మన భవిష్యత్ కోసం పోరాడే పరిస్థితి తెచ్చారు.

 


''ఇది ఒక దురదృష్టకరమైన రోజు. మన అమరావతి కోసం, మన భవిష్యత్ కోసం పోరాడే పరిస్థితి తెచ్చారు. మేము ఈ కార్యక్రమం పెట్టింది యుద్దానికి కాదు. అమరావతిలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పడానికే ఈ పర్యటన.


ఇది నా ఒక్కడి సమస్య కాదు, భూములిచ్చిన వేలాది రైతుల సమస్య, ఉపాధి పోయిన వేలాది రైతు కూలీల సమస్య. రైతులిచ్చిన 34వేల ఎకరాలతో పాటు మొత్తం 54వేల ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభించాం. ఆ రోజు మీరు త్యాగాలు చేయకపోతే రాజధాని వచ్చేది కాదు. ఇది 5కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించిన అంశం. పేదరికం పోగొట్టడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రానికి ఆదాయం సృష్టించే నగరం. అంతర్జాతీయ నగరంగా అమరావతిని చేస్తానని నన్ను నమ్మి భూములిచ్చారు. వాళ్ల త్యాగాలకు తగిన ఫలితం రాని పరిస్థితి తెస్తున్నారు.


నా స్వార్ధం కోసమో, పార్టీ లాభం కోసమో, కొందరు వ్యక్తుల కోసమో చేపట్టిన పర్యటన కాదు. ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే ఇప్పుడీ పర్యటన చేపట్టాం. 


గత 6నెలలుగా అమరావతిలో ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తోంటే, మామీదకు వైఎస్సార్ కాంగ్రెస్ రౌడీలను పంపి రాళ్లు,చెప్పులు,కర్రలతో దాడి చేయిస్తారా, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తారా? నిరసన తెలియజేసే హక్కు వాళ్లకుందని, దాడిచేసిన వాళ్లనే డిజిపి సమర్ధిస్తారా?


ప్రధాని నరేంద్రమోడి శంకుస్థాపన చేసిన ప్రాంతం. పుణ్యనదుల పవిత్ర జలాలు, పుణ్యక్షేత్రాల పవిత్రమట్టితో ఈ ప్రాంతాన్ని శక్తివంతం చేశాం. ఇదేదో మతానికో, కులానికో సంబంధించింది కాదు. భావితరాల భవిష్యత్ కు, మన బిడ్డల ఆకాంక్షలకు ప్రతీక.


 వీళ్ల దుర్మార్గాల బారినుంచి ఈ నగరాన్ని కాపాడాలని, పనులు ఆగిపోకుండా చూడాలని, నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ఈ రోజు ఆ పవిత్ర స్థలం నుంచి అందరు దేవుళ్లను ప్రార్ధించి సంకల్పం చేశాను.
అనేక భవనాల నిర్మాణం 90% పూర్తయ్యింది. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల హవుసింగ్ కాంప్లెక్స్ లు, ఐఏఎస్, ఐపిఎస్, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాస భవనాల సముదాయం, హైకోర్టు, జడ్జిల బంగ్లాలు, ఎన్జీవోల నివాసాలు, పేదల గృహ సముదాయాలన్నీ స్వయంగా పరిశీలించాను.


అలాంటిది అమరావతిపై రకరకాలుగా మంత్రులే మాట్లాడటం వింటుంటే బాధగా ఉంది.


ఆ రోజు హైదరాబాద్ ను అభివృద్ది చేశాం. అప్పుడు 5వేల ఎకరాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అవసరమా అన్నారు. 15% ఆదాయం హైదరాబాద్ లో పెరుగుదలకు తోడ్పడింది. ఏ నగరానికి లేని ఒక వరంగా 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు మారింది. సైబరాబాద్ నిర్మాణం అవసరమా అని ఆరోజు అన్నారు. ఈ రోజు అది ఉపాధి కేంద్రం అయ్యింది.


కులానికి నన్ను అంటకట్టే స్థితికి దిగజారారు. ఆ రోజు హైదరాబాద్ లో ఏ కులం ఉందని అభివృధ్ధి చేశాను.


నన్ను గురించి చెప్పకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ హైదరాబాద్ లో చేసిన పనులు చూస్తే నేనే గుర్తొస్తాను. ఆ సంతృప్తి కోసమే అభివృద్ధి చేశాను. ఆ రోజు ఒక ఊహ, ఒక విజన్ నిజం చేయడానికి తాపత్రయపడ్డాను. విజన్ 2020ని ముందే ఊహించి దానిని సాధ్యం చేశాం. ఆ అభివృద్ధిని వైఎస్ రాజశేఖర రెడ్డి చంపేయకుండా కొనసాగించారు.
విభజన తరువాత రాష్ట్ర పరిస్థితులు చూసి కసిగా అభివృద్ధికి నడుం కట్టాం.


ఉత్తరాన 6జిల్లాలు, దక్షిణాన 7జిల్లాలు మధ్యలో అమరావతి నగరం. ఇంతకన్నా అందుబాటులో ఉండే రాజధాని నగరం ఏది ఉంది..?


ప్రాచీన నాగరికతతో 
మన అమరావతి ఒక చరిత్ర. 


ఇచ్చాపురం నుంచి 530కిమీ, తడనుంచి 370కిమీ, కుప్పం నుంచి 490కిమీ, కర్నూలు నుంచి 360కిమీ అమరావతి నుంచి ఉంటాయి.


52%మంది అమరావతినే రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటికి అభిప్రాయాలు పంపారు. శాసన సభలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలని చెప్పారు. 
ఈ రోజు రైతులు త్యాగాలు చేసి 34వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఎక్కడా వివాదం లేదు, నా పిలుపుతో, నా మీద నమ్మకంతో ముందుకొచ్చి ఇచ్చారు. వైసిపి వాళ్లే గ్రీన్ ట్రిబ్యునల్ కు, కోర్టులకు ఫిర్యాదులు చేశారు తప్ప ప్రజల్లో ఏ వివాదం లేదు.


రాజధాని నిర్మాణానికి రూ.9492కోట్లు సమకూర్చాం, రూ.9060కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం రూ.1500కోట్లు ఇచ్చింది. 2గంటల్లోనే  బాండ్స్ రూపంలో రూ.2వేల కోట్లు సమకూరింది. హడ్కో రూ.1098కోట్లు ఇచ్చింది. బ్యాంకులు రూ.1862కోట్లు సమకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో రూ.1103కోట్లు వచ్చింది. భూమి అమ్మకం మౌలిక సదుపాయాల నిధి కింద రూ.543కోట్లు, సిఆర్డీఏ బాండ్లు రూ.26కోట్లు, వడ్డీలు రూ.61కోట్లు, సెక్యూరిటి డిపాజిట్లు రూ.64కోట్లు, అద్దెల కింద రూ.133కోట్లు, స్మార్ట్ సిటి కింద కేంద్రం రూ.742కోట్లు ఖర్చు చేసింది. టిడ్కో కింద  పేదల ఇళ్లకు రూ.308కోట్లు ఖర్చు చేశాం. మొత్తం రూ.9492కోట్లకు గాను రూ.9060కోట్లు ఖర్చు చేశాం. 


రైతులు భూమి ఇచ్చారు, సింగపూర్ ఉచితంగా ప్లాన్లు ఇచ్చింది. ప్రపంచం అంతా అమరావతి వైపు చూసింది. మన భూమికి విలువ పెరిగింది.


అలాంటిది ఈ రోజు అమరావతిపై దుష్ప్రచారం చేస్తారా..?చెరుకుతోటలు కావాలని తగులపెట్టి మాపై నిందలు వేస్తారా..?


ఈ ప్రాంతంలో 74% బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం,క్రిస్టియన్ మైనారిటీలే..26% మాత్రమే అగ్రకులాలవారు. మొత్తం 14కులాలు ఉన్నాయి అమరావతిలో. రాబోయే రోజుల్లో ఇదొక కాస్మోపాలిటన్ సిటిగా ఉండాలని, బైటివాళ్లు కూడా ఇక్కడికొచ్చి స్థిరపడాలన్న లక్ష్యంతో అభివృద్దికి నాంది పలికాం.
భూములిచ్చిన రైతులకు మంచి ప్యాకేజి ఇచ్చాం. ఏడాదికి 10% యాన్యుటి పెంచాం. రైతు కూలీలకు పెన్షన్లు ఇచ్చాం. అలాంటిది అసైన్డ్ భూములు ఆక్రమించారని నిందలు వేస్తారా?


 ''600ఎకరాల అసైన్డ్ భూములు మా నాన్న కొన్నాడని, ఆయనకు చట్టం తెలియదని'' 30ఏళ్లు అనుభవించాక అసెంబ్లీలో చెప్పింది రాజశేఖర రెడ్డి కాదా..? నేనేమైనా అలా చేశానా..? 


కులం చూసి అభివృద్ది చేసేవాడినా నేను..? నా కుటుంబం కోసమో, నా పార్టీ కోసమో, నా బంధువుల కోసమో నేను అభివృద్ది చేయలేదు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, బిడ్డల భవిష్యత్ కోసం చేశాను.
ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే ఆరోపణలు చేశారు, 6నెలలైనా ఎందుకని రుజువు చేయలేక పోయారు..? కావాలని ఆరోపణలు చేసి కాలయాపన చేశారు. 


అమరావతిని ముంపు ప్రాంతంగా ప్రచారం చేస్తారా..? 1853 వరదల్లో, 2009వరదల్లో ఎక్కడా ఎలాంటి ముంపు జరగలేదని, కరకట్టలు, గట్ల ఏర్పాటు వల్ల రాజధాని ప్రాంతానికి, వరద ముప్పేమీ లేదని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. తరువాత ఆహార భద్రతకు ముప్పుందని మళ్లీ కోర్టుకెళ్లారు. 


మొదటినుంచి అమరావతిపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. 
ఇక్కడి నేలకు పటుత్వం లేదని, నిర్మాణాలు నిలబడవని ప్రచారం చేశారు. హైదరాబాద్ కన్నా, చెన్నై కన్నా ఇక్కడి నేలలు పటిష్టమైనవని, బలమైన పునాదులున్న ప్రాంతమని చెన్నై ఐఐటి నివేదికలో చెప్పారు. రాకీ నేలలు 11మీటర్లలో మొదలవుతాయని, సాయిల్ బేరింగ్ కెపాసిటి చమీకు 150మెట్రిక్ టన్నులని చెప్పింది. హైదరాబాద్ లో  బ్లాస్టింగ్ 4.5మీటర్లు, బేస్ మెంట్ 7.1మీటర్లు మొత్తం 11.6మీటర్లు వెళ్లాలని, బ్లాస్టింగ్ రాళ్ల తొలగింపు రవాణా వ్యయం అధికమని చెప్పారు.


ఇటీవల భారతదేశం మ్యాప్ లో ఏపి రాజధానిగా అమరావతిని చూపించకపోతే మీకు బాధ్యత లేదా..? 5కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే స్పందించాల్సిన బాధ్యత లేదా? 23మంది ఎంపిలను,151ఎమ్మెల్యేలను గెలిపిస్తే దానిపై కనీసం మాట్లాడరా..? లోక్ సభలో గల్లా జయదేవ్ ప్రశ్నించారు, టిడిపి ఎంపిలు ముగ్గురు నిలదీశారు, పట్టుబట్టి మ్యాప్ లో అమరావతిని పెట్టించారు. 


ఇప్పటికే శివరామకృష్ణన్ కమిటి రాజధాని ఎక్కడో చెబితే, మళ్లీ 6ఏళ్ల తరువాత ఇప్పుడీ కమిటిలు ఎందుకు..? మళ్లీ కమిటీల నియామకం ఏంటి..?
అమరావతితోపాటు విశాఖ,తిరుపతి,కర్నూలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి గత 5ఏళ్లలో టిడిపి ప్రభుత్వం కృషి చేసింది. 


చిన్నదేశమైనా ఎంతో విశ్వసనీయత ఉన్న దేశం సింగపూర్. అలాంటి దేశాన్ని ఒప్పించి సింగపూర్ కన్సార్షియం తెచ్చాం. భూమి హక్కులు సిఆర్ డిఏకే ఉండేలా 58: 42 వాటాలతో అమరావతిని ఒక మోడల్ సిటిగా అభివృద్దికి ప్రణాళిక రూపొందించాం. దానిపై దుష్ప్రచారం చేసి సింగపూర్ ను తరిమేస్తారా..?


చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కాదా అమరావతి..? కాలక్రమేణా వ్యవసాయ పనులకే పరిమితం అయ్యింది. అలాంటిది ఇప్పుడు రాజధానిగా ప్రకటించాక, సింగపూర్ వచ్చాక మళ్లీ వెలుగు వచ్చింది. రూ.43వేల కోట్ల అవినీతి కేసులలో ఉన్న మీరు సింగపూర్ దేశాన్ని తప్పు పడతారా..?
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాసిన లేఖలోనే తామెందుకు వైదొలుగుతున్నామో స్పష్టంగా చెప్పారు.


స్మశానం అని అమరావతిని అంటారా..? స్మశానంలో కూర్చుని ఆ మంత్రి(బొత్స) పనిచేస్తున్నారా..? మీ ముఖ్యమంత్రి స్మశానంలోనే కేబినెట్ సమావేశాలు పెడుతున్నారా? హైకోర్టు, సచివాలయం,అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని స్మశానం అంటారా..? రాజధాని నిర్మాణం మా ప్రాధాన్యతాంశం కాదని బుగ్గన అంటారా..?


రైతుల త్యాగాలతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా, టిడిపి పట్ల ప్రజల్లో విశ్వసనీయతతో చేశాం. అన్ని ప్లాట్లు ఇచ్చినా, ఇంకా 9వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లో చ.గ రూ.36వేలు ధర పలికింది. అదీ సంపద సృష్టించే విధానం..?
హైదరాబాద్ కన్నా మెరుగైన ప్రణాళికా బద్దమైన అభివృద్దికి అమరావతిలో నాంది పలికాం. అండర్ గ్రవుండ్ డక్ట్ లతో భవిష్యత్తులో రోడ్లు పగలకొట్టే పనిలేకుండా, కరెంటు స్థంభాలు, కేబుల్ తగిలి చెట్లు నరికే పనిలేకుండా ప్లానింగ్ చేశాం. రూపాయి ఖర్చు ప్రభుత్వానికి లేకుండా, ఎదురు ఆదాయం ప్రభుత్వానికే వచ్చేలా రూ.లక్ష కోట్ల నుంచి రూ.2లక్షల కోట్ల ఆస్తి ప్రజలకు, రాష్ట్రానికి దక్కేలా చేశాం.


రైతులిచ్చిన భూముల ద్వారా రూ.2లక్షల కోట్ల సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం. హెవీ మెషీనరీతో వేలాది కూలీలు ఒక జాతరగా పనిచేశారు. ఎన్నోవృత్తులవారికి  జీవనోపాధి వచ్చింది.


18% జీఎస్టీ ప్రభుత్వానికి వచ్చింది, ఆదాయ పన్ను, సేవాపన్ను ద్వారా రాబడి సమకూరింది. అలాంటిది లండన్ లాగా రాజధానిని అభివృద్ధి చేయలేమని బుగ్గన ఎగతాళి చేస్తారా..?


ప్రజల ఆశలను, బిడ్డల భవిష్యత్తును చంపేసే హక్కు ఎవరిచ్చారు..? 13జిల్లాల బిడ్డల జీవనోపాధిని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు..? అద్భుత ఆలోచనతో ప్రారంభమైన అమరావతిని ఆదిలోనే చంపేశారు.


మంత్రి బొత్స కన్ఫ్యూజన్ మాస్టర్..తలాతోక లేకుండ మాట్లాడతారు.
మీరన్నా వాడుకోవచ్చు కదా ప్రజావేదికను..? ఏం పాపం చేసిందని కూల్చేశారు..? మీటింగ్ పెట్టుకోడానికి ఒక కమ్యూనిటి హాల్ కూడా లేని పరిస్థితి.. ఇంతవరకు డెబ్రీస్ కూడా తీయలేదు.. మరెందుకు కూల్చారు..? 


కార్లు పెట్టుకోడానికి, కనీసం కూర్చోడానికి చోటు లేదని లాయర్లు ఫిర్యాదు చేస్తున్నారంటూ,  కనీసం కప్పు టీకూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారని హైకోర్ట్ వ్యాఖ్యానిస్తే కనీసం స్పందించాల్సిన బాధ్యత లేదా..? 
హైకోర్టు చెబితే లెక్కలేదు, మేధావులు చెబితే లెక్కలేదు. 


ఏపిలో పెట్టుబడులు పెట్టబోమని లులూ గ్రూప్ ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో భయాలు పెరిగిపోయాయని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దక్షిణాది బీహార్ లా ఏపి మారిందని మరో సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. సింగపూర్ కన్సార్సియం రద్దు ఏపికి దుర్వార్త అంటూ, ఇది ఏపి సీఎం జగన్ చేస్తున్న హరాకిరి(ఆత్మహత్య) అని ప్రముఖ పారిశ్రామిక వేత్త మోహన్ దాస్ పాయ్ అన్నారు. 


గత 5ఏళ్లలో అమరావతిలో ఏం అభివృద్ధి చేశామో కనబడలేదా..? అసెంబ్లీ,సెక్రటేరియట్,హైకోర్టు కనబడలేదా..? ఐఏఎస్,ఐపిఎస్ అధికారుల నివాస భవనాలు, పేదల హవుసింగ్ కాంప్లెక్స్, ఆర్టీజియన్ రోడ్లు  కనబడలేదా..?
నేను పడ్డ కష్టాన్ని నాశనం చేస్తుంటే అది తప్పని చెప్పడానికి ఈ రోజున నేను వస్తుంటే నా మీద చెప్పులేయిస్తారా, డిజిపి వాళ్లనే సమర్ధిస్తారా..? 


5కోట్ల ప్రజలను అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా, అమరావతి అభివృద్ది వల్ల సంపద పెరుగుతుందా లేదా..? ప్రభుత్వానికి దీనివల్ల ఆదాయం వస్తుందా రాదా..? ఆలోచించండి.
వితండవాదం చేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి,బిడ్డల భవిష్యత్తును దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు..?


రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోయింది, అమరావతిని నిర్వీర్యం చేశారు, పెట్టుబడిదారులు పారిపోతున్నారు. ఈవిధంగా చేస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు..?రిలయన్స్ రూ.15వేల కోట్ల పెట్టుబడి, అదాని రూ.70వేల కోట్లు,ప్రకాశం జిల్లా పేపర్ మిల్స్ రూ.25వేల కోట్లు, లులూ రూ.2200కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి. 


నా గురించి కాదు నా ఆలోచన.. 14ఏళ్లు సీఎంను, 11ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతను, 25ఏళ్లు పార్టీ అధ్యక్షుడిని. నాకింకా ఏం కావాలి..? నా తపన అంతా ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే.


నాకన్నా ఇంకా మరో రూ.10వేల కోట్లు పెట్టుబడులు ఎక్కువగా తెండి..నేను ప్రపంచంలో 5వ అద్భుత నగరంగా నిర్మించాలని అనుకుంటే మీరు నెంబర్ వన్ సిటిగా అభివృద్ది చేయండి. పాజిటివ్ గా అందరూ ఆలోచించండి. అంతే తప్ప నన్ను బూతులు తిడితే, నాపై దుష్ఫ్రచారం చేస్తే ప్రజలు హర్షించరు.


రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా..బూతులు తిట్టినా సహిస్తా.కానీ రాష్ట్రాన్ని అంధకారం చేయవద్దండి. 


అమరావతి జోలికి  రావద్దని, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హెచ్చరిస్తున్నా.