ఎల్జీ పాలిమర్స్ నుండి జగన్ కు రూ.300 కోట్ల ముడుపులు
లాక్ డౌన్ లో అనుమతులివ్వడంపై సీబీఐ విచారణ జరగాలి
బొండా ఉమామహేశ్వరరావు
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన స్టెరైన్ గ్యాస్ ప్రమాదంలో 12 మంది ప్రాణాలొదిలారు. 400 మందికి పైగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పశుపక్ష్యాదులు నురగలు, రక్తం కక్కుకుని చనిపోయాయి. చెట్టూ చేమా మాడిపోయాయి. దీనంతటికీ జగన్మోహన్ రెడ్డి ధనదాహమే కారణం. దేశమంతా లాక్ డౌన్ లో ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ నుండి వచ్చే కమిషన్ల కోసం ఉత్పత్తి ప్రారంభానికి అనుమతిచ్చి ప్రజల ప్రాణాలు తీశారు. కరోనా వంటి విపత్తును కూడా ఆదాయ మార్గంగా మార్చుకున్నది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కరోనా టెస్ట్ కిట్లలో, కేంద్రం ఇచ్చిన కరోనా సాయంలో, మట్టి, ఇసుక, భూములు, మద్యం ఒకటేమిటి ప్రతి దాంట్లో ఆదాయం వెతుక్కున్నారు.
లాక్ డౌన్ తో మూతబడిన పరిశ్రమలో అకస్మాత్తుగా ఉత్పత్తి ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రారంభించే ముందు భద్రతా ఏర్పాట్లను కనీసమైనా పరిశీలించారా.? వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా అనుమతి లేని సమయంలో ప్లాస్టిక్ తయారీ పరిశ్రమకు అనుమతులు ఎలా వచ్చాయి.? ఇంత స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి ధనదాహమే కారణం.
నష్టపరిహారం రూ.కోటి ఇచ్చామని మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పుకుంటూ ప్రజల ప్రాణాలను డబ్బుతో వెల కడుతున్నారు. డబ్బులొస్తే ఎంత మంది ప్రాణాలు పోయినా పర్లేదా.? ఒక మంత్రి మృతులకు పాతిక లక్షలే ఎక్కువ అంటారు. మరో మంత్రి కోటి ఇవ్వడం ఎంతో గొప్ప అంటారు. 12 ప్రాణాలు పోయాయి. వందలాది మంది ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో పరిశ్రమ ప్రతినిధులతో ఎందుకు సమావేశమయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. కలెక్టర్, ఎస్సీ, ఎన్డీఆర్ఎఫ్, పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు. కంపెనీపై కేసులు లేవు, ప్రతినిధుల అరెస్టులు లేవు. కనీసం కంపెనీ మూసివేత కూడా లేకుండా ఉండేందుకు రూ.300 కోట్లకు జగన్మోహన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు లేవు.
2017లో చంద్రబాబు అనుమతులు ఇవ్వడం తప్పు అయితే.. 2019లో ఎందుకు అనుమతులిచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ప్రభుత్వానిక సూచనలు చేస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కొడాలి నాని వంటి వారిని చూసి ఇలాంటి వారా మాకు ప్రతినిధులు అని అసహ్యించుకుంటున్నారు.
కరోనా నుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రజలు పోరాడుతుంటే.. జే ట్యాక్స్ కోసం ప్రజాధనంతో ప్రకటనలు చేస్తూ మద్యం తాగమంటున్నారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న వారు.. కోట్ల వ్యయంతో మద్యం తాగమంటూ ప్రకటనలు ఎందుకిస్తున్నారు?
రికార్డింగ్ ప్రెస్ మీట్లు, రివ్యూల పేరుతో ఫోటోలు విడుదల చేయడం తప్ప.. కరోనా విషయంలో జగన్ చేసిందేమీ లేదు. దక్షిణాధిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో కేసులు నమోదవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ధన దాహం కారణం కాదా.? పనుల్లేవు, ఉపాధి లేక అవస్థలు పడుతున్న సమయంలో మద్యం షాపులు తెరవడం దుర్మార్గం. మద్య నిషేధం అని ప్రకటించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కరోనాపై విశ్లేషణ కోసం కేంద్రం నుండి కమిటీ వస్తే.. పోలీసులను ఉపయోగించి మేధావుల్ని అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు కూడా తెలియనీయకుండా చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు, తెరవడం, ప్రమాదం జరగడం, కంపెనీపై కేసులు నమోదు చేయకపోవడం, కంపెనీలో ఉన్న భద్రతా ప్రమాణాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. కేంద్ర బృందం అన్ని జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని గుర్తించాలి.