ప్రైవేట్ ఆస్పత్రులన్నీ పని చేయాల్సిందే.

ప్రైవేట్ ఆస్పత్రులన్నీ పని చేయాల్సిందే


: జిల్లాలో ఎక్కడైనా మూసివేస్తే చర్యలు తీసుకుంటాం


: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు


అనంతపురం, ఏప్రిల్ 2 :


 కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆస్పత్రు లన్నీ తప్పనిసరిగా పనిచేయాలని, ఎవరైనా మూసివేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. జిల్లాలో కొన్నిచోట్ల ప్రైవేట్ ఆస్పత్రులు మూసి వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు,ఆస్పత్రులు మూసి వేయరాదని, ఎవరైనా మూసి వేస్తే ఆ నర్సింగ్ హోమ్ ల, ఆస్పత్రుల యజమానులు, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ రోజుల్లో తెరచి ఉంచి ,కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో కొన్నిచోట్ల మూసివేయడం తగదని, తప్పనిసరిగా తమ నర్సింగ్ హోములు, ఆస్పత్రులను తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద జిల్లా కేంద్రంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్, చంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కేర్ అండ్ క్యుర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కోవిడ్ 19 హాస్పిటల్ గా ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే మరిన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లను డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ప్రభుత్వం తరఫున స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రీట్మెంట్ కోసం తమ దగ్గరకు వచ్చే రోగులకు తప్పనిసరిగా వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.