మ‌న‌దేశంలో వ్యాక్సిన్ కనుగొనడంలో కీల‌క అడుగు ప‌డింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఈ వ్యాధి ప్ర‌బ‌లిన దేశాల్లో 22ల‌క్ష‌లకు పైగా దీని బారిన ప‌డ‌గా...ల‌క్ష 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత‌ విజృంబిస్తుండ‌గా మ‌రెంత‌మందిని ప్రాణాల‌ను హ‌రిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. ఈ సమ‌యంలో అంద‌రి దృష్టి దీనికి సంబంధించిన చికిత్స‌, వ్యాక్సిన్ల‌పైనే ప‌డింది. విశ్వ‌వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతుండ‌గా తాజాగా మ‌న‌దేశంలో కీల‌క అడుగు ప‌డింది. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌'(జీబీఆర్‌సీ)కి చెందిన పరిశోధకులు కరోనా వైరస్‌ పూర్తి జన్యుక్రమాన్ని డీకోడ్‌ చేయడంలో విజయం సాధించారు. ఈ ఫ‌లితం క‌రోనా వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క ఘ‌ట్టంగా నిలువ‌నుంది.


`గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌` వైరస్‌కు చెందిన మూడు కొత్త ఉత్పరివర్తనాలను వారు గుర్తించింద‌ని, వైరస్‌ నిర్మూలనకు వ్యాక్సిన్‌, ఔషధాలు తయారుచేసేందుకు ఇది దోహదపడుతుందని జీబీఆర్‌సీ అధికారులు తెలిపారు. ఈ ప‌రిణామంపై  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జయంతి రవి మీడియాతో మాట్లాడుతూ పుణేలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ (ఎన్‌ఐవీ) తర్వాత దేశంలో కరోనా పూర్తి జన్యుక్రమాన్ని డీకోడ్‌ చేసిన సంస్థ జీబీఆర్‌సీనే కావడం విశేషమ‌న్నారు. ‘కరోనా వైరస్‌ తొలి జన్యుక్రమాన్ని బీజింగ్‌లోని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ జనవరి 10న గుర్తించింది. దీన్ని చైనా బహిరంగ పరిచింది. ఆ తర్వాత జీబీఆర్‌సీ కూడా జన్యుక్రమాన్ని డీకోడ్‌ చేసింది. జన్యుక్రమంలో మొత్తం తొమ్మిది మ్యుటేషన్స్‌ను గుర్తించింది. అయితే అందులో ఆరు ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్థలు గుర్తించాయి. మిగతా మూడు మాత్రం కొత్తగా గుర్తించాం. మన దగ్గర ఉండే వాతావరణ పరిస్థితుల్లో వైరస్‌ ఏ విధంగా రూపాంతరం చెందుతున్నదో తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది’ అని ఆమె వివరించారు. 


కాగా, తాజాగా కరోనా నివారణకు తాము కనిపెట్టిన వ్యాక్సిన్ సెప్టెంబర్ లో అందుబాటులోకి వస్తుందని ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు చెప్పారు. దీని కోసం వివిధ కంపెనీలు, దాతలతో కలిసి పని చేస్తున్నామన్నారు. ఇది క‌రోనాపై ఎఫెక్టివ్ గా పని చేస్తుంద‌ని... సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామ‌ని పేర్కొన్నారు. ఇందుకు మూడు ఫేజ్ లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయ‌ని చెప్పారు. ఇతర టెక్నాలజీతో తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు లేదా ఎక్కువ డోస్ లు కావాలని, తాము తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ కు ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏడు కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ తయారు చేస్తున్నమ‌ని  తెలిపారు.