కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ..

 


ఇప్పటికే బడుగులకు సాయం ప్రకటించిన  తెలుగు రాష్టాల సీఎంలు
తెలంగాణలో 1500, ఆంధ్రాలో వెయ్యి రూపాయలు
ఆర్ధిక ప్యాకేజీ ముచ్చటే లేని మోదీ
ఆందోళనలో మధ్యతరగతి భారతం


 


కరోనాపై యుద్ధం ప్రకటి ంచిన ప్రధాని మోదీ.. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు, అనూహ్య స్పందన వస్తోంది.
ఆయన ఇచ్చిన ఒక్క పిలుపునకు, జాతి యావత్ చప్పట్లు చరిచి మద్దతునిచ్చింది. కానీ.. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటి నిర్ణయాలతో కుదేలైన సగటు మనిషిని, ఆర్ధికంగా ఆదుకునే చర్యలకు ఇప్పటివరకూ శ్రీకారం చుట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలు తమ శక్తికిమించి పనిచేస్తున్నాయి.
ఈ విషయంలో మోదీని వ్యక్తిగతంగా- రాజకీయంగా వ్యతిరేకించే కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్షాలు, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ఆయన ఇచ్చిన పిలుపును చిత్తశుద్ధితో అమలుచేస్తున్నాయి. అయితే, కరోనాతో సగటు జీవి ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమవుతోంది.
పనులు లేక సామాన్య- మధ్య తరగతి భారతం  ఇబ్బందిపడుతోంది. దీనితో పలు రాష్ట్రాలు, పేద, మధ్య, బడుగు వర్గాలను ఆదుకునేందుకు కొన్ని ఆర్ధిక ప్యాకేజీలు, ఇతర సహాయ కార్యక్రమాలు ప్రకటించాయి.


తెలంగాణలో రూ.1500


ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండే తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా సమయంలో మరింత ఉదార స్వభావం చూపారు.
ఇప్పటికే కరోనాపై యుద్ధంలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్,  తెల్లకార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 వందల నగదు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇందుకోసం 2417 కోట్ల రూపాయలు ప్రకటించారు. బడ్జెట్‌లో లేకపోయినా దీనిని కేటాయించామని, అవసరమైతే ఎన్ని వేల కోట్లయినా ప్రజారోగ్యానికి ఖర్చు పెడతామని భరోసా ఇచ్చారు.


ఆంధ్రాలో రూ.1000


అటు ఏపీ సీఎం జగన్ కూడా పేద, మధ్య, బడుగు వర్గాల కోసం తమ వంతు సహాయం ప్రకటించారు.
తెల్లకార్డులున్న వారికి వెయ్యి రూపాయల నగదు, రేషన్, కిలో కంది పప్పు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఏపీ సర్కారు ఖజానా ఆర్ధిక సంక్షోభంలో ఉంది.
అలాంటి క్లిష్ట సమయంలో కూడా 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చూస్తే, జగన్ సర్కారు ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రాజకీయ విమర్శలు పక్కకుపెడితే.. ఇలాంటి విపత్తు వల్ల నష్టపోతున్న, కింది స్ధాయి వర్గాలను ఆదుకోవడం అభినందనీయమే.
యుపి, కేరళ ప్రభుత్వాలు కూడా ఉచిత రేషన్, ఖాతాలకు నేరుగా నగదు బదిలీ వంటి నిర్ణయాలు తీసుకుని సగటుజీవిని మెప్పించాయి.


ఆర్ధిక ప్యాకేజీ ముచ్చటే లేని మోదీ


ఆర్ధిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటూ, ప్రతిదానికీ కేంద్రం వైపు చూసే రాష్ట్ర ప్రభుత్వాలే, ఈ స్థాయిలో బడుగుల కోసం చేతనైన సహాయం చేస్తున్నాయి.
కానీ కేవలం ప్రకటనలకు  పరిమితమైన కేంద్రం మాత్రం, ఇప్పటివరకూ ఎలాంటి ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
కరోనా ప్రభావంతో అన్నీ మూతపడి మధ్య, సామాన్య తరగతి, ఉద్యోగ, వ్యాపార వర్గాలు కుదేలయిపోయాయి. చేయడానికి పనిలేక ఒకవైపు, బ్యాంకులకు చెల్లించాల్సిన నెలవారీ కిస్తీలు మరోవైపు వారిని హడతెత్తిస్తున్నాయి. చేయడానికి పనులు లేకపోతే వాయిదాలు ఎలా చెల్లించాలన్నది వారి ప్రశ్న. వాటిని మరికొంతకాలం వాయిదా వేస్తే మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో ఆర్ధిక ప్యాకేజీ, రాయితీలు ప్రకటించాల్సిన కేంద్రం.. అది తన బాధ్యత కాదన్నట్లు, నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్, వామపక్షాలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. చప్పట్లు కొట్టడం కాకుండా, పేదవారికి మీరిచ్చే ఆర్ధిక ప్యాకేజీ సంగతి తేల్చమని.. సోనియా, రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పన్నులు, రుణాల చెల్లింపు, చెల్లింపును ఈ నెల రోజులు రద్దు లేదా వాయిదా వేయడం, ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం వంటి చర్యలు తీసుకోకపోతే.. మధ్యతరగతి వర్గం మరింత ప్రమాదంలో పడుతుందని అటు ఆర్ధిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినా, ఇప్పటివరకూ కేంద్రంలో చలనం లేకపోకపోవడం విమర్శలకు తావిస్తోంది.