రైతుల సమస్యలపై సమీక్ష.

అమలాపురం, మార్చి 27


రావులపాలెం అరటికాయ
 మార్కెట్ యార్డ్ నందు రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించిన జాయింట్ కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, కోతపేట శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి 


రైతులు వారు పండించిన అరటి అమ్ముకునేందుకు వ్యాపారస్తులు ముందుకు రావట్లేదని ఒకవేళ వచ్చినా తక్కువ ధరకు కొంటున్నారని అందువల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరిగితేనే తమ పరిస్థితులు మెరుగుపడతాయని తెలియ చేశారు.
మార్కెట్ కు గెలలు అమ్ముకోడానికి వచ్చే రైతులుకు కనీసం తాగడానికి టీ కూడా దొరకట్లేదని కాంటీన్ ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసారు. 
పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం కాబట్టి ఎరువులు బ్లాక్ మార్కెట్ జరగ కుండా ప్రభుత్వమే రైతులకు ప్రభుత్వ ధరలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అరటి చెట్లకు సపోర్ట్ కోసం వెదురు, సర్వే కర్రలు వేసే సమయం కావున వాటి రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని, కొత్తిమీర రైతులు వారి పంటను ఇతర ప్రాంతాలకు పంపడానికి వాహనాలకు అనుమతి పత్రాలు ఇవ్వాలని కోరారు.


రైతులు విన్నపాలు విని శాసనసభ్యులు మరియు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కారోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకుంటున్న చర్యల కారణంగా రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం రైతులకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది అని ఇది మనందరికోసం చేసేదే కానీ రైతులను నష్టపరచాలని కాదు అని తెలియచేసారు. 
మన జిల్లాలోనే అతి పెద్ద అరటికాయ మార్కెట్ ఇది అని రైతులు కూడా సహకరించి గెలలు అన్ని ఒకేసారి తేకుండా పక్వానికి వచ్చినవి, అమ్మకపోతే పాడైపోయేవి మాత్రమే తీసుకొచ్చి అమ్ముకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 
మార్కెట్ యార్డ్ నందు కాంటీన్ పునరుద్ధరించమని అధికారులకు ఆదేశించారు.
రైతులకు వెదురు, సర్వే కర్రల రవాణాకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియచేసారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని తప్పకుండా రైతు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కరోనా వైరస్ ప్రబలకుండా మాస్కులు సానిటీజర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్తిమీర రైతులకు కావాలంటే ఒక బస్ ఏర్పాటు చేస్తామని లేకపోతే వారి వాహనాలకు అనుమతి లేఖలు అందిస్తామని తెలియచేసారు. రైతులు కూడా సామాజిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన రైతు బజారు ను జాయింట్ కలెక్టర్, శాసన సభ్యులు పరిశీలించి అభినందించారు.ఆత్రేయపురం,ఆలమూరు లలో మొబైల్ రైతు బజార్లు పెడతామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించ వలసిందిగా ఎస్టేట్ అధికార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.