ఫిజికల్ డిస్టెన్స్ , డిజిటల్ సోషలైజేషన్ పాటిద్దాం

ఫిజికల్ డిస్టెన్స్ , డిజిటల్ సోషలైజేషన్ పాటిద్దాం
-ఈ క్లిష్ట సమయంలో అందరం ధైర్యంగా పోరాడదాం
-ప్రవాస తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం వివిధ దేశాల్లోని ప్రవాస తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
     ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ఒక క్లిష్ట సమయంలో ప్రపంచంలో మనందరం ఉన్నాం. విదేశాల్లో ఉన్న లక్షలాది తెలుగువారు అంతా జాగ్రత్తగా ఉండాలి. 
విపత్తును రాకుండా అడ్డుకోలేం, దాని తీవ్రతను నియంత్రించడంలోనే మానవ సామర్ధ్యం బైటపడుతుంది. 
ఇప్పటిదాకా వచ్చిన విపత్తులన్నీ ఒకఎత్తు, ఈ కరోనా విపత్తు మరో ఎత్తు. మనం బైటకు పోలేని విపత్తు ఇది. ప్రపంచం ఊహించని పెనువిపత్తు ఇది. పుట్టింది చైనాలో అయినా 4నెలల్లోనే ప్రపంచం అంతా వ్యాపించింది. వేసవి తర్వాత ఈ వైరస్ మళ్లీ ఉధృతం అయ్యే ప్రమాదం పొంచివుంది. 
మీరంతా(ప్రవాస తెలుగువారు) ధైర్యంగా ఉండాలి. మీరు, మీ కుటుంబాలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటించాలి. వర్ట్యువల్ వర్కింగ్, డిజిటల్ సోషలైజేషన్ తో ముందుకు వెళ్లాలి. మీ విజ్ఞానాన్ని సమాజం బాగు కోసం వినియోగించాలి.
ఒంటరివారమనే భావన మనలో పెరగరాదు. మానవ సంబంధాలు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని దుస్థితి. మానసిక సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరిలోనూ నైరాశ్యం ప్రబలరాదు.  
ఆహార సంక్షోభం, ఆర్ధిక సంక్షోభం పొంచివున్నాయి. ఈ పరిస్థితిలో ప్రతివ్యక్తి, దేశం, రాష్ట్రం, మొత్తం సమాజం కడు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి.
ఈ క్లిష్ట సమయంలో అందరూ ధైర్యంగా పోరాడాలి. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. 
మీరుండే ప్రాంతంలో తోటివారిని ఆదుకోవాలి. జన్మభూమి ఆంధ్రప్రదేశ్ లో సాటివారికి సాయపడాలి.
ముందు జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలే ప్రజల ప్రాణాలను కాపాడాయి: 
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించింది. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్,యూకె, చైనా తదితర దేశాలన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. 
జర్మనీ, దక్షిణ కొరియా వంటి కొన్ని దేశాలు మాత్రమే ముందు జాగ్రత్తలు తీసుకుని సకాలంలో అప్రమత్తం అయ్యాయి, మృతుల సంఖ్యను తగ్గించగలిగాయి.
అనేక దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు 40పైగా పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి.
లాక్ డౌన్ 1, 2 వల్లే భారతదేశంలో కరోనా వైరస్ ను నియంత్రించ గలిగాం. ఈ వైరస్ నుంచి శాశ్వతంగా ఎలా బైటపడాలా అన్నదే మనందరి ముందున్న సవాల్. 
భారత దేశంలో లాక్ డౌన్ కు ముందు కరోనా కేసులు 3రోజుల్లో రెట్టింపు కాగా, లాక్ డౌన్ ప్రకటించాక 6రోజులకు రెట్టింపు అవుతున్నాయి, ఆ మేరకు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగాం కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరిగాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపి, తెలంగాణలో కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 
దేశవ్యాప్తంగా 23% జిల్లాలు రెడ్ జోన్ లో ఉంటే మన రాష్ట్రంలో 13జిల్లాలకు 11జిల్లాలు(84%)  రెడ్ జోన్ లో ఉన్నాయి.
టెస్టింగ్ లు ఎక్కువగా చేయడం వల్లనే కేరళలో వైరస్ వ్యాప్తిని నియంత్రించారు. దేశంలో తొలి కేసు నమోదైన కేరళలో ఇప్పటిదాకా మృతులు కేవలం ముగ్గురు మాత్రమే. ప్రజలను అప్రమత్తం చేయడం, భౌతిక దూరం పాటించడం, రేషన్ ఇంటింటికీ సరఫరా చేయడం తదితర  చర్యలు కేరళలో సత్ఫలితాలను ఇచ్చాయి. 
రాజకీయ పార్టీగా టిడిపి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది: 
ఒక రాజకీయపార్టీగా తెలుగుదేశం తరఫున ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరిస్తున్నాం.
 ‘‘ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలి, రైతుల వద్ద ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి, అన్నా కేంటిన్లు, బీమా పథకాలు పునరుద్దరించాలని’’ స్థానికంగా టిడిపి నేతలు ఇళ్లలోనే 12గంటల దీక్షలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండికూడా వారి శాయశక్తులా ప్రజల క్షేమం కోసం పని చేస్తున్నారు.
సిబిఎన్ ఫౌండేషన్ తరఫున సమష్టి ప్రజా ప్రయోజనాల లక్ష్యంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికతను అనుసంధానిస్తూ, వివిధ రంగాల్లో మేధావులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చల ద్వారా బెస్ట్ ప్రాక్టీసెస్, పబ్లిక్ పాలసీలు రూపొందించడం, ఎంటర్ ప్రెన్యూర్లను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టయినబుల్ టాన్స్ ఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) ఏర్పాటు చేశాం. గత 3వారాలుగా కరోనా వైరస్ నియంత్రణ మార్గాలపై వివిధ రంగాల మేధావులతో వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా చర్చలు, వారి విశ్లేషణ- అధ్యయనాల్లో వెల్లడైన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నాం.
మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవాళికి మేలైన విధానాల రూపకల్పనపై ఆయా రంగాల మేధావులు దృష్టి పెట్టాలి.
కరోనా తర్వాత ఎంతమంది ఏవిధంగా ప్రభావితం అవుతారో అంచనా వేసి, ఎప్పటికప్పుడు అధ్యయనం, విశ్లేషణ ద్వారా కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాం. 
మీ అందరితో మాట్లాడి సేకరించిన అభిప్రాయాలను, ఆలోచనలను, వివిధ దేశాల్లో మేలైన విధానాల గురించి మళ్లీ త్వరలోనే ప్రధానికి మరో లేఖ రాస్తాం. 
ప్రవాస తెలుగువారిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు బాధాకరం: 
బతుకు తెరువు కోసం వెళ్లిన ప్రవాస భారతీయుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధాకరం. వారి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ సమయంలో వైరస్ ఎలా నియంత్రించాలో ఆలోచించాలే తప్ప ఎవరో ఒకరిని నిందించడం మంచిదికాదు.
సాటి మానవులను ఆదుకోవడం మానవ ధర్మం. కష్టాలలో ఉన్న తోటివారిని ఆదుకోవడం మన బాధ్యత. నేను పిలుపు ఇచ్చాక చాలా మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి ఆయా ప్రాంతాలలో పేదలను ఆదుకోవడం సంతోషకరం. మీ మీ ప్రాంతాలలో మీరుకూడా మానవతా ధోరణితో సాటివారిని ఆదుకోవాలి.
ఈ సమాజం మనకెన్నో ఇచ్చింది. సమాజం కోసం మనం ఇవ్వాల్సిన సమయం ఇది. కాబట్టి అందరూ ముందుకొచ్చి తోటివారిని ఆదుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులు అంతా ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారికి అండగా ఉండాలి. 
తొలిరోజునుంచి టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్ అని హెచ్చరిస్తూనే ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక లేఖల ద్వారా అప్రమత్తం చేస్తునే ఉన్నాం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కరోనాను తేలిగ్గా తీసుకోవడం బాధాకరం. ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో గడగడలాడతుంటే మన రాష్ట్రంలో మాత్రం రాజధాని మార్చడం, స్థానిక ఎన్నికలు పెట్టడంపైనే పాలకుల ఆలోచనలు ఉన్నాయి. 
సమాజం గురించి ప్రతి రోజూ ఒక అరగంట ఆలోచించాలి: 
ప్రతిఒక్కరూ మన కుటుంబం గురించిన ఆలోచనలతో పాటు, సమాజం గురించి కూడా ప్రతి రోజూ ఒక అరగంట ఆలోచించాలి. మన ద్వారా సమాజానికి జరిగే మేలు గురించి యోచించాలి. 
సేవ చేయడానికి ముందుకొచ్చేవారిని రాష్ట్రంలో వైసిపి నేతలు అడ్డుకోవడం బాధాకరం. మీరు చేసే సాయం మాకివ్వండి, మేమే అందజేస్తాం అంటూ దాతలను చిన్నబుచ్చడం మంచిదికాదు. ప్రభుత్వం చేసేది చేయకుండా, దాతలు చేస్తామన్నా అడ్డుకోవడం బాధాకరం.
అభివృద్దిని కొనసాగించాలే తప్ప నాశనం చేయరాదు: 
టిడిపి ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో అభివృద్ది చేసిన జెనోమ్ వ్యాలీలో ప్రస్తుతం  వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు జరుగుతున్నాయి. హైటెక్ సిటి ఒక ఉపాధి కేంద్రంగా ఆర్ధిక నగరంగా మారింది. విశాఖ మెడ్ టెక్ జోన్ లో కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, పిపిఈలు తయారీ జరుగుతోంది. దానిని నాశనం చేయాలని చూస్తే కేంద్రం జోక్యం చేసుకుని అడ్డుకుంది. అమరావతిని గొప్ప నగరంగా నిర్మించాలని చూస్తే దానిని నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. అభివృద్ధిలో ఎవరికి వారు పోటిబడాలే తప్ప అభివృద్దిని అడ్డుకోవడం, నాశనం చేయడం బాధాకరం.
     సమాజంలో నాలెడ్జ్ ను, టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి. మేధోమధనం ద్వారా మేలైన విధానాలు రూపొందించాలి. ఆలోచన, అధ్యయనం, విశ్లేషణ, పబ్లిక్ పాలసీలు రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలి. 
‘‘కరోనా ముందు, కరోనా కాలం, కరోనా తర్వాత’’ 3దశలుగా భవిష్యత్ విశ్లేషణలు, అధ్యయనాలు సాగాలి. కరోనా తర్వాత మీరు పనిచేసే కంపెనీల పరిస్థితి, మీరుండే సమాజంలో పరిస్థితులను ముందే అంచనా వేసి, వాటిని అధిగమించే మార్గాలపై అందరూ దృష్టి పెట్టాలి. 
వివిధ ప్రవాస తెలుగువారి అభిప్రాయాలు: 
రవి(ఆస్ట్రేలియా-మెల్ బోర్న్): ఈ విపత్కర పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు  చాలా ధైర్యంగా ఉండేది. కృష్ణా జిల్లాలో మా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తల్చుకుంటే ఆందోళనగా ఉంది. ప్రతిపక్షంలో ఉండికూడా ప్రజల్లో ధైర్యం నింపేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం. 
రఘునాధ్(బెహ్రెయిన్): ‘‘త్రీ-టి’’ విధానం వల్ల బెహ్రెయిన్ లో సత్ఫలితాలు వచ్చాయి. ప్రతి ప్రాంతాన్ని ట్రేస్ చేయడం, ప్రతి ఒక్కరిని టెస్టింగ్ చేయడం, పాజిటివ్ కేసును గుర్తించి ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రణ సాధ్యం అయ్యింది. ‘‘త్రీ- టి’’ విధానాన్ని మనదేశంలో, రాష్ట్రంలో కూడా అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి. తెలుగు బంధు శివకుమార్ ఆధ్వర్యంలో తెలుగు కళా సమితి ద్వారా బెహ్రెయిన్ లోని  తెలుగువారికి సహాయ పడుతున్నాం. ప్రభుత్వం నుంచి అందేవాటిని వివరిస్తూ, వారికి కావాల్సిన కిట్లు, ఆహారం అందిస్తున్నాం. 
ప్రభుత్వానికి సమాంతరంగా ప్రతిపక్షంలో ఉండికూడా ప్రజా ప్రయోజనాల కోసం మీరు కృషి చేయడం సంతోషం. ప్రజాసేవకు, పాలసీ మేకింగ్ కు పాలిటిక్స్ దోహదపడాలనే మీ ఆలోచనకు అభినందనలు. ఏపిలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. 90% జిల్లాలు రెడ్ జోన్ లో ఉండటం ఆందోళనకరం. మీరు సీఎంగా ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదు, చాలా జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వచ్చేలా ముందు జాగ్రత్తలు తీసుకునేవాళ్లు, ప్రజలను అప్రమత్తం చేసేవాళ్లు.   
ఈశ్వర్(కువైట్): నాది కడప జిల్లా రైల్వే కోడూరు. రాష్ట్రంలో గత ఏడాదిగా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తప్పుడు కేసులతో వేధించడం బాధేస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉండటం సంతోషం. కువైట్ లో వచ్చిన పాజిటివ్ కేసులలో, 30మంది తెలుగువారు ఉన్నారు. వారందరికీ  ప్రభుత్వపరంగా అందేవాటిని తెలియ జేస్తూనే, తెలుగు సంఘం తరఫున చేయాల్సిన సాయం అందిస్తున్నాం.
షేక్ రహంతుల్లా(కువైట్): ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రవాస భారతీయులకు ధైర్యాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. మా అందరిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఇక్కడ 1,751కేసులలో 900భారతీయులు కాగా అందులో 30మంది తెలుగువారు. ఏపి ప్రభుత్వం తమ యోగక్షేమాలను పట్టించుకోవడం లేదనే బాధ ఉంది. కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎలా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాకబు చేయడం బాధగా ఉంది. కడప జిల్లాలో మా కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి, తిరిగివస్తున్న వారిని వ్యాధి వెంటబెట్టుకు వచ్చారనే భావనతో చూడటం మంచిది కాదు. విదేశాలనుంచి వచ్చినవారిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు చూస్తే బాధేస్తోంది. 
మురళి(ఐర్లాండ్): మీ లాంటి సీఎంను ఇలాంటి విపత్కర సమయంలో లేకపోవడం బాధగా ఉంది. ఇక్కడ 1,739కేసులకు 39మందే చనిపోయారు. ఇక్కడ కంటైన్ మెంట్ చాలా బాగా చేస్తున్నారు. రెడ్ జోన్లలోనే కాకుండా అన్ని జోన్లలోనూ పకడ్బందీగా నియంత్రణ చేస్తున్నారు. దానివల్లే వైరస్ వ్యాప్తి నియంత్రణ సాధ్యం అయ్యింది.
సతీష్ వేమన(తానా మాజీ అధ్యక్షులు): అమెరికాలో పాజిటివ్ కేసులు 7లక్షల 20వేలు దాటాయి. దాదాపు 37వేల మంది చనిపోయారు. భారతీయులు చాలావరకు క్షేమంగా ఉండటం సంతోషకరం. వైరస్ బారిన పడినా మనకున్న ఇమ్యూనిటి వల్ల బైటపడుతున్నాం. మనవాళ్లు ఇక్కడ 4గురు మాత్రమే చనిపోయారు. మనం తీసుకుంటున్న ముందు జాగ్రత్తల వల్లే బైటపడ గల్గుతున్నాం. 
లోకేష్ నాయుడు(యూఎస్ ఏ): అమెరికాలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. నేనుండే డల్లాస్ లో మనవాళ్లంతా జాగ్రత్తగా ఉంటున్నాం. విపత్తు నిర్వహణలో మీకున్న సమర్ధత అందరికీ తెలిసిందే. ‘‘కరోనా తర్వాత’’ ఏయే రంగాలు ఏవిధమైన ఇబ్బందులను ఎదుర్కొంటాయో, మీరు ముందే అంచనావేసి అప్రమత్తం చేస్తే ఆయా రంగాలకు చాలా మేలు కల్గుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై అసలు వాస్తవాలు తెలియక మేమంతా ఆందోళన చెందుతున్నాం. మా మదనపల్లిలో పరిస్థితులు దాచిపెడ్తున్నారనే అంశం బాధేస్తోంది. దాచిపెట్టడం వల్ల  దుష్ఫలితాలు అధికంగా వాటిల్లుతాయి. కాబట్టి కేసుల గురించి, పరీక్షలు, పాజిటివ్ ల గురించి వాస్తవాలు వెల్లడించి ప్రజల్లో భయాందోళనలు తగ్గించాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవలో మీరు ముందున్నందుకు అభినందనలు. 
సతీష్ పండు(యూఎస్ ఏ-డాలస్): మీరు నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ లో తయారైన కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, పిపిఈలు ఇప్పుడీ సంక్షోభంలో ఎంతో ఉపయోగపడటం సంతోషదాయకం. స్థానికంగా మేము ఫ్రంట్ లైన్ వారియర్లకు(సిటి స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్లు) కావాల్సిన ప్రొటెక్టివ్ గేర్(రక్షణ పరికరాలు) అందిస్తున్నాం.  
సాయి బొల్లినేని(యూఎస్ ఏ): ఏపిని నాలుగు భాగాలుగా విభజించాలి. గవర్నమెంట్ ఆపరేషన్స్, ప్రైవేట్ ఆపరేషన్స్, లాజిస్టిక్ ఆపరేషన్స్, ఎకనమిక్ ఆపరేషన్స్ గా వర్గీకరణ చేసుకుని పని చేయాలి. 
దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సత్ఫలితాలు వచ్చాయి. కమ్యూనిటి హెల్త్ ఆర్గనైజర్స్ గా సోషల్ యాక్టివిస్ట్ లను ప్రోత్సహించాలి. మండల స్థాయిలో ప్రజలను చైతన్యపర్చాలి. ఆహార నిల్వ చేయడం, సప్లయి చెయిన్ కు పంపడంపై మెరుగైన విధానాలు రూపొందించాలి. 
మల్లి(యూఎస్ ఏ, ఛార్లెట్): ప్రవాస భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు అమెరికాలోని తెలుగు సంఘాలు బాగా పనిచేస్తున్నాయి. ఇక్కడ మన తెలుగువాడైన సుధాకర్ కంచర్ల కోవిడ్ 19 టెస్ట్ ల్యాబ్  డల్లాస్ లో ఏర్పాటు చేశారు. అది అమెరికా ప్రభుత్వానికే కాకుండా స్థానికంగా తెలుగువారికి చాలా ప్రయోజనంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదేవిధమైన వీడియో కాన్ఫరెన్స్ లు మరిన్ని నిర్వహించడం ద్వారా నాలెడ్జ్ షేరింగ్ కు దోహదపడాలని కోరుతున్నాను. 
విలేఖ్య(శాన్ ఫ్రాన్సిస్కో-కాలిఫోర్నియా): మాది కృష్ణా జిల్లా కానూరు ప్రాంతం. అక్కడి రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటే బాధగా ఉంది. ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయి. మేము ఎవరికైనా సాయం చేసినా ఏ పదిమందికో చేయగలం. కానీ ఈ విపత్తులో అందరూ తలా ఒక చేయి వేయాలి. మీరు ఏ పిలుపు ఇచ్చినా సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నాం.
చందు నాని(కాలిఫోర్నియా-యూఎస్ ఏ): మాది అమరావతి ప్రాంతం. రాజధాని గ్రామాల్లో మహిళలు మాస్క్ లు కుట్టి పేదలకు ఉదారంగా అందించడం సంతోషం. దానిని స్థానికంగా మీరంతా ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనం కల్గుతుంది.  అందరి ఎన్నారైలతో మాట్లాడి ఒక ధైర్యం ఇవ్వడం సంతోషం. లాక్ డౌన్ వల్ల, భౌతిక దూరం పాటించడం వల్లే కాలిఫోర్నియాలో వైరస్ ను నియంత్రించగలిగారు. ఎన్నారైలుగా మన రాష్ట్రంలో పేదలకు ఆహారం పంపిణీ చేయడానికి కూడా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం దురదృష్టం.
రత్న ప్రసాద్(యూఎస్ ఏ): కరోనా వైరస్ పై మన రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా, గ్రామాల్లో అవగాహన ప్రజల్లో తక్కువగా ఉంది. దానిని మరింత పెంచాలి. టెస్టింగ్ లను అత్యధికంగా చేసేలా చూడాలి. రెడ్ జోన్ల ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేయాలి. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కోమటి జయరామ్(యూఎస్ ఏలో ఏపి ప్రభుత్వ మాజీ ప్రతినిధి), వేమూరి రవికుమార్(ఏపి ఎన్నార్టీ మాజీ అధ్యక్షులు) , బుచ్చిరామ్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. దుబాయ్, యూఏఈ, స్పెయిన్, తైవాన్, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, అబుదాబి తదితర ప్రాంతాలకు చెందిన 1000మంది ప్రవాస తెలుగువారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 
                              ----