బాష్పవాయువు ఎలా పని చేస్తుంది?

ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?


గుంపులుగా చేరి అలజడి సృష్టించే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు (tear gas) ను ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది కాబట్టే దీనికాపేరు. యుద్ధాల్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని యుద్ధవాయువు అని కూడా అంటారు.


బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనాలను తుపాకుల వంటి ఆయుధాల్లో కూరి పేల్చడం ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాల్లో ఉంటుంది. ఆల్ఫా క్లోరా సిటెటోఫినోన(Alpha Choraceteto Phenone) అనే రసాయనం ఘన రూపంలోను, ఇథైల్‌ అయోడో ఎసిటేట్‌ (Ethyl Iodo Acetate) ద్రవరూపంలోను ఉంటాయి.


బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్పగ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లల్లో మంట పుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై నీరు ఎక్కువగా చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. కొద్ది సేపటికి తగ్గిపోతాయి.


బాష్పవాయువుకు గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితో కానీ, బోరిక్‌ యాసిడ్‌ ద్రవంతో కానీ కడగాలి. సోడియం బై కార్బొనేట్‌ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే కోసిన ఉల్లిపాయల ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు. అవి బాష్పవాయువును పీల్చుకుని కళ్లపై అంత ప్రభావం చూపవు.