లంచం కోసం అతని ఇంటి వద్దకే వెళ్లి డిమాండ్‌
ఏసీబీ అధికారుల కథనం మేరకు.... కేవీపల్లె మండల గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పీలేరులోని కోటపల్లెలో నడుస్తోంది. పీలేరుకు చెందిన ఖాదర్‌వలీ అనే ప్రభుత్వ అధీకృత కాంట్రాక్టరు ఈ పాఠశాలకు పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, చికెన్‌ సరఫరా చేస్తుంటాడు. ఇతనికి గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రూ.5.15 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పాఠశాల ప్రిన్సిపాల్‌గా గత ఆగస్టులో బాలాజీ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న తన బకాయిలను ఇవ్వాల్సిందిగా ఖాదర్‌వలీ పలుమార్లు ఆయన్ను కలిసి అభ్యర్థించగా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదని బుకాయించేవాడు. మరో 12 గురుకులాలకు కాంట్రాక్టరుగా ఉన్న ఖాదర్‌వలీ తనకున్న పరిచయాలతో ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను ప్రిన్సిపాల్‌ కావాలనే ఇవ్వడం లేదని తెలుసుకుని గట్టిగా నిలదీశాడు.

 

దీంతో తనకు రూ.2 లక్షల లంచం ఇస్తేగానీ చెక్కులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనన్న ఖాదర్‌వలీ మాటలను పట్టించుకోకుండా లంచం కోసం అతని ఇంటి వద్దకే వెళ్లి డిమాండ్‌ చేయడం ప్రారంభించాడు. ఆదివారం రాత్రి కూడా ఖాదర్‌వలీ ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండు చేసినట్లు తెలిసింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఖాదర్‌వలీ తిరుపతిలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన సొమ్మును మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్‌కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పాఠశాల సిబ్బందిని విచారించాక హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, కొన్ని రికార్డులను సీజ్‌ చేసి తమ వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి బాలాజీ నాయుడిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ ఏఎస్పీ శ్రీనివాస్‌ నేతృత్వంలో సాగిన ఈ ఆపరేషన్‌లో డీఎస్పీలు అల్లాబక్ష్‌, జనార్దన నాయుడు, సీఐలు గిరిధర్‌, ప్రసాద్‌రెడ్డి, రవికుమార్‌, నాగేంద్ర, ఎస్‌ఐ సూర్యనారాయణతోపాటు వాణిజ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

 

గిరిజన గురుకుల పాఠశాలపై ఏసీబీ అధికారుల దాడి మంగళవారం పీలేరులోని ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో కలకలం రేపింది. పడమటి మండలాల రెవెన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు మరిచిపోకముందే పీలేరులో దాడులు జరగడంతో అధికారుల్లో ఆందోళన చోటుచేసుకుంది.