు శశి సహాయంతో తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైలు పట్టాల మీద పడేసింది. అనంతరం తాను వైజాగ్‌ టూర్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పి... ఇంటి వెనుకాలే ఉండే తన మరో ప్రియుడితో కీర్తి గడిపింది.


*తల్లి కనిపించడంలేదని  ఫిర్యాదు:*
తన తండ్రి తాగి రావడంతో కొన్నిరోజులుగా అమ్మానాన్నల మధ్య గొడవ జరుగుతోందని... ఈ నేపథ్యంలో విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. కాగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి.. రజిత గురించి కీర్తిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో భాగంగా తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



(బాక్స్)


*ఉరి వేసిన సమ్మె:*
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ నీరజ(31) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్తుపల్లి డిపోలో ఆమె పనిచేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా నీరజ నిన్న ఆమె తన తల్లిగారి ఊరైన పల్లెగూడెం వెళ్లారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాల్సి ఉందని చెప్పి ఆమె  ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కండక్టర్‌ ఆత్మహత్య వార్త తెలుసుకొని పెద్దసంఖ్యలో కార్మిక సంఘాల నేతలు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. ఖమ్మం కలక్టరేట్ వద్ద నీరజ మృతదేహంతో ఉద్యమంలో పాల్గొంటున్నవారు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.


*సత్తుపల్లిలో ఉద్రిక్తత:*
ఆర్టీసీ మహిళా కండక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో సత్తుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి డిపో వద్ద కార్మికులు, అఖిల పక్షనాయకులు ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.