నెల్లూరు, 17-04-2020
లాక్ డౌన్ సమయంలో.., పేదలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, భోజనం ఉచితంగా అందిస్తున్న N.G.O సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు అందరూ.., రేపటి నుంచి తప్పని సరిగా స్థానిక R.D.O, తహసీల్దార్ కి లేఖ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, అనుమతి వచ్చిన తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారుల సహాయంతో వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని
జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించిన జేసీ.., R.D.O, తహసీల్దార్ కి దరఖాస్తు చేసే సమయంలోనే ఏ ప్రాంతంలో సహాయం చేయాలనుకుంటున్నారో పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్న దాతలకు అధికారులు అన్ని విధాలా సహాయం చేస్తారని.., దాతలు ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకోవాలని,
రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా భద్రత కల్పిస్తారని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిబంధనలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
కోవిడ్-19 నివారణ చర్యలలో భాగంగా ప్రజలు ఇంటి నుంచి అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుట్కా నమిలి ఉమ్మివేస్తే ఫైన్ విధించడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర అన్ని వైద్యసేవలు ప్రజలకు అందించాలని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
మందుల దుకాణాలు, మెడిసిన్స్ తయారు చేసే పరిశ్రమలు, వెటర్నరీ ఆస్పత్రులు, పౌల్ట్రీ పరిశ్రమ, గోసాలలు నిర్వహించుకోవడానికి లాక్ డౌన్ సమయంలో అనుమతి ఉందని జేసీ తెలిపారు. ఎవరైనా మరణిస్తే వైద్యులకు తెలియజేయాలని, వైద్యులు కోవిడ్-19 టెస్టు పరీక్షలు నిర్వహించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని.., అంత్యక్రియలలో కూడా అతితక్కువ మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. జిల్లాకు ట్రూనాట్ మిషన్స్ కూడా వచ్చాయని, వీటి ద్వారా వేగంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి.., కరోనా మహమ్మారి నివారణకు చర్యలు తీసుకుంటాని జేసీ స్పష్టం చేశారు.
------------------------------------------------