నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది.

నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉందిఆయన మరణాన్ని ఆహ్వానించాడు. విప్లవం కోసం తనను తానే సమిధగా అర్పించుకున్నాడు. నిదురిస్తున్న దేశాన్ని మేల్కొలిపాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ ఒక ఆవేశపూరిత నినాదం మాత్రమే కాదు. సరికొత్త చరిత్ర నిర్మాణానికి ఇచ్చిన పిలుపు. అంతిమంగా ప్రజలు విజేతలవుతారని చేసే ప్రకటన. ఉరికొయ్యను ముద్దాడడానికి ముందు భగత్ సింగ్ విప్లవం అంటే ఏమిటో, దాన్నెలా సాకారం చేయాలో యువ రాజకీయ కార్యకర్తలకు చెప్పాడు. ఆయన వర్ధంతి సందర్భంగా తప్పనిసరిగా గుర్తుచేసుకోవలసిన విషయాలవి.ʹవిప్లవం అంటే ప్రస్తుత సామాజిక క్రమాన్ని పూర్తిగా కూలదోసి దానిని సోషలిస్టు క్రమంతో భర్తీ చేయడం. అందుకోసం రాజ్యాధికారాన్ని సాధించడం మన తక్షణ లక్ష్యం. వాస్తవానికి రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం పాలకవర్గం చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే. మనం దానిని స్వాధీనం చేసుకోవాలి. మార్క్సిస్టు సిద్ధాంత పునాది మీద కొత్త సామాజిక వ్యవస్థను నిర్మించే మన ఆశయ సాధన కోసం దానిని ఉపయోగించాలి. ఈ మొత్తం క్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మన సామాజిక కార్యాచరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.. పోరాటాల ద్వారా ప్రజల అవగాహనను పెంచగలం.ʹ


ʹ...విప్లవం అంటే బ్రిటీష్ వారి చేతుల్లో నుండి భారతీయుల చేతుల్లోకి జరిగే అధికార బదిలీ కాదు. ప్రజల మద్దతు ద్వారా విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం రావాలి. అటు తర్వాత మొత్తం సమాజాన్ని సోషలిస్టు పునాది మీద పునర్నిర్మించాలి. మీ దృష్టిలో ఉన్నది ఈ విప్లవం కాకపొతే దయచేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరవడం ఆపండి. అమెరికా తరహా జాతీయ విప్లవం కావాలంటారా, అయితే అటువంటి విప్లవ సాధన కోసం మీరు ఏ శక్తుల మీద ఆధారపడతారు? సోషలిస్టు విప్లవమైనా, జాతీయ విప్లవమైనా మీరు అధారపడదగ్గ శక్తులు కార్మికులు, కర్షకులు మాత్రమే,ʹ


ఫిబ్రవరి 2, 1931 న జైలు నుండి రాసిన లేఖలోని వాక్యాలివి. రాజద్రోహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర, బ్రిటీష్ అధికారి హత్య తదితర నేరాల కింద భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు ఉరిశిక్ష విధిస్తూ ఆనాటి న్యాయస్థానం అక్టోబర్ 7, 1930 న తీర్పు చెప్పింది. మరణాన్ని ఆహ్వానిస్తూ, తమ ఉమ్మడి ఆశయాన్ని కొనసాగించమని యువ కార్యకర్తలకు ఆ లేఖ ద్వారా పిలుపునిచ్చాడు భగత్ సింగ్. విప్లవం గురించి, విప్లవ పార్టీ నిర్మాణం గురించి, ఆనాటి జాతీయ, అంతర్జాతీయ స్థితి గతుల గురించి అందులో విపులంగా రాశాడు. సుదీర్ఘ భారత ప్రజాస్వామిక విప్లవ చరిత్రలో షహీద్ భగత్ సింగ్ ను తొలి కమ్యూనిస్టు విప్లవకారుడిగా చెప్పవచ్చు. భగత్ సింగ్ రచనలు పూర్తిగా వెలుగు చూడని రోజుల్లో ఆయన మరి కొంత కాలం బతికి ఉంటే కమ్యూనిస్టు అయ్యేవాడని అనేవాళ్ళు. ఆయన మార్క్సిజాన్ని, ముఖ్యంగా బోల్షవిక్ విప్లవాన్ని, లెనిన్ రచనలను లోతుగా అధ్యయనం చేసాడని, విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసి, కార్మికవర్గం, పేద రైతాంగం మీద ఆధారపడి విప్లవాన్ని సాఫల్యం చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని రూపొందించుకున్నాడని ఆయన చివరి రోజుల్లో రాసిన రచనల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.


పాతికేళ్ళు నిండని వయసులో అసాధారణ మేధస్సు, పీడిత ప్రజల పట్ల అచంచల ప్రేమ, దేశభవిష్యత్తు పట్ల స్పష్టమైన దృక్పథం, అసమానమైన తెగువ, సాహసం, త్యాగం చరిత్రలో ఆయన్ని శాశ్వతంగా నిలబెట్టాయి. సరిగ్గా 89 సంవత్సరాల క్రితం మార్చి 23 సాయంకాలం 7.30కు లాహోర్ సెంట్రల్ జైల్లో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీసిన బ్రిటీష్ ప్రభుత్వ అధికారులు, వారి మృత దేహాలను సట్లెజ్ నదీ తీరాన రహస్యంగా దహనం చేసారు. కానీ వారు అనుకున్నట్లు వారి చిహ్నాలు ఎన్నటికీ చేరిపెయ్యలేకపోయారు. లాహోర్ కుట్ర కేసు నడిపిన విధానం, ప్రకటించిన తేదీకి ముందే వారిని ఉరితీయడం, శవాలను కూడా బంధుమిత్రులకు మిగిలించపోవడం వెనక బ్రిటీష్ సామ్రాజ్యవాదుల అమానుషత్వం కన్నా, భీతి కనపడుతుంది. భగత్ సింగ్ సిద్ధాంతం, రాజకీయాలు వారిని భయపెట్టాయి.


కేంద్ర శాసన సభలో (ఆరోజుల్లో అసెంబ్లీ అనేవాళ్ళు) బాంబు వేసే సాహసం కాదు, ఆయన చెప్పిన ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ వారికి ఆందోళన కలగజేసింది. బ్రిటీషు వారికి, గాంధీ గారికి ఆయనో ʹటెర్రరిస్టుʹ మాత్రమే అయితే సమస్య అయ్యేది కాదు. మరణం ద్వారా కూడా విప్లవాన్ని జ్వలింపజేయగల శక్తి అని ఆయనకు దేశవ్యాప్తంగా వచ్చిన మద్దతు తెలియజేసింది. భారతదేశ చరిత్రను ఒకానొక కీలక సమయాన ఇంక్విలాబ్ నినాదం వెంట నడిపించినవాడు భగత్ సింగ్. ఇంక్విలాబ్ అంటే పరిపూర్ణ విప్లవం. అసమానతలు లేని వెన్నెల లాంటి సమాజాన్ని నిర్మించడం. అంటే పెట్టుబడిదారులకు కలలో కూడా భీతిగొలిపించే సోషలిజం అనే భూతం. అందుకే అహింస అనే భ్రాంతిని సృష్టించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదాంతో రాజీకుదుర్చుకొని, స్వాతంత్ర్యం పేరుతో భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారులు అధికార మార్పిడి చేసుకున్నారు. నేటికీ భారతదేశంలో ప్రజాస్వామిక విప్లవం పరిపూర్ణం కాని స్వప్నం.


అటువంటి భగత్ సింగ్ ఎలా రూపొందాడు? ఆయన అమరత్వం నేటికీ ఇస్తున్న సందేశం ఏమిటి?


ఆయన పుట్టింది 1907 సెప్టెంబర్ 17న స్వాతంత్రోద్యమకారుల కుటుంబంలో. ఆ కాలం, కుటుంబ వాతావరణం ఆయన్ని రూపొందించాయి. తండ్రి కిషన్ సింగ్ గదర్ పార్టీకి సహకరించాడు. చిన్నాయన అజిత్ సింగ్ బ్రిటీష్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం నడిపి ప్రవాస శిక్షను అనుభవించాడు. ఆనాటి రాజకీయాల్లో ఆయది ప్రముఖ స్థానం. దేశ విదేశాల్లో తిరిగి విప్లవాన్ని సాధించాలని కృషి చేసాడు. అజిత్ సింగ్ తమ్ముడు స్వరణ్ సింగ్ లాహోరు సెంట్రల్ జైల్లో కఠిన శిక్షను అనుభవిస్తూ 1910లో అనారోగ్యంతో మరణించాడు.


1905 బెంగాల్ విభజన తట్టి లేపిన జాతీయ భావాలు, వందేమాతర ఉత్తేజం, హిందూ మతాన్ని, రాజకీయాలను కలిపేసి పుట్టుకొచ్చిన ʹతీవ్రవాదʹ బృందాల కాలం అది. ఆనాడు బ్రిటీష్ వ్యతిరేకను, స్వాతంత్రోద్యమ కాంక్షను రేకెత్తించడంలో అవి కీలక పాత్ర వహించాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పుట్టిన గదర్ పార్టీ మతభావనలను వ్యతిరేకించింది. మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయి తిరుగుబాటు స్ఫూర్తిని తీసుకుంది. ఆకస్మిక సాయుధ తిరుగుబాటు పథకం వేసి బ్రిటీష్ వారి నుండి అధికారం చేజిక్కించుకోవాలకున్నారు. పంజాబ్ నుండి వచ్చిన యువ గదర్ వీరుడు కర్తార్ సింగ్ సరభ భగత్ సింగ్ చిన్ననాటి హీరో. 19 ఏళ్లకే ఉరికంబాన్ని ముద్దాడిన వీరుడి ఫోటో భగత్ సింగ్ జేబులో ఉండేదట. సాయుధ తిరుగుబాటు ద్వారా బ్రిటీష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తం చేయాలనే ఆశయంతో పనిచేసిన జాతీయ విప్లవకారులందరూ బ్రిటీషు దృష్టిలోనూ, కాంగ్రెస్ దృష్టిలోనూ తీవ్రవాదులు. అరెస్టులు, ప్రవాస శిక్షలు, మరణశిక్షలు, విద్రోహాల వల్ల సాయుధ తిరుగుబాటు బృందాలు దెబ్బతిన్నాయి. హిందూ జాతీయవాదులు తదనంతర కాలంలో బ్రిటీషు సామ్రాజ్యవాడులపై పోరాటాన్ని వదిలేసి ముస్లిం వ్యతిరేకతను, హిందుత్వ తీవ్రవాదాన్ని ప్రచారం చేసాయి. గదర్ పార్టీ నుండి కొందరు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ప్రయత్నాలు చేసారు. స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసిన హోం రూల్ ఉద్యమం చిన్న చిన్న హామీలను పొంది, తర్వాత నీరుగారిపోయింది. 
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సాయుధ విప్లవకారుల ʹకుట్రʹలను కట్టడి చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చింది. 1919 నాటి ఈ చట్టం ప్రకారం కారణం లేకుండా కేవలం తీవ్రవాదులనే అనుమానం మీద ఎవరినైనా అరెస్టు చేసి విచారణ లేకుండా ఎంత కాలమైనా నిర్బంధించవచ్చు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చెలరేగినప్పుడు భగత్ సింగ్ డి.ఎ.వి. స్కూల్లో చదువుతున్నాడు. గాంధీ జాతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ముందుకు వచ్చాడు. ప్రజా ఉద్యమానికి బ్రిటీష్ ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ సమాధానం ఇచ్చింది. ఈ ఘటన భగత్ సింగ్ ను తీవ్రంగా కదిలించింది. ప్రజల ఆగ్రహేవేశాల మీద నీళ్ళు చల్లుతూ గాంధీ గారు ఉద్యమాన్ని విరమించారు. ఉద్యమం సందర్భంగా ప్రజల మీద జరిగిన దాడులపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఒప్పుకోలేదు. అనంతరం సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. తొమ్మిదో తరగతి చదువుతున్న భగత్ సింగ్ స్కూలు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ ఉద్యమంలోనే గాంధీ అహింస అసలు స్వభావం ఏమిటో తెలియవచ్చింది. ప్రజల పోరాటాన్ని నీరు గార్చడమే ఆయన లక్ష్యం. హింస అలా ఉంచితే, రైతులు పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణ చేస్తే భయపడిపోయాడాయన. రైతులు జమీందార్ల పట్ల, కార్మికులు యజమానుల పట్ల విధేయులుగా ఉండాలన్నదే ఆయన సిద్ధాంతం. చౌరీ చౌరా సాకుతో నాన్ కో ఆపరేషన్ కు చరమ గీతం పాడాడు. స్వతంత్రం ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని చెప్తూ, రాజ్యాంగ బద్ధంగా, సత్యాగ్రహ పద్ధతిలో నడవమని, అహింస సుద్దులు చెప్తున్న గాంధీ రాజకీయాల పట్ల యువతరం విసిగిపోయింది. ఎల్లెడలా స్థబ్దత, నిరాశ పేరుకుపోయిన స్థితిలో విప్లవకారులు మళ్ళీ జ్వాలను వెలిగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.


సహాయ నిరాకరణలో డి.ఎ.వి. స్కూలు వదిలిన భగత్ సింగ్ నేషనల్ కాలేజీలో చేరాడు. అక్కడే విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. దేశదేశాల విప్లవాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. భగవతీ చరణ్, సుఖ్ దేవ్, యశ్ పాల్ వంటి వారి పరిచయాలు, విప్లవ పార్టీ నిర్మాణాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. పెళ్లి ప్రస్తావన చేస్తే నిరాకరించి, తండ్రికి ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు. కాన్పూరులో గణేష్ శంకర్ విద్యార్థి ప్రెస్ లో చేరి పనిచేస్తూ మరింతగా అధ్యయనం చేసాడు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉండిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో సభ్యుడయ్యాడు. 1925లో పంజాబ్ వెళ్లి అక్కడి విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. తిరిగి లాహోరు వచ్చి 1926లో నౌజవాన్ భారత్ సభ ఏర్పాటు చేసి సోషలిస్టు భావాలను ప్రచారం చేసాడు. కార్మికుల, కర్షకుల సంపూర్ణ స్వాతంత్రం మా లక్ష్యం అని ప్రకటించాడు.


హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ తదనంతర కాలంలో హిందూస్తాన్ సోషలిస్ట్ రిప్లబ్లికన్ ఆర్మీగా ఏర్పడడం వెనక భగత్ సింగ్, సుఖ్ దేవ్, శివవర్మ, విజయ్ కుమార్ ల కృషి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల విప్లవకారులను ఒక్క చోటికి చేర్చి 1928లో HSRA ఏర్పాటు చేసారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సోవియట్ విప్లవ ప్రభావం వీరి మీద ఉంది. సోషలిజం లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ బృందం మార్క్సిజాన్ని, లెనిన్ రచనలను, భారత విప్లవ వీరుల చరిత్రలను, వివిధ దేశాల పోరాటాలను అధ్యయనం చేసింది. వారి స్థావరాలలో లైబ్రరీలు పెట్టుకున్నారు. భగత్ సింగ్ విప్లవ అవగాహనలో మరింత స్పష్టత జైల్లో ఉన్న కాలంలో వచ్చింది. ఆనాటికింకా సాయుధ చర్యల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి, బ్రిటీష్ సామ్రాజ్యవాదులను ఎదిరించగల శక్తి సామర్థ్యాలు భారతీయులకున్నాయని విశ్వాసాన్ని కల్పించడం వాళ్ళ ప్రాథమిక లక్ష్యం. గాంధీ అహింసా సిద్ధాంతంలోని అసంబద్ధతను లొంగుబాటుతనాన్ని, బైటపెట్టి ప్రజలను విప్లవానికి సన్నద్ధం చేయాలనుకున్నారు. అందులో భాగంగా తమ భావాలను, లక్ష్యాలను వివరించే పోస్టర్లు, కరపత్రాలు వేసారు. విప్లవ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోడానికి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మొదటి నుండీ ఉండేది. 1925లో HSA ఆధ్వర్యంలో కాకోరీ రైలు దోపిడీ సంచలనం కలిగించింది.


భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటైన సైమన్ కమిషన్ ను అటు కాంగ్రెస్, ఇటు విప్లవకారులు వేరువేరు కారణాలతో వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ ఆందోళనల్లో లాఠీ చార్జ్ జరగడం, గాయపడ్డ లాలా లజపతిరాయ్ మరణించడం, ప్రతీకారంగా బ్రిటీష్ పోలీసు అధికారి సాండర్స్ వధ వెనువెంటనే జరిగిపోయాయి. భగత్ సింగ్ తప్పించుకొని కలకత్తా వెళ్ళిపోయాడు. అక్కడి విప్లవకారులను కలిసి, తర్వాత ఆగ్రా చేరుకొని బాంబుల ఫ్యాక్టరీ స్థాపించాడు. సంస్కరణల ప్రహసనం నడిపిన బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ వెళ్ళిపోయాక ఒక ఏడాదికి పబ్లిక్ సేఫ్టీ బిల్ (ప్రజా రక్షణ బిల్లు), ట్రేడ్స్ డిస్ప్యూట్ బిల్ (కార్మిక తగాదాల బిల్లు) తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం సమ్మెలు చట్ట విరుద్ధమవుతాయి. సమ్మె గనక చేస్తే అది అధికారంపై తిరుగుబాటుతో సమానంగా పరిగణిస్తారు. ఈ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగానే (1929 ఏప్రిల్ 8) భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్తు అసెంబ్లీలో బాంబులు వేసారు. ʹఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండిʹ నినాదాలిచ్చి ఎర్రటి కరపత్రాలు వెదజల్లారు. పారిపోయే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా అరెస్టయ్యారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి. తమ విప్లవ భావాలను ప్రచారం చేయడానికి న్యాయస్థానాన్ని వేదికగా చేసుకున్నారు. కోర్టులో బాంబు తామే వేశామని ఒప్పుకున్నారు. ఎందుకు వేశామో తన స్టేట్ మెంట్ లో వివరంగా చెప్పాడు భగత్ సింగ్. ʹఇంగ్లాడును తన కలల నుంచి లేవగొట్టేందుకు బాంబు అవసరమైంది. హృదయ విదారకమైన తమ బాధను వెల్లడించడానికి వేరే గత్యంతరం లేక అసెంబ్లీ చాంబర్ నేల మీద బాంబు వేశాం.... చేవిటివాళ్ళు వినేలా, నిర్లక్ష్యపరులకు హెచ్చరిక నిచ్చేలా చేయడం మా లక్ష్యం... ప్రశాంతంగా కనిపించే భారత జనతా సాగరం నుంచి తుఫాను బద్దలవబోతోంది. ఊహామయమైన అహింసా శకం నిష్ఫలం చెంది గతించిపోయిందని మేం సూచించాంʹ. కేసు విచారణ పొడవునా ఇద్దరూ విప్లవ భావాలు ప్రచారం చేసాడు. తన కేసును తానే వాదించుకున్నాడు భగత్ సింగ్. వాటిని పత్రికలు విస్తృతంగా ప్రచారం చేసాయి. హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ గురించి దేశమంతా ప్రచారమైంది. ఈలోపు మరిన్ని అరెస్టులు జరిగి, సహచరులు పట్టుబడి, బాంబుల ఫ్యాక్టరీలు బైటపడి లాహోరు కుట్ర కేసు తయారైంది. కేసు నడుస్తూ ఉండగా జైల్లో విప్లవకారులు కోర్టును ప్రచారవేదికగా వాడుకొనేందుకు ప్రణాలికలు రచించారు. బహిరంగ ప్రదర్శనలు, నినాదాలు, ఉపన్యాసాలతో కోర్టు సభా వేదికయ్యేది. ప్రముఖ జాతీయవాదులు, ప్రజలు ఏంటో మంది కోర్టు విచారణ చూడ్డానికోచ్చేవారు. కాకోరీ డే, లెనిన్ డే, మేడే, లజపతి రాయ్ డే.. ఇలా సందర్భాలను గుర్తించి ప్రసంగాలు చేసేవాళ్ళు. 1930లో బోల్షవిక్ విప్లవ దినోత్సవం సందర్భంగా సోవియట్ కామ్రేడ్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.


జైల్లో రాజకీయ ఖైదీల గుర్తింపు కోసం భగత్ సింగ్ అద్భుతమైన పోరాటాలు నడిపాడు. భగత్ సింగ్, సహచర కామ్రేడ్స్ చేపట్టిన నిరాహార దీక్షలు చరిత్రలో అనన్యసామాన్యమైనవి. 116 రోజుల నిరాహారదీక్షతో భగత్ సింగ్ పేరు పంజాబ్ దాటి దేశమంతా మారుమోగింది. ఈ పోరాటంలో జతిన్ దాస్ అమరుడయ్యాడు. జైలును రాజకీయ పాఠశాలగా ఉపయోగించుకున్న భగత్ సింగ్, తన విప్లవ దృక్పథాన్ని పదును పెట్టుకున్నాడు. జైలు నుండి చేసిన రచనల్లో నిజమైన భగత్ సింగ్ రూపొందడం చూస్తాం. సాయుధ చర్యలు చేయడం మాత్రమే విప్లవం కాదని, శ్రామిక వర్గ పోరాటం ద్వారానే విప్లవం సాధ్యమని, కార్మికులు, కర్షకులతో పనిచేయాలని మొదట పేర్కొన్న సుదీర్ఘ ఉత్తరం రాసాడు. అందులో బోల్షవిక్ పోరాట ఎత్తుగడలు, యుద్ధం-శాంతి, మన దేశంలో విప్లవ పార్టీని ఎలా నిర్మించాలి, అందులో సభ్యులనెలా చేర్చుకోవాలి, దాని కార్యక్రమం ఎట్లా ఉండాలి మొదలైన విషయాలన్నీ రాసాడు. తన అమరత్వం రగిలించే జ్వాలలో విప్లవం ప్రజ్వలించాలని కోరుకున్నాడు.
దేశంలో నిదురించిన విప్లవాగ్నిని మళ్ళీ రగిలించిన భగత్ సింగ్ అటు బ్రిటీష్ వారికీ, ఇటు కాంగ్రెస్ పెద్దలకు ఇబ్బందికరంగా తయారయ్యాడు. స్పెషల్ ట్రిబ్యునల్ వేసి, నిందితులను హాజరు పరచకుండా, కుట్ర పూరిత విచారణ నడిపి మరణశిక్ష విధించారు. వార్త తెలిసిన వెంటనే దేశం అట్టుడికిపోయింది. ప్రధాన పట్టణాల్లో సభలు, నిరసనలు, బందులు హోరెత్తాయి. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉరి శిక్ష అమలుకు నెల రోజుల ముందు గాంధీ ఇర్విన్ చర్చలు జరిగాయి. చర్చల ముందు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల ఉరిశిక్ష రద్దును షరతుగా పెట్టాలని దేశమంతా ఆశించింది. అది జరగకపోగా భగత్ సింగ్ ఉరి దేశంలో శాంతిని భగ్నం చేస్తుంది గనక ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని సస్పండ్ చేయమని మాత్రమే అడిగారు. భగత్ సింగ్, అతని సహచరులు చావును ఆహ్వానించారు. క్షమాభిక్షనైనా కోరి ఉండాల్సింది అని గాంధీ నుండి భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ దాకా కోరుకున్నవాళ్ళున్నారు. భగత్ సింగ్ దాన్ని అసహ్యించుకున్నాడు. చనిపోయే ముందు దేవుణ్ణి తలచుకోమంటే సమస్యే లేదన్నాడు. ఉరి కంబం నుండి ఆయన చేసిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు జైలు గోడలు దాటి ప్రతిధ్వనించాయి. లాహోర్ సెంట్రల్ జైలు పక్కన కాంగ్రెస్ నాయకుడు పింది దాస్ సోది ఇంట్లోకి ఆ నినాదాలు వినిపించాయని, చాలా సేపటి వరకు ఆ నినాదాలు ఆగిపోలేదని తర్వాత కాలంలో ఆయన చెప్పారు. ఉరితీసాక చాలా సేపటివరకు జైల్లోని ఖైదీలందరూ నినాదాలు ఇస్తూనే ఉన్నారు. నిజంగానే భగత్ సింగ్ మరణం దేశాన్ని మండించింది. కానీ ఆయన కోరుకున్న సాయుధ విప్లవం రాలేదు.


భగత్ సింగ్ మరికొంత కాలం జీవించి ఉంటే భారత దేశపు లెనిన్ అయ్యేవాడని అభిప్రాయం ఉంది. బిపిన్ చంద్ర ఆయన్ను ʹలెనిన్ ఇన్ ది మేకింగ్ʹ అన్నాడు. బహుషా సామ్రాజ్యవాదులు అందుకే భయపడ్డారు. విప్లవం బద్దలయితే రాజీబేరాల రాజకీయాలు ఇక నడవవేమో అన్ని కాంగ్రెస్ భయపడ్డది. కానీ భగత్ సింగ్ చేరిపెయ్యలేని విప్లవ సంతకం అయ్యాడు. ఆయన త్యాగాన్ని గుర్తించకుండా, దానికి సలాం చేయకుండా ఎవరి మనుగడా లేని విధంగా ఆయన మూర్తిమత్వం నిలిచిపోయింది.


చివరికి కాంగ్రెస్ లాబీయింగు రాజకీయతోనే అధికార మార్పిడి జరిగిపోయింది. అప్పటి కమ్యూనిస్టు పార్టీ రైతాంగంలో, కార్మిక వర్గంలో కొంత వరకు నిర్మాణాలు చేసినా, రాజకీయంగా అది కాంగ్రెస్ కార్యక్రమాలను అనుసరించింది. భూస్వామిక సమాజ వైరుధ్యాల నుండి బద్దలైన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం వరకు నిర్దిష్టంగా సాయుధ విప్లవ ప్రయత్నాలు లేవు. అందుకే బ్రిటీష్ విధానాలు, చట్టాలు దాదాపుగా మారలేదు. అందుకే నక్సల్బరీ పోరాటం స్వాతంత్ర్యం ఒక బూటకం అని చెప్పింది.


ఆనాడు కార్మిక వ్యతిరేక బిల్లుకు నిరసనగా పార్లమెంటులో బాంబులు వేసాడు భగత్ సింగ్. ఈనాడు అటువంటి చట్టాలు చాలా అలవోకగా చేసేస్తున్నారు. భగత్ సింగ్ వంటి ఎందరో విప్లవకారులను నిర్బంధించిన రాజద్రోహం, పబ్లిక్ సెక్యూరిటీ చట్టాలు ఇప్పటికీ ఉద్యమకారులను, ప్రభుత్వ అన్యాయాలను వ్యతిరేకించేవారిని జైల్లో పెడుతూనే ఉన్నాయి. విచారణ లేకుండా ఏండ్ల తరబడి జైల్లో పెట్టడానికి UAPA వంటి చట్టాలు వచ్చాయి. సామ్యాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ ఆదివాసులు చేస్తున్న పోరాటాలపై బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఊహించలేనంత సైనిక దమనకాండ అమలవుతోంది. జాతీయోద్యమ ద్రోహులు నేడు అధికారంలోకి వచ్చి దీనిని మరింత ముందుకు తీసుకుపోయారు. తాజాగా CAA చట్టాన్ని తీసుకొచ్చి మతపరమైన విభజన తీసుకొస్తున్నారు. NRC ద్వారా దేశం మొత్తాన్ని నిర్బంధ శిబిరం చేస్తున్నారు. కనుక నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది. భగత్ సింగ్ గొప్ప భావుకుడు కూడా. మంచి గాత్రం ఉండేదని, గొప్పగా పాటలు పాడేవాడని ఆయన మిత్రులు రాసారు. ఆయన పాడిన స్వేచ్చా గీతాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఆయన కలలను సాకారం చేసే ప్రతినబూనుదాం.