విపత్తులో ఖైదీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

 


ఈ విపత్తులో ఖైదీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పనవసరం లేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ఊపా వంటి చట్టాల కింద అరెస్టయిన రాజకీయ ఖైదీల విడుదల కష్టం. కనక ఖైదీలందరి విడుదల కోరుతూ ఈ విజ్ఞప్తి చేస్తున్నాం.


 మిత్రులకు షేర్ చేయండి. 
-------------------------------------
కోవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా జైళ్లలోని ఖైదీలందరినీ విడుదల చేయాలి.
రాజకీయ భిన్నాభిప్రాయాల  కారణంగా అక్రమ నిర్బంధంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాయిబాబా, ఎనభై  ఏళ్ల వరవరరావు,  కాశీం వంటి రచయితలను, మేధావులను, ప్రజాసంఘాల కార్యకర్తలను విడుదల చేయాలి.


కరోనా వైరస్ నుంచి పౌరుల జీవించే హక్కును కాపాడటానికి ప్రభుత్వం ప్రజలందరినీ స్వీయ నిర్బంధంలోకి తీసికెళ్లింది. ఇది ప్రత్యేక పరిస్థితి. అయితే ఇది మనముందుకు ఒక ప్రశ్నను తీసుకొచ్చింది. జీవించే హక్కులో అంతర్భాగమైన స్వేచ్ఛ ప్రధానమా? లేక జీవించడం ప్రధానమా? అంటే.. బతికుంటేనే స్వేచ్ఛ కదా! అనే వాదన దిశగా ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. దీని న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా తాత్కాలికమే అయినా ఇది ఇప్పటి అవసరమని ప్రపంచ ప్రజలంతా కట్టుబడ్డారు. 
ప్రభుత్వం పాటిస్తున్న ఈ సూత్రాన్ని ఖైదీలకు కూడా అన్వయించాలి. నేరారోపణలతో స్వేచ్ఛను నియంత్రించి నిందితులను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఆధారాలు ఉన్నా లేకున్నా కేవలం నేరారోపణలతోనే జైళ్లలో ఎందరో ఉన్నారు. అలాగే సాక్ష్యాధారాలు, నేర విచారణ, శిక్షాస్మృతి మంచి చెడ్డల సంగతి ఎలా ఉన్నా శిక్షలు అనుభవిస్తున్న వాళ్లూ జైళ్లలో ఉన్నారు. స్వేచ్ఛకన్నా బతుకు ముఖ్యమని ప్రభుత్వం ఈ సందర్భంలో అనుకున్నట్లయితే ఖైదీలను ప్రత్యేకంగా నిర్బంధించాల్సిన అవసరం లేదు. జైళ్లలో ఖైదీలకు కరోనా అంటుకోకుండా నిరోధించడం సాధ్యం కాదు. ఒకవేళ జైళ్లలో కరోనా సోకితే రిమాండ్ ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు, జైలు సిబ్బంది వ్యాధిగ్రస్తులవుతారు. భారీ ఎత్తున చనిపోతారు. అట్లాగే వైరస్ కూడా ప్రబలిపోతుంది. 
మన దేశంలో జైళ్ల సామర్థ్యానికి మించి సగటున 114 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్లు 2019 నాటి భారతీయ న్యాయ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సగటు లెక్క ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఒకేచోట ఇంత సాంద్రతతో మనుషులు నిర్బంధంలో ఉండటం ఇప్పుడెంత ప్రమాదమో చెప్పనవసరం లేదు. జైలు సామర్థ్యానికి తగినట్లే ఖైదీలు ఉన్నా అక్కడి వాతావరణం వాళ్ల జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తుంది. ఈ విషయంలో ఖైదీల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆందోళనకు గురవుతారు. ఖైదీలు కూడా దేశ ప్రజలే. ప్రభుత్వం కరోనా బారి నుంచి ప్రజల బతుకు విషయంలో తీసుకొనే జాగ్రత్తలు ఖైదీలకు కూడా వర్తింపజేయాలి. కాబట్టి కరోనా సమస్య పూర్తిగా తీరే వరకు వారిని బైటనే ఉంచాలి. ఆ తర్వానే న్యాయ, శిక్షా ప్రక్రియలను కొనసాగించాలి. 
 రాజకీయ ఖైదీల విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకోవాలి. మావోయిస్టు రాజకీయ సంబంధమైన ఆరోపణలతో దేశంలో ఎందరో జైళ్లలో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది రాజకీయ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కారణంగానే నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. మానవ జాతినే సవాలు చేసే ముప్పు ముంచుకొచ్చిన కరోనా సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మనుషులందరం కలిసి దీనిని ఎదుర్కోవాలని ప్రభుత్వాలు  చెబుతున్నాయి.   సిఎఎ వంటి ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరి నుండి భీమాకొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది వరకు ఎంతో మంది రాజకీయాల కారణంగానే జైళ్ళలో ఉన్నారు. వీరిలో వరవరరావు ఎనభై ఏళ్ల వయోభారంతో ఏడాదిన్నరగా జైలులో ఉన్నారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారికి కరోనా ముప్పు ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖైదీలందరినీ విడుదల చేయాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖైదీలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే అందులో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడిన ఖైదీలను, ఏడు సంవత్సరాల లోపు శిక్షా నేరాలు ఆరోపించబడిన అండర్ ట్రయల్ ఖైదీలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం వల్ల ఈ పరిధిలోకి సాయిబాబా గాని, భీమా కోరేగాం నిందితులు గానీ, దేశవ్యాప్తంగా ఊపా కింద అరెస్టు కాబడిన వందలాది రాజకీయ ఖైదీలు గానీ వచ్చే అవకాశం లేదు. అంటే ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతుంది. ఇది చాలా అమానవీయ చర్యగా, ఫాసిస్టు దమనకాండగా చరిత్రలో నిలిచిపోతుంది. 
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కోర్టుల్లో విచారణ కూడా సాగడం లేదు కాబట్టి రిమాండ్ ఖైదీలను జైళ్లలో ఉంచడమంటే వాళ్లను కరోనా వైరస్ కు అప్పగించినట్లే. వాళ్లు నేరం చేశారని నిర్ధారించకముందే వాళ్లను శిక్షించినట్టు అవుతుంది. తెలంగాణలో విప్లవ  రచయితల సంఘం కార్యదర్శి, రచయిత కాశీం సహా గత ఆర్నెల్లలో అరెస్టు చేసిన రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల బాధ్యులకు సంబంధించిన బెయిళ్ల విచారణ కూడా సాధ్యం కాదు. ఇది న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. కాబట్టి వారి జీవించే హక్కును కాపాడటానికి తక్షణం జైళ్ల నుంచి విడుదల చేయాలి. ఈ సూత్రం కేవలం రిమాండ్ ఖైదీలకే కాకుండా కింది కోర్టుల్లో శిక్షపడి అప్పీలు తేలకుండా జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలోనూ వర్తిస్తుంది. ప్రొ. సాయిబాబా తీవ్ర అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా బెడద తీరేదాకా జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలి. దేశ ప్రజలందరూ కరోనా విపత్తు వల్ల గృహ నిర్బంధంలో ఉన్న స్థితిలో ఖైదీలను కూడా ఇళ్ళకు పరిమితం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాలు కూడా ఇందులో జోక్యం చేసుకొని అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని విరసం  విజ్ఞప్తి.