కొండవీడు రోడ్డుకు రూ.24 కోట్లు మంజూరు

కొండవీడు రోడ్డుకు రూ.24 కోట్లు మంజూరు
*కొండ‌వీడు అభివృద్ధిలో గొప్ప మైలు రాయి*
*విద్యుత్ స‌బ్‌స్టేష‌న్ కూడా మంజూరు*
*శ‌ర‌వేగంగా న‌ర‌సింహ‌స్వామి ఆల‌య అభివృద్ధి*
*విగ్ర‌హానికి తాజాగా రూ.8ల‌క్ష‌లు మంజూరు*
*కోవిడ్ క‌ష్ట‌కాలంలోనూ కొండ‌వీడుకు ప్ర‌భుత్వం చేయూత‌*
*కొండ‌వీడు స‌మ‌గ్ర అభివృద్ధికి చేయూత‌నిస్తున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు*
*విలేక‌ర్ల స‌మావేశంలో చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని*
య‌డ్ల‌పాడు మండ‌లం బోయ‌పాలెం నుంచి కొండ‌వీడుకు వెళ్లే ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌, అభివృద్ధి కోసం రూ.24కోట్ల మంజూరుకు సంబంధించి శ‌నివారం ప్ర‌భుత్వం ప‌రిపాల‌నా ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. స్థానిక త‌న కార్యాల‌యంలో ఆదివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కొండ‌వీడును అంత‌ర్జాతీయ‌స్థాయిలో అభివృద్ధి చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. తాను గెలిచిన వెంట‌నే త‌న ప్రాధాన్య అంశాల్లో కొండ‌వీడు కూడా ఒక‌టని ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఎంతో చ‌రిత్ర ఉన్న కొండ‌వీడుకు పూర్వవైభ‌వం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. దేశంలోనే గొప్ప ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండ‌వీడును అభివృద్ధి చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌న‌న్నింటిని తాము వినియోగించుకుంటామ‌న్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టికి కొండ‌వీడు అభివృద్ధికి సంబంధించిన వివ‌రాల‌ను తాము తీసుకెళ్లామ‌ని, ఆయ‌న ఎంతో సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. కొండ‌వీడు కోట అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామ‌ని సీఎం జ‌గ‌న్ త‌మ‌కు భ‌రోసా ఇచ్చార‌ని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టికి కొండ‌వీడుకు రూ.30 కోట్ల నిధులు మంజూరుచేశామ‌ని తెలిపారు.
*త్వ‌రలోనే టెండ‌ర్లు*
కొండ‌వీడు అభివృద్ధిలో భాగంగా ముందు ర‌హ‌దారుల‌ను పూర్తిస్థాయిలో తీర్చిదిద్ద‌నున్న‌ట్లు చెప్పారు. బోయ‌పాలెం నుంచి కొండ‌వీడు వ‌ర‌కు ర‌హ‌దారిని విస్త‌రించి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల‌ని తాము  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని కోర‌గానే ఆయ‌న అంచ‌నాలు తయారుచేయించార‌ని చెప్పారు. ఆ వెంట‌నే రూ.24 కోట్లు నిధులు కూడా మంజూరు చేస్తూ శ‌నివారం ఆదేశాలు జారీ అయ్యాయ‌ని చెప్పారు. అతి త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి ప‌నులు కూడా మొద‌లుపెడ‌తామ‌ని చెప్పారు. కొండ‌వీడు ఘాట్‌రోడ్డు, కోటకు సంబంధించి విద్య‌త్ అవ‌స‌రాల కోసం స‌బ్‌స్టేష‌న్ మంజూరుచేయాల్సిందిగా సంబంధిత శాఖ‌ను అభ్య‌ర్థించ‌గా... వెనువెంట‌నే స్పందించి స‌బ్‌స్టేష‌న్‌ను మంజూరు చేశార‌ని తెలిపారు. సోమ‌వారం స‌బ్‌స్టేష‌న్‌కు సంబంధించి స్థ‌లాన్ని ప‌రిశీలిస్తామ‌ని, ఆ వెంట‌నే ప‌నులు కూడా ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. ఎక్క‌డా లేని విధంగా కొండ‌వీడులో న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని నిర్మించ‌బోతున్నామ‌న్నారు. ఇప్ప‌టికే ఆల‌యం 70 శాతానికిపైగా పూర్త‌యింద‌ని చెప్పారు. విగ్ర‌హం కోసం అభ్య‌ర్థించ‌గా.. ప్ర‌భుత్వం గ‌త వారం రూ.8ల‌క్ష‌లు మంజూరుచేసింద‌ని తెలిపారు. టీటీడీ నుంచి ప‌ది రోజుల్లో న‌ర‌సింహ‌స్వామి విగ్రహాన్ని కూడా తెప్పించి గొప్ప అధ్యాత్మిక క్షేత్రంగా కొండ‌వీడును తీర్చిదిద్దుతామ‌న్నారు. కోవిడ్ లాంటి క‌ష్ట కాలంలో కూడా కొండ‌వీడు అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం నిధులు మంజూరుచేస్తోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాదిలోగా కొండ‌పై చిల్డ్ర‌న్స్ పార్కు, అత్యాధునిక పార్కింగ్ ప్లేస్‌, బురుజుల నిర్మాణాలు, చెరువుల ఆధునికీక‌ర‌ణ‌, బోటింగ్‌, గేమింగ్‌.. త‌దిత‌ర ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయ‌ని వెల్ల‌డించారు. కొండ‌వీడు అభివృద్ధి కోసం త‌మ వంతు సాయం చేస్తున్న ఆర్థిక‌, అట‌వీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రులు బుగ్గ‌న‌ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌దిత‌రుల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.