సాములోరూ...  సంబరాలు ఏమిటో..?

సాములోరూ...  సంబరాలు ఏమిటో..?
◆ గవర్నర్, సిఎంల సాష్టాంగప్రమాణాలు
◆ ఆలింగనాలు - చుంబనాలు
◆ అధికార పీఠం కోసం యాగాలు


 


*_అధికార పీఠాల కోసం ఆద్యాత్మిక పీఠాలు తపస్సు చేయడం ఏమిటి..? స్వాములంటే ఎవరు..? పీఠాలంటే ఏమిటి..? అసలు సన్యసించడం అంటే ఏమిటి..? విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రవర్తన హిందూ సమాజంలో ఈ ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఆ స్వరూపుడు ఎవరి స్వరూపుడు..? ఏ స్వరూపుడు..?  ఒక స్వామిగా ప్రకటించుకున్న వ్యక్తి రాజకీయ నాయకులకు ఈ ముద్దులు ఇవ్వడం ఏమిటి..? ఆలింగనాలు ఏమిటి..? ప్రవచనాలు చెప్పాల్సిన ఆధ్యాత్మిక వేత్తలు.. అట్టహాస ఘీంకరాలతో రాజకీయ కదనరంగంలోకి కత్తులు దూసి ఎగిరి మరీ దూకుతున్నారు. ఉత్తర భారతంలో రాజకీయ స్వావిూజీల ప్రాబల్యం అధికం. రాజకీయ నేతల, అధికార అండదండలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నాయి. నాలుగు క్రితం చిన్నజియ్యర్ స్వామి, ఇప్పుడు స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సర్వసంగ పరిత్యాగులకు ఈ సంబరాలు ఎందుకు..? ఎవరి కోసం..? గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా సాష్టాంగప్రమాణాలు ఏమిటి..? అసలు ఒక సామాన్యుడు దగ్గరకు వస్తే కాళ్లు మొక్కటానికి కూడా తాకనివ్వని స్వామి… తనే ఈ చుంబనాలకు, కౌగిళ్లకు దిగడం ఏమిటి..? అంటే బాహ్య బహు బంధాలు వీర మనస్సులను వీడినట్లు లేదు.  


*ఇదేమిటి పెద్దల్లారా..:*
నమ్మకం ఉడటం వేరు. అది ప్రదర్శించే తీరే అభ్యంతర కరం. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా బహిరంగ వేదికలపై సాష్టాంగంపడితే ఏల..? వీరు అత్యున్నత స్థాయి వ్యక్తులు. వీరు కోట్లాది మంది ప్రజలకు మార్గదర్శకులు. వీరికి స్వామీజీలపై నమ్మకం ఉండటం వారి వ్యక్తిగతం. వారు రహస్యంగా చాలా మంతనాలు చేస్తారు. ఇలా ఏ స్వామీజీ పాదాలను తాకాలనుకుంటే ఓ గదిలో ఒకరిద్దరు వందిమాగధలు ఉన్నప్పుడు ఏ కెమెరాలకు చిక్కకుండా చేసుకుంటే నలుగురికి తెలియదు. ఇలా బహరంగంగా చేయటం వలన ఆ, యా హోదాలు ఈ సాములోరి ముందు మోకరిల్లిటంపైనే మా ఆక్షేపణ అంతా. భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటారని ఆశిద్దాం.


*ఆడంబరాలు చూడండి...:*
ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరిగిందో లేదో తెలియదు కానీ విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి  వారి పుట్టిన రోజు మాత్రం అద్భుతంగా జరిగింది. ఏకంగా ప్రభుత్వమే దిగివచ్చేసింది. ఓ వైపు గవర్నర్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక మంత్రులు సామంతులకు ఆశ్రమమే సచివాలాయంగా అయిపోయింది. స్వామిజీ ఇంతవరకూ అనేక పుట్టిన రోజులు జరుపుకున్నారు. కానీ ఈసారి జరిగిన వేడుక మాత్రం నభూతో నభవిష్యత్ అన్న తీరున సాగిపోయింది. ఏకంగా ప్రభుత్వమే దగ్గరుండి 'ఈ వేడుకను జరిపించిందా..!' అన్నంత గొప్పగా స్వామి జన్మదినం వైసీపీ సర్కార్ పర్వదినంగా చేశారు. విశాఖ స్వామిజీకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలపడంతో మొదలైన హడావుడి రోజంతా అంగరంగ వైభవంగా సాగిపోయింది.


*రాజకీయుల హడావుడి..:*
పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. వేపగుంట కూడలి నుంచి పీఠం వరకు ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. చినముషిడివాడ - శ్రమశక్తినగర్‌ మార్గంలో సందడి నెలకొంది. శారదాపీఠం నుంచి పార్వతీనగర్‌ వెళ్లే రహదారి మధ్యలో భారీ వేదికను ఏర్పాటు చేశారు.


*మహా మహులే అతిధులుగా….*
స్వామీజీ పుట్టిన రోజు వేడుకలు వారం పది రోజుల ముందు నుంచి విశాఖలో ప్రారంభం అయిపోయాయి. ఎన్నడూ లేని విధంగా రియల్టర్లు భారీ కటౌట్లు నగర వీధుల్లో పెట్టి స్వామికి అభినందనలు తెలపడం ఈసారి విశేషంగా చెప్పుకోవాలి. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి జన్మదిన వేడుకలు మాదిరిగా స్వామి పుట్టిన రోజుకు విశాఖ మొత్తం ముస్తాబు చేసేశారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, స్పీకర్ తమ్మినేని సీతారాం , ఎంపీలు, ఎమెల్సీలు, అధికారులు అనధికారులు రోజంతా ఆశ్రమంలోనే గడిపారంటే స్వామి ఎంతటి శక్తిమంతుడో చాటి చెప్పినట్లైంది.


*రాజకీయ రంగులు….:*
స్వామి సహజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో అభిమానించేవారని పేరు తెచ్చుకున్నారు. ఇక అయిదేళ్ల పాటు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నపుడు బాబుకు వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ చేసి తమ్ముళ్ల ఆగ్రహానికి గురి అయ్యారు. బాబు సీఎంగా ఇలా ప్రమాణం చేశారో లేదో రాత్రి ముహూర్తాన ప్రమాణం చేయడం రాష్ట్రానికి అరిష్టమంటూ స్వామి చేసిన ప్రకటనలు నాడు కలకలం రేపాయి. ఇక పుష్కరాల సందర్భంగా బాబు సర్కార్ ని స్వామి తప్పుపడుతూ నాడు ఇచ్చిన స్టేట్ మెంట్స్ వేడి పుట్టించాయి. గుళ్ళను తొలగిస్తున్నారని, హైందవ ధర్మాన్ని కాలరాస్తున్నరని, తాను బాబుపైన ధర్మ పోరాటం చేస్తానని బాహాటంగా ప్రకటించిన స్వామిజీ బాబుకు టార్గెట్ అయ్యారు.


*జగన్ దగ్గర కావడంతో…*
ఇక అప్పట్లో స్వామీజీ ఆశ్రమం మీద టీడీపీ సర్కార్ వేధింపులకు పాల్పడిందని కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మరో వైపు స్వామికి దగ్గర కావడం, ఆయన అనుకున్నట్లుగా మంచి మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కావడంతో స్వామి రాజగురువు పాత్రలోకి మారిపోయారని టీడీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. దానికి కొనసాగింపుగా స్వామి జన్మదినాన్ని వైసీపీ దగ్గరుండి జరిపించిందని కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి స్వామి తాను అన్నిటికీ అతీతుడిని, కేవలం ధర్మ పరిరక్షణ తన ధ్యేయమని చెబుతున్నా కూడా ఆయన పుట్టిన రోజున మొత్తం వైసీపీ నేతల హడావుడి చూస్తూంటే స్వామివారు ఒకింత ఆనందంగానే ఉన్నట్లున్నారు.