గాంధీ జయంతి రోజు ఏపిలో దారుణం... ప్రభుత్వం నడిపే సచివాలయాల్లో ఇలా చేస్తారా ?

 


*గాంధీ జయంతి రోజు ఏపిలో దారుణం... ప్రభుత్వం నడిపే సచివాలయాల్లో ఇలా చేస్తారా ?*


సంవత్సరానికి ఒక్క రోజు, మద్యం, మాంసం ముట్టకుండా ఉండే రోజు, అక్టోబర్ 2. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా, గాంధీ తాతకు ఈ దేశం ఇచ్చే నివాళి ఇది. అక్టోబర్ 2న, మాంసం, మద్యం అమ్మకూడదు అనేది చట్టం కూడా, సామాన్య ప్రజలు ఎవరైనా మద్యం తాగి కనిపించినా, చిరు వ్యాపారస్తులు ఎవరైనా మాంసం విక్రయాలు అమ్మినా, వాళ్ళను తీసుకు వెళ్లి లోపల వేస్తారు. అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, ఇవేమీ పట్టవు. ఏకంగా, ఎమ్మెల్యేల సారధ్యంలోనే, కొత్తగా ఏర్పడిన గ్రామ సచివాలయాల సాక్షిగా, ఆ మహాత్ముడి ఆశయాలకు తూట్లు పొడుస్తూ, మాంసంతో విందు చేసుకోవటం కలకలం రేపింది. ఏకంగా గ్రామ సచివలయాల్లో, ఎమ్మెల్యేలు పాల్గున్న చోట, ఇలా మాంసం తినటంతో, అందరూ అవాక్కయ్యారు. ప్రభుత్వ కార్యక్రమంలోనే అక్టోబర్ 2న మాంసంతో విందు భోజనం పెడితే, ఇక సామాన్యులు, ఎందుకు ఈ రూల్స్ పాటిస్తారు ?


ఈ సంఘటన, చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని 2 చోట్ల ప్రభుత్వ కార్యక్రమంలో జరిగింది. రెండు చోట్లా ప్రభుత్వ కార్యాలయాల్లో మాంసాహారం దర్శనమిచ్చింది. మత్తేరిమిట్ట, చినపాండూరులో గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమంలో అక్కడకు వచ్చిన ప్రజలకు మాంసాహారంతో భోజనం పెట్టారు. మత్తేరిమిట్టలో గ్రామ సచివాలయం ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రారంభించి వెళ్లిన తర్వాత మాంసాహారంతో విందు ఏర్పాటు చేసారు. ఇక చినపాండూరు గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు చికెన్ బిర్యాని పెట్టారు. గాంధీ జయంతి రోజు మాంసాహారం నిషేధం ఉన్నా అధికారులు కాని, నేతలు కాని, పట్టించుకోలేదు. వారికే అలా ఉంటే, ఇక ప్రజలు ఏముంది, వారు పెట్టారు కదా అని వీరు లాగించారు.


మరో పక్క, మద్యం దుకాణాల పై, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని, ఇంతకంటే ఘోరం ఇంకా ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వమే దగ్గర ఉండి, పోలీసులను పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వం మొదలు పెట్టిన మద్యం దుకాణాల పై, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. జనావాసాల మధ్య మద్యం అమ్మకాలు ఏమిటంటూ మహిళలు భగ్గుమంటున్నారు.