సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:

సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
అయ్యా...
నగరంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే క్రమంలో ప్రతిరోజు, సమయం చూడకుండా, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేస్తున్నాము. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు సాధారణ, మధ్యతరగతి ప్రజలతో పాటు మా పాత్రికేయ మిత్రులకు కూడా రోజువారీ జీవితానికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. నగరంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అన్ని వర్గాల ప్రజలకు వస్తు రూపేణా, ఆహార పదార్థాల రూపంలో సహాయాలు అందిస్తున్నారు. సహాయం అందని కొన్ని ప్రాంతాలలో ప్రజా సమస్యలను మేమే వెలుగులోకి తెచ్చి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. మా పాత్రికేయుల శ్రమతో నాయకులుగా ఎదిగిన వారు ఎవరూ కూడా  ఇప్పటివరకు మా పాత్రికేయులకు ఎటువంటి సహాయం అందించలేదు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంత్రిగారు తన నియోజకవర్గ పరిధిలోని పాత్రికేయులు మాత్రమే సహాయం అందించారు. మధ్య నియోజకవర్గంలోని పాత్రికేయులకు సహాయం అందించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. మా ఖర్మ ఏమిటంటే మా నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యులకు మంత్రి పదవి లేదు. ఉంటే ఆయన కూడా సాయం చేసే వారేమో.
అయ్యా మంత్రిగారు...
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలలో అక్రిడేషన్ అర్హత కలిగిన పాత్రికేయులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. మీరు కూడా మా సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో, నిత్యజీవితంలో మేము అనేక రూపాల్లో ఎదుర్కొంటున్న  సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని మా ఆశ.
జిల్లాకు చెందినవారు ఒకరు పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ మా పాత్రికేయులకు గుప్పెడు బియ్యం కూడా సహాయం చేసే వారు లేరు. ఈ అంశంలో మంత్రిగారు స్పందిస్తారని పాత్రికేయ మిత్రులు ఎదురుచూస్తున్నారు.
మా విన్నపం లో పాలకులకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు ఉంటే క్షమించండి. మావి ఆకలి కేకలు..