స్ధానిక ఎన్నికల పోరు నిర్వహించకుండా సుప్రీంకోర్టులో దాఖలైన పిల్

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే మధ్యలోనే ఆగిపోయిన స్ధానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలో బ్రేక్ పడబోతోందా ?


కరోనా తగ్గకుండానే స్ధానిక ఎన్నికల పోరు నిర్వహించకుండా సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.


ఏపీలోత పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు స్ధానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేస్తుండటంపై నరేంద్రరెడ్డి అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరోనా తర్వాత సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకూ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. కరోనా తగ్గుకుండా ఎక్కడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో అభ్యర్ధించారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఓటర్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లేనని పిటిషనర్ తన పిల్ లో అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు.


 pil filed in supreme court against conducting local polls in corona situation
సుప్రీంకోర్టులో దాఖలైన తాజా ప్రజా ప్రయోజన వాజ్యం ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కరోనా ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.... మరోసారి ఈ పిల్ తో ఏకీభవిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. కరోనా ప్రభావం తగ్గగానే స్ధానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏపీలో ఎన్నికల కమిషనర్ తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా సన్నద్దవుతున్న తరుణంలో ఈ పిల్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.