ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు

 


విశాఖపట్నం, ఏప్రిల్ 26 :


  కోవిడ్-19 కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు  తెలిపారు.   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి   కురసాల కన్నబాబు తో కలిసి ఆయన  పెందుర్తి, జోన్-6, వేపగుంట , జె ఎన్ ఎన్ యూ ఆర్ కాలనీ, భీమిలి 3 వ వార్డు, చిన్న బజార్ ప్రాంతాలను  సందర్శించి ప్రజలలో మనోధైర్యాన్ని నింపారు. ఈ సంధర్బంగా  నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రజలుయిబ్బందులు పడకుండా ప్రభుత్వ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతియింటికి ఉచిత రేషను, వేయిరూపాయలు నగదు అందిస్తున్నామని తెలిపారు.   ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు అధికారుల సూచనలను పాటించి, కరోనా వ్యాధి ప్రభలకుండా  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ప్రాంతంలో రైతుబజార్లు ఏర్పాటు చేయడమైనదన్నారు. రైతులను ఆదుకొనుటకు  పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, శాసనసభ్యులు అదీప్ రాజ్  ఇతర అధికారులు పాల్గొన్నారు.