జగన్ కు మోడీ కరెంట్ షాక్.!

జగన్ కు మోడీ కరెంట్ షాక్.


  అవి రాజకీయ ఎత్తుగడలు కావు. అందరికీ అర్థం అయితే అది రాజకీయమే కాదు. సరిగ్గా టైం చూసి కొట్టడం అంటే ఇదే.! అరె అదేమిటి..? మోడీ, జగన్ ఇద్దరూ యమ కలసి 'పోయి' పనిచేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సందర్భంలో మోడీ చటుక్కున జగన్ కు ఊహించని షాక్ ఇచ్చే కరెంట్ కథనం మొదలైంది. అందుకోసం 2003 నాటి విద్యుత్ చట్టాన్ని మార్చడానికి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునే మరో పని రద్దైనట్లే ఇక. 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న పరిశోధన కథనం._*


*అసలేం జరిగింది:*
జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే చేసిన తొలి అధికార ప్రకటనలో 'రాష్ట్రంలో చంద్రబాబు అడ్డగోలు కమీషన్ల కక్కుర్తితో పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు అసాధరణ రేట్లను ఫిక్స్ చేశాడు, దానివల్ల ఖజానా గుల్లయిపోతున్నది, మేం ఆ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) మొత్తం సమీక్షించి, రేట్లు తగ్గిస్తాం' అనేది జగన్ ప్రకటన సారాంశం.


*అసెంబ్లీలో చర్చలో..:*
పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు చెల్లింపులు ఆపేశారు. సుమారు 40 ప్లాంట్ల యాజమాన్యాలు లబోదిబో అనుకుంటూ రెగ్యులేటరీ కమిషన్, అప్పిలేట్ ట్రిబ్యునల్, హైకోర్టును ఆశ్రయించాయి. 'స్టే'లు గట్రా నలగాల్సిన చోట సహజంగా నలుగుతూ ఉన్నాయి. ఇంకా ఎటూ తేలలేదు. ఇప్పట్లో తేలుతుందన్న ఆశా లేదు.


*మా బతుకు ఏంటి..? విదేశీ మొర':*
'ఇప్పటికీ సరిగ్గా డబ్బులివ్వడం లేదు. సరికదా..! కరోనాను సాకుగా చూపి, మొత్తం చెల్లింపులే జగన్ సార్ నిలిపివేశాడు' అని ప్లాంట్ల యాజమాన్యాలు మొత్తు 'కుంటు'న్నాయి. ఈ ప్లాంట్లలో తమ కంపెనీలు పెట్టిన 'డబ్బుల మాటేమిటి మహాప్రభో' అంటూ ఒకటీ రెండు దేశాలు మోడీ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. 


*ఏ..ఎహె ...ఫో..!:*
కేంద్ర ఇంధన మంత్రి కూడా జగన్‌ కు రెండు, మూడు ఘాటు లేఖలు రాశాడు. 'నీ కారణంగా విద్యుత్తు రంగంలో పెట్టుబడులకు ఇక ఎవడూ ముందుకు రాడు బాబోయ్' అని ఆందోళన వ్యక్తం చేశాడు. కానీ జగన్ అంటేనే 'జగమొండి' కదా…! ఏ..ఎహె ...ఫో, పీపీఏల కథ తేలాల్సిందే.! తేల్చాల్సిందే..! మీరెవరు నాకు చెప్పటానికి.. నాకు 151 ఉంది.. 'లైట్'గా తీసుకున్నట్టుగా స్థిరంగా ఉండిపోయాడు. ఆ మాత్రం పట్టుదల లేకపోతే.. ఎంత నామర్థ..!


*'బిగ్ బాస్' మోడీ:*
టివీలో 'బిగ్ బాస్ షో' ఏం చూస్తారు.? కరోనా పేరుతో ఏకంగా ఎవరింట్లో వారికే 'బిగ్ బాస్ షో' ఏర్పాటు చేశారు మోడీ సాబ్.! జగన్ 'విద్యుత్ తతంగానికి కేంద్రం కొత్త మంత్రాంగానికి' తెర లేపింది.


*పాత చట్టానికి దుమ్ము దులిపి..:*
మార్చి18, 1910న ఏర్పాటు చేసిన భారతీయ విద్యుత్ ఆక్ట్ -1910 (ఆక్ట్ నెం.9)ని వ్యూహాత్మకంగా కేంద్రం అటకపై నుంచి దింపి, దుమ్ము దులిపి బయటకు తీసింది. ఈ చట్టంతో రూపాంతరం చెందిన 2003 విద్యుత్తు చట్టంలో నిబంధనలు మార్చాలని భావించింది.


*21 రోజుల్లో..:*
ఇందుకోసం ఏకంగా ఓ కొత్త చట్టాన్ని కొంచెం గట్టిగా తీసుకు రాబోతున్నది. '21 రోజుల్లో అంటే మే8 వరకు అభ్యంతరాలు, సలహాలు చెప్పండహో..' అంటూ ఓ నోటిఫికేషన్ కూడా ఈమేరకు జారీ చేసింది. ఈ సవరణ చట్టం మేరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, పీపీఏలకు కట్టుబడి ఉండాల్సిందే… పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అమల్లోకి వస్తే జగన్ ఆలోచనలు ఒక్కసారిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నయ్. అదే భయ్యా రాజకీయం అంటే.!


*కొత్త చట్టంలో..!:*
కేంద్రం కొత్తగా చేయబోతున్న చట్టంలో మార్పులు ఏమిటయ్యా అంటే..?
ఈ పవన, సౌర (పునరుత్పాదక) విద్యుత్తును ఒప్పందాల్లో ఉన్నట్టుగా కొనాల్సిందే.! అలా కొనకపోతే యూనిట్‌కు ఏకంగా 50 పైసల చొప్పున కరెంటు పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి డిస్కం ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే తేల్చేయాలి. భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులకు వడ్డించటానికి వీల్లేదు. (ట్రూ అప్ ఉండదు… భలే.. భలే..!)


*సబ్సిడీ.. నో 'సైడ్ ట్రాక్':*
ఇప్పుడు క్రాస్ సబ్సిడీ, సర్కారు సబ్సిడీ కలిసి గృహ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే డిస్కమ్స్‌ కు సబ్సిడీ చెల్లిస్తుంది. అయితే ఇకపై సేమ్, మన వంట గ్యాస్‌లో ఇస్తున్నట్టే… వాస్తవ కరెంటు ధరను మన దగ్గర వసూలు చేస్తారు. తరువాత కొంత సబ్సిడీని నేరుగా (బిల్లు మొత్తం, స్లాబు, కేటగిరీలను బట్టి) మన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును భారీగా దుర్వినియోగం, సబ్సిడీ లెక్కల్లో 'గోల్‌ మాల్' జరుగుతుండటంతో మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారు. ఆ లెక్కల్ని పక్కాగా రికార్డ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రాన్స్‌ మిషన్ లైన్స్, సబ్‌ స్టేషన్ల మెయింటెనెన్స్‌ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తారు. (తెలంగాణ సబ్ స్టేషన్ల వ్యవహారంపై ఇప్పటికే 'ఆదాబ్ హైదరాబాద్' ప్రత్యేక కథనం అందించింది). 


*మారనున్న రూపురేఖలు:*
ప్రాంతాల వారీగా కరెంటును పంపిణీ చేసే కంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ఇది కరెంటు రంగం రూపురేఖల్నే మార్చేయబోతున్నది.


*విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ:*
రెగ్యులేటరీ కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తున్నాయి కదా…! ఇకపై కేంద్రంలోని 'విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ కమిటీ' ఈ నియామకాల్ని చేస్తుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇదీ చాలా కీలకమైన నిర్ణయమే…!


*'బిగ్ బాస్' చెప్పారు..! చిన్న 'బాస్'లు ఏం చేస్తారు..?:*
ఇప్పటిదాకా చర్చల్లో, ప్రతిపాదనల్లో వినిపించే సంస్కరణల్ని 'బిగ్ బాస్' మోడీ ప్రభుత్వం వేగంగా అమల్లోకి తీసుకొచ్చేస్తున్నది…! మరి మన చిన్న బాస్ లు కేసీఆర్, జగన్ సార్లు ఏం చేస్తారో వేచిచూద్దాం.


Box:
*తెలంగాణలో ఇవి ఆగినట్లేనా..?:*
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులను బీహెచ్‌ఈఎల్‌, ఇండియాబుల్‌ సంస్థల నుంచి ఓ కంపెనీకి అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకట్ట పడిందని తెలుస్తోంది. 2011న భద్రాద్రి లో అప్పగించిన 1040 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌ కు అప్పగిస్తే... ఆ సంస్థ నుంచి ఇండియాబుల్‌ కు మారింది. 2011లో అప్పగించిన భద్రాద్రి ప్రాజెక్టు పనులు 2016లోపు పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తవ్వలేదు. 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టును రూ.30 వేల కోట్లకు బీహెచ్‌ఈఎల్‌ తీసుకొంటే, దానినీ మరో కంపెనీకి అప్పగించే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.