మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసర సమావేశం గందరగోళం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసర సమావేశం గందరగోళంగా మారింది. పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో.. 'మా'లో ఇలా జరుగుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదన్నారు. అసోసియేషన్‌లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని పృథ్వీ ఆరోపించారు. సభ్యులు ఏం మాట్లాడినా.. జీవిత రాజశేఖర్ తప్పుపడుతున్నారని చెప్పారు. సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని పృథ్వీ అభిప్రాయపడ్డారు.