పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తము.

విశాఖ : నర్సీపట్నంలో రెండు పాజిటివ్ కేసులు బయటపడటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా సోమవారం అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ ఆధ్వర్యములో జిల్లా ఎస్పీ బాపూజీ ఇతర అధికారులు పాజిటివ్‌ కేసులు నివాస ప్రాంతం కోమటివీధిని పరిశీలించి, దానికి చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు నుంచి మత ప్రచారం నిమిత్తం గత నెల 18 న ఐదుగురు భార్యా, భర్తలు కలిసి నర్సీపట్నం వచ్చారన్నారు. వీరికి నర్సీపట్నంకు చెందిన ఇస్మాయిల్ తన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఆశ్రయమిచ్చారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వీరిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పది మందిని క్వారెంటైన్ నిమిత్తం విశాఖ ఛాతి ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే వీరికి రక్త పరీక్షలు నిర్వహించడంతో వీరిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. అయితే స్థానికులు ముందుగా అప్రమత్తం కావడం వల్ల నర్సీపట్నంనకు పెను ప్రమాదం తప్పిందన్నారు. పరిస్థితి సద్దుమణిగే వరకు ఈ జోన్ నుంచి బయటకు రావడం కాని, అక్కడి వ్యక్తులు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. వీరికి అవసరమైన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు అందిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 68 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై 2,000 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు 290 మందిని క్వారెంటైన్ వుంచి నెగటివ్ వచ్చిన తరువాత ఇంటికి పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం విదేశాలకు వెళ్ళి వచ్చిన 338 మందిని ఆస్పత్రి క్వారెంటైన్ లో వుంచామన్నారు. హోమ్ క్వారెంటైన్ లో వున్న వారి కదలికలు గమనించేందుకు డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నట్టు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు లేవని, బయట తిరగొద్దని, కొందరికి ఇవి కనిపించకపోయినా పాజిటివ్‌ వస్తోందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా వుండాలని సూచించారు.