సబ్సిడీపై పట్టాలు ఇవ్వాలని మిర్చి రైతుల వినతి

సబ్సిడీపై పట్టాలు ఇవ్వాలని మిర్చి రైతుల వినతి


_మిర్చి రైతులకు సబ్సిడీపై టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గతంలో సీజన్లో ప్రభుత్వం సబ్సిడీపై పట్టాలు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జి.కొండూరు గ్రామానికి చెందిన పలువురు మిర్చి రైతులు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకున్నారు. గతంలో ఉద్యానవన శాఖ ద్వారా 11 వేల రూపాయల విలువైన పట్టాలను 6000 రూపాయల వరకు రైతుల వద్ద వసూలు చేసి పట్టాలను ఇచ్చారన్నారు. కానీ ఈ ఏడాది ఇంతవరకు పట్టాలు ఊసే లేదన్నారు. 40 - 60 అడుగులు, 40-40 సైజులలో గత ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేసిందన్నారు. మిర్చి కోతలు మొదలయి పది రోజులు అవుతుంది అన్నారు. ఈ పరిస్థితుల్లో టార్పాలిన్ పట్టాలు లేక రైతులు ఏం చేయాలో తోచని  పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో మాదిరిగా తమకు ఈ ఏడాది కూడా సబ్సిడీపై పట్టాలు చేస్తే మిర్చి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో పట్టాలు కొనుగోలు చేయడానికి తమ ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోసిన మిర్చిని చినిగిపోయిన, నాశనమైన పట్టాల మీద, నేలమీద పరుచుకుని ఉన్నామని రైతులు పేర్కొన్నారు. ఒకవేళ అకాల వర్షం వస్తే పంట మొత్తం తడిసిపోయే అవకాశం ఉందన్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు తమ సమస్యపై స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తమకు ఉద్యానవన శాఖ నుంచి సబ్సిడీపై పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు._