10 వ తరగతి పరీక్షలు వాయిదా కై హైకోర్టు లో పిటీషన్.

హైకోర్ట్ లో పిటీషన్..


 వెంటనే స్పందిస్తాం అని చెప్పిన ప్రభుత్వం..
 ఊపిరి పీల్చుకున్న ప్రజలు.


ఒక పక్క కరోనా మహమ్మారి విరుచుకు పడుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే,
 ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రకటనతో మాత్రం ప్రజలు అవాక్కయ్యారు. పదవ తరగతి పరీక్షలు యదాతధంగా ఉంటాయని ప్రకటించారు. అంటే, మార్చ్ 31 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఒక పక్క లాక్ డౌన్ అని చెప్తూ, ట్రాన్స్ పోర్ట్ ఉండదు అని చెప్తూ, ఆ రోజు పరీక్ష పెట్టడం పై అందరూ ఆశ్చర్యపోయారు. దీని పై జగన్ ను ప్రశ్న అడగగా, ఆయన ప్రెస్ మీట్ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మరో పక్క నిన్న అత్యవసర పరిస్థితి జాబితాలో, పదవ తరగతి పరీక్షల పేపర్లు, రవాణాని చేర్చారు. ఒక పక్క దేశం మొత్తం భయపడుతుంటే, ఏపి ప్రభుత్వం, ఇలా ఒకేసారి కొన్ని లక్షల మంది పిల్లలు రాసే పరీక్షలు ఎలా అంగీకరిస్తుంది అనే భయం పట్టుకుంది.


ప్రజలు ఆందోళన చెందుతున్నా, ప్రభుత్వం ముందుకు వెళ్ళటంతో, ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా వెయ్యాలి అంటూ, ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ ను హైకోర్ట్ పరిశీలనలోకి తీసుకుంది. అయితే వెంటనే ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వం ఈ విషయం పై వెంటనే స్పందిస్తుందని, ఆ నిర్ణయం వచ్చే దాకా వేచి చూడమని చెప్పారు. ఇలా చెప్పిన కాసేపటికే, ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.


కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 నుంచి నిర్వహించాల్సి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు కరోనా వైరస్‌ బారిన పడటంతో, కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పది పరీక్షలు మళ్లీ ఎప్పడు నిర్వహించేది మార్చి 31 తర్వాత ప్రకటించనున్నట్టు చెప్పారు. అయితే, ఈ నిర్ణయంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులో పిటీషన్ వెయ్యక ముందే, నిన్నటి నుంచి ప్రభుత్వం ఈ విషయం పై తర్జన బర్జనలు పడుతుందని, పరీక్షలు వాయిదా వెయ్యాలని, నిన్నే అనుకున్నామని, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏదైతేనేం, ప్రజలకు మంచి జరిగింది.