కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు-ఉపాధి కోల్పోయిన పేద లను ఆదుకోవాలి.

 


కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు-ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం గురించి...


కరోనా మహమ్మారి తీవ్రతతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి.


వేలాదిమంది మృతి చెందడం, లక్షలాదిమంది వ్యాధి బారిన పడటం కనీవినీ ఎరుగని పరిణామం. ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లో రోజుకు వందలాదిమంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 


ఇప్పటివరకు ఏదైనా విపత్తు సంభవించినా ఏవో కొన్ని జిల్లాలకో, ఏదో ఒక రాష్ట్రానికో నష్టంచేసేవి. కానీ కరోనా మహమ్మారి మాత్రం యావత్  ప్రపంచానికే పెను విపత్తుగా పరిణమించింది.


మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిద్- 19 వైరస్ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తోంది. 


ప్రాణాంతకంగా మారిన ఈ కరోనా వైరస్ ను ఏవిధంగా నియంత్రించాలనే దానిపై ప్రధాని శ్రీ నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ చేయడం, ఐసొలేషన్ లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికీ సోకకుండా నిరోధించడం పైనే, ప్రభుత్వాలు పెద్దఎత్తున దృష్టి పెట్టాల్సివుంది. 


కేవలం లాక్ డౌన్ చేయడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, దానితో పాటుగా, పెద్దఎత్తున ప్రజారోగ్య చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య ఇప్పటికే సూచించింది. 


వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మనరాష్ట్రంలో కూడా కరోనా వ్యాధి నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలి. 


విదేశాలనుంచి దాదాపు 15వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే చేరినట్లుగా తెలుస్తోంది. 


వాళ్లందరికీ క్వారంటైన్ కట్టుదిట్టంగా చేయాలి, పకడ్బందీగా ఐసొలేషన్ నిర్వహించాలి. 


ఆసుపత్రులలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులతో సరిపెట్టకుండా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో, వార్డులలో పారిశుద్య చర్యలు చేపట్టాలి, పరిసరాలను పరిశుభ్రం చేయాలి. 


ముందు జాగ్రత్త చర్యలపై అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలి. 


పరిశుభ్రత ప్రాధాన్యతపై అందరినీ చైతన్య పరచాలి.


లాక్ డౌన్ చేయడం కోట్లాది ప్రజలపై ప్రభావం చూపడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండిపడింది. 


ఇంట్లోనుంచి బైటకు రాకపోవడం వల్ల అటు ఉపాధిని కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయంలేక రెండిందాలా నష్ట పోయారు. 


రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాల జీవనం దుర్భరం అయ్యింది. 


విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. 


ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా రేషన్ (బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు) ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడంతో పాటు, ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు నగదు తక్షణమే, ఏమాత్రం జాప్యం చేయకుండా అందజేసి ఈ విపత్కర సమయంలో వారిని ఆదుకోవాలని కోరుతున్నాం.  


బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు పెరిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. 


ఇప్పటికే కూరగాయల ధరలు 300% పెరిగినట్లుగా మీడియాలో చూస్తున్నాం. 


కాబట్టి రైతు బజార్లలో చౌక ధరలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలి. 


బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. 


దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్యం- పరిశుభ్రతపై ప్రధాన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


నారా చంద్రబాబు నాయుడు ప్రకటన లో ప్రభుత్వాన్ని కోరారు.