ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తొలగింపు


ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తొలగింపు
నియామకం నిబంధనల్లో సవరణపై ఆర్డినెన్స్‌..గవర్నర్ ఆమోదం.వెంటనే తొలగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. గవర్నర్‌ ఆమోదం లభించడంతో ఆర్డినెన్స్‌పై ఉత్తర్వులు(జీవో)జారీ అయ్యాయి. తాజా నిబంధనల ప్రకారం రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. తాజాగా జారీ చేసిన రెండు జీవోలను గోప్యంగా ఉంచింది. రమేశ్‌కుమార్‌ తొలగింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. అంతకుముందు రోజే (మార్చి 14) కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. అయితే దీనిపై సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అనంతరం కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఎస్‌ఈసీకి లేఖ రాశారు.
మరోవైపు స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నందున రమేశ్‌కుమార్‌కు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. తాజాగా కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలతో పాటు రూ.వెయ్యి చొప్పున నగదు సాయం ప్రకటించింది. ఆ సాయాన్ని వైకాపాకు చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని.. ఇది అధికార దుర్వినియోగమంటూ విపక్షాలకు చెందిన కొందరు నేతలు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేయకూడదని, అలా చేస్తే ఎన్నికల ప్రకియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఎస్‌ఈసీ నియామకం నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకు రావడం గమనార్హం. దాని ఆధారంగా రమేశ్‌కుమార్‌ పదవీకాలం మూడేళ్లు పూర్తయినందును ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో