అధికారం ఎక్కడుంటే అక్కడ …!!_
2014 ఎన్నికలకు ముందు జూపూడి ప్రభాకర్ రావు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ చంద్రబాబు, కాంగ్రెస్‌ను ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ జూపూడికి ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఇచ్చారు.2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డోలా బాలా శ్రీ వీరాంజనేయస్వామి చేతిలో జూపూడి ప్రభాకర రావు ఓడిపోయారు. ఆ వెంటనే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారు.
అప్పటి వరకు జగన్‌పై ఈగ వాలనీయని జూపూడి టీడీపీలోకి వచ్చి పదవులు చేపట్టిన వెంటనే జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాలో తనను ఓడించేందుకు వైవి.సుబ్బారెడ్డి, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నాలు చేశారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజులు ఆ పార్టీతో అంటకాగిన జూపూడి ప్రభాకర రావు , ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో బాబుకు షాక్ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత జూపూడి ప్రభాకర రావు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో జూపూడి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు.జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీఇవ్వడం విడ్డూరంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే జూపూడి ఆ పార్టీకి దూరం అయ్యారు.
ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వారిలో జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. తనను ఆ పార్టీ ముఖ్యనేతలే ఓడించారని అప్పట్లో జూపూడి ఆరోపించారు.దానికి నిరసనగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశంలో చేరిపోయారు. ఎస్సీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జూపూడి ప్రభాకర్ రావుకి చంద్రబాబు వెంటనే పదవి ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు మీద జూపూడి ప్రభాకర్ రావు చాలా స్వామిభక్తి చూపించారు. ఎంతగా అంటే… అంతవరకూ తను పొడిగిన జగన్ ను తీవ్రంగా విమర్శించడంతో పాటు చాలానే చేశారు.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే టీడీపీకి రాజీనామాచేసి జూపూడి ప్రభాకర్ రావు ఆ పార్టీలోకి చేరుతున్నారనేది దాచేది ఏమీకాదు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఇలాంటి నేతలు వాలుతూ పోతూ ఉంటారంతే..!!