ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిగారికి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుగారు రాసిన ఉత్తరం చూసి తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తోంది. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా తన పార్టీకి చెందిన అరడజను మందితో అడ్డదిడ్డంగా ఈరోజు ప్రెస్‌మీట్లు, ప్రెస్‌నోట్ల రూపంలో బాబుగారు మాట్లాడించారు. రాజధానిలో వేల భూములు మీకు కావాల్సిన ఎవరికైనా ఇచ్చుకోవచ్చుగాని, పేదలకు ఇవ్వకూడదన్న మీ వాదన మీలో ఏ స్థాయిలో మానవత్వం ఉందో, ఏస్థాయి నైతిక విలువలు ఉన్నాయో తెలిజేస్తున్నాయి. ప్రపంచం మొత్తం కరోనాను నిరోధించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే అంశంమీద సతమతం అవుతుంటే... దీన్నికూడా చంద్రబాబుగారు ఒక రాజకీయ అవకాశంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రిగారు నిన్న ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతకుమించి కూడా స్పందిస్తూ అటు రేషన్ విషయంలోకాని, ఇటు డబ్బు అందజేసే విషయంలోకాని చర్యలను ప్రకటించడం జరిగింది. ఇలాంటి సమయంలో చంద్రబాబుగారు మానవత్వంతో మౌనంగా ఉండటమో లేదా రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సంపూర్ణ మద్దతు తెలియజేయటమో కాకుండా, ఇంకా ఎక్కువగా ఇవ్వాలంటూ ఒక ఉత్తరం రాశారు. ఆయన్ని ఇప్పుడు మేం నేరుగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబుగారు మీ జీవితంలో మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈ మొత్తం రాజకీయ జీవితంలో ఏ రోజన్నా ప్రతి కుటుంబానికీ ఒక రూపాయి అయినా సహాయం చేశారా?
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రారంభమై కేవలం 9 నెలలు మాత్రమే. ఈ 9 నెలల్లోనే కోటిన్నర కుటుంబాలకుపైగా ప్రభుత్వం నుంచి నగదు బదిలీ పథకం ద్వారా, ఎటువంటి బ్యాంకులు జమ చేసుకోనీయకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని అందుకున్నాయి. రైతు భరోసా కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, మత్స్యకారులకు కానీయండి, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కానీయండి, నేతన్నలకు కానీయండి, గతంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు కానీయండి, మీరు చెల్లించకుండా పారిపోయినా ఈ ప్రభుత్వం చేసిన చెల్లింపుల కానీయండి, జగనన్న వసతి దీవెన కానీయండి, ఫిబ్రవరి వరకూ మీరు వేయి రూపాయలు పింఛను ఇస్తే.. ఇప్పుడు రూ.2250లు అవ్వాతాలకు ఇస్తున్న పరిస్థితులు కానీయండి. ఇవన్నీ కూడా ఈరాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశాలు. చివరకు వైద్యం, విద్యారంగంలో కూడా తీసుకువస్తున్న పెను మార్పులు కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచే ప్రాంభం అయ్యాయి. ప్రజల అవసరాలు, ప్రజల గుండెచప్పుడు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే ఈప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం గురించీ నిజాయితీగా ఆలోచిస్తోంది. మీ లేఖలో, మీ మనసులో అలాంటి నిజాయితీ ఏ కోశానా కనిపించడంలేదు. ఈ కరోనా సమయంలో ఇక ఇప్పుడు మీరు ప్రెస్‌మీట్లు పెట్టి రాజకీయ విమర్శలు చేయటం మానుకుంటే.., మీ వయసుకైనా కాస్త అర్థం ఉంటుంది. మీ ఛానళ్లు, మీ పత్రికలు అలాంటి సంస్కారాలను ఏ కోశానా ప్రదర్శించడం లేదు. మీకు అధికార పిచ్చితోపాటు రాజకీయ పరమైన ఈర్ష్యకూడా ఏ స్థాయిలో ఉందో మిమ్మల్ని, మీ ఛానళ్లను చూస్తే అర్థం అవుతుంది. యుద్ధాలు వచ్చినా, అంతకుమించి ముప్పు వాటిల్లినా మీరు మాత్రం మారరు. మీ బుద్ధికూడా మారదని అర్థం అవుతోంది. కాస్తంత మనుషులుగా ప్రవర్తించండి.