హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి

హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి
గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలి
ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్...


గూడూరు, సుదినం న్యూస్.


గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కటకరాజావీధిలోని
ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  భారతదేశంలో ప్రతి 15 సెకండ్లకు ఓ ఆడపిల్ల మానవ రూపంలో ఉన్న మృగాల దాడికి   గురవుతోందన్నారు.  ఒకరోజున  సగటున 92 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదిక అన్నారు. అలాగే గడచిన 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మూడు లక్షల 59వేల 349 మంది పై అత్యాచార దాడుల కేసులు నమోదైనాయన్నారు. అందులో అత్యధికంగా యూపీలో 56 వేల పదకొండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.  ఇది చాలా దారుణమన్నారు.  9 నెలల పసికందులను కూడా పొట్టన పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.   మొన్న శంషాబాద్ లో జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన, నిన్న ఢిల్లీలో  దిశ అనే అమ్మాయి పై జరిగిన దాడిని, జైపూర్ లో ఆరేళ్ల చిన్నారిపై ఓ ట్రక్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడి కిరాతకంగా  చంపేయడం, అదే  రాజస్థాన్ లో కన్నతండ్రి తన కుమార్తెను గొలుసులతో కట్టి మరీ అత్యాచారానికి పాల్పడడం ఏపీఎండబ్ల్యూఓ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇలాంటి మానవ మృగాలను మరణ శిక్ష విధించాలన్నారు. గల్ఫ్ దేశాలలో అమలు చేసే చట్టాలను మన దేశంలోనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు.  జిల్లా ఉపాధ్యక్షుడు షేక్. కాలేష,జిల్లా గౌరవ సలహాదారులు మొహమ్మద్ అన్వర్ లు మాట్లాడుతూ కఠిన శిక్షలు అమలు చేస్తేనే స్త్రీలకు, పసిబిడ్డలకు దేశంలో  రక్షణ కలుగుతుందన్నారు, ఇప్పటికే అనేక చట్టాలు నిర్భయ, ఫోక్సో యాక్టులు ఉన్నప్పటికీ  విచారణల పేరుతో జైళ్లలో ఉంచి బిరియానీలు పెట్టి పెంచుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు, నేరం జరిగిన వెంటనే 48 గంటల్లో ఆ నిందితులను మరణ శిక్ష విధించాలన్నారు. అప్పుడే నేరం చేయాలన్న తలంపు వచ్చినా వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు, ఈ సందర్భంగా శంషాబాద్ లో అసువులు బాసిన దిశ ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ జమాలుల్లా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హంషీద్ అలీ,ఉపాధ్యక్షుడు ఇందాద్ అలీ, జిల్లా లీగల్ కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా,గూడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్. జహీర్,నెల్లూరు రూరల్ అధ్యక్షుడు యాసీన్,జిల్లా సంయుక్త కార్యదర్శి జాహిద్, గూడూరు యువత అధ్యక్ష/ఉపాధ్యక్షులు బాబు, ఎస్డాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమీర్,షరీఫ్,షాకిర్ తదితరులు పాల్గొన్నారు.