బస్సు, విమాన టికెట్ల బుకింగ్స్ ప్రారంభం.. కానీ ఒక్క కండీషన్
ఏప్రిల్ 15 నుంచి రైళ్లు, విమాన, బస్సు సర్వీసులు పునఃప్రారంభం
మూడు మార్గాల్లో రిజర్వేషన్లు చేసుకునే వెసులుబాటు
తెరుచుకున్న ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్లు
తూర్పు గోదావరి జిల్లా మీదుగా హైదరాబాద్, చెన్నై, విశాఖ, భువనేశ్వర్ వెళ్లే రైళ్లన్నీ ఫుల్
స్లీపర్, థర్డ్, సెకండ్ ఏసీ రిజర్వేషన్లు ఏప్రిల్ 21వరకు చాంతాడంత
రాజమహేంద్రవరం నుంచి విశాఖ, హైదరాబాద్ రూట్లలో ఇండిగో సిద్ధం
ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రిజర్వేషన్లు బుకింగ్‌కు అనుమతి, తెరుచుకున్న సైట్లు
లాక్‌డౌన్ పొడిగిస్తే క్యాన్సిల్ చేస్తామనే షరతుతో బుకింగ్‌ల స్వీకరణ
ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్.. ఆ తర్వాత ఎత్తి వేస్తారా? లేదా పొడిగిస్తారా? అనేదానిపై స్పష్టత పూర్తిస్థాయిలో లేకున్నా యథావిధిగా బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు నడప డానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు గత నెల 23 నుంచి నిలిచిపోయిన ఆన్‌లైన్ బుకింగ్ రిజర్వేషన్లు మళ్లీ పునఃప్రారంభం అయ్యాయి. దీంతో వీటన్నింటికి బుకింగ్‌లు పెద్దఎత్తున జరుగుతు న్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి 23 వరకు రైళ్ల రిజర్వేషన్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ నుంచి రిగ్రేట్ వరకు వెళ్లిపోయాయి*.
పొడిగిస్తే రద్దు చేసేస్తాం...
గతనెల 23 నుంచి లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తు న్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ క్షణం నుంచి రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. రిజర్వేషన్లు కూడా రద్దు చేశారు. అన్ని రైలు, బస్సు స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు మూసి వేశారు. అధికారిక, ప్రైవేటు వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ బుకింగ్‌లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు బస్సు, రైళ్లు, విమాన సర్వీసులకు సంబంధించి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే ఢిల్లీలో మతపరమైన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి.
అటు మరణాలు కూడా దేశవ్యాప్తంగా పెరుగు తున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 14 తర్వాత లాక్‌డౌన్ ఒకేసారి కాకుండా దశల వారీగా ఎత్తివేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో 14 తర్వాత లాక్‌డౌన్ ముగింపా? కొనసాగింపా? అనేదానిపై కొంత ఊగిసలాట కొనసాగుతోంది. కానీ ఈ మూడు రకాల సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్లు మాత్రం జరిగిపోతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్ పొడిగిస్తే రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తా మనే ముందస్తు షరతుతో బుకింగ్‌లు కొనసాగుతున్నాయి.
విశాఖ నుంచి జిల్లా మీదుగా హైదరాబాద్, అటు చెన్నై, తిరిగి హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా విశాఖ, భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు సంబంధించి స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ సీట్లన్నీ దాదాపు నిండిపోయాయి. రిజర్వేషన్ కౌంటర్లు ఈనెల 14 నుంచి అన్ని రైల్వేస్టేషన్లలో తెరవడానికి ముందే ఆన్‌లైన్ బుకింగ్‌లు ఫుల్ అయిపోయాయు. ముఖ్యంగా విశాఖ నుంచి బయలుదేరే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ 15 నుంచి 17 వరకు సీట్లన్నీ ఆర్‌ఏసీలో ఉన్నాయి*. *విశాఖ-న్యూఢిల్లీ 15,16 తేదీల్లో 3 ఏసీలో 40, సెకండ్ ఏసీ 12 సీట్లే ఉన్నాయి*. *భువనేశ్వర్-హైదరాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ అయితే కిక్కి రిసింది. 19వ తేదీ వరకు సీట్లన్నీ ఫుల్. కోణార్క్, ఫలక్‌నుమా 19 వరకు ఫుల్. గోదావరి ఎక్స్‌ప్రెస్ అయితే 20వ తేదీ వరకు సీట్లే లేవు.
కాకినాడ నుంచి బయలుదేరే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 18 వరకు ఫుల్. లాక్‌డౌన్ ముగియడంతో స్వస్థలాల నుంచి తిరిగి హైదరా బాద్, చెన్నైతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే కూలీలు, ఇతర వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగుల కారణంగా ఇవన్నీ నిండి పోయాయి. అలాగే హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా విశాఖ వైపు వెళ్లే కోణార్క్, విశాఖ, ఎల్‌టీటీ, ఫలక్‌నుమా, పూణే- భువనేశ్వర్, ఈస్ట్‌కోస్ట్, హౌరా మెయిల్, టాటా అలెప్పి తదితర రైళ్లన్నీ బుకింగ్‌లు దాదాపు చివరికొచ్చేశాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విశాఖ, హైదరాబాద్ రూట్లలో ఒక్క ఇండిగో మాత్రమే సర్వీసులు నడపడానికి 15 నుంచి ముందుకు వచ్చింది. ఆరోజు విశాఖకు రూ.892, హైదరాబాద్‌కు రూ.5,200 వరకు టిక్కెట్ ధర ఉంది. అలాగే ఆర్టీసీ బస్సుల ఆన్‌లైన్ బుకిం గ్‌కు ఆర్టీసీ వెబ్‌సైట్ తెరుచుకుంది. విశాఖ, చెన్నై, హైదరాబాద్ రూట్లలో ప్రైవేటు బస్సులు ఆన్‌లైన్ బుకింగ్‌లు స్వీకరిస్తున్నాయి.
పార్సిల్ ట్రైన్లకు గ్రీన్ సిగ్నల్.. యథాతథంగా గూడ్స్ రైళ్లు.
కరోనా లాక్‌డౌన్‌లో కూడా పార్సిల్ రవాణా కోసం ప్రత్యేక పార్సిల్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈనెల 2వ తేదీ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో బయలుదేరిన ఈ రైలు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంది. ఇక్కడ నుంచి హౌరాకు 17 టన్నుల చేపలు ఎగుమతి చేశారు. ఇంకా ఇతర సరుకులు ఉన్నాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి హౌరా వరకూ సరుకును తీసుకుని వెళుతుంది. ఈనెల 9న మళ్లీ రాజమహేంద్రవరం వస్తుంది. 3005 ప్యాకేజీలతో 91.5 టన్నుల లోడ్‌తో 5వీపీ (పార్సిల్ వ్యాన్)లతో ఈ ప్రత్యేక రైలు సరుకు రవాణా చేస్తోంది. గుడ్లు, చాక్‌లెట్లు, బిస్కట్లు, బట్టలు, మందులు, వైద్య పరికరాలు, యంత్రాలు, విడిభాగాలు ఇందులో ఉన్నాయి. మామిడిపండ్లు, పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఇక గూడ్స్ రైళ్లు బాగా తిరుగుతున్నాయి. విశాఖ నుంచి ఐరన్ కూడా రవాణా అవుతోంది. కొన్ని రోజుల నుంచి రైల్వే ఉద్యోగుల కోసం ప్రత్యేకించి రైళ్లు నడపడం గమనార్హం. రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి, విజయవాడకు రెండు రైళ్లు నడుస్తున్నాయి. మెయింటినెన్స్ రైళ్లని చెబుతున్నారు. శానిటేషన్ సిబ్బంది, మెడికల్, గార్డులు, డ్రైవర్లు పయనిస్తున్నారు. దీంతో రైల్వే సిబ్బంది పనిచేస్తున్నారు.