ఇది వైఎస్ పాలన కాదు...ఓ రౌడీ పాలన:
నిప్పులు చెరిగిన సుంకర పద్మశ్రీ! దళిత డాక్టర్ ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు
ప్రశ్నిస్తే పిచ్చివాడన్న ముద్ర వేశారు*అన్యాయంగా కేసులు పెడుతున్నారన్న పద్మశ్రీ
ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది రాజన్న రాజ్యం కాదని, రౌడీ రాజ్యం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, దళిత డాక్టర్ సుధాకర్ ను, రోడ్డుపై కొట్టుకుంటూ, ఈడ్చుకుని వెళ్లారని, మాస్క్ లపై ప్రశ్నించినందుకు పిచ్చివాడన్న ముద్ర వేశారని మండిపడ్డారు.రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన నడుస్తోందని చెప్పుకుంటున్నారని, ఇది రాజన్న పాలన కాదని, ఓ రౌడీ పాలనని విమర్శించారు. రైతులను, మహిళలను, వలస కూలీలను కొడుతున్నారని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలాగా నిలబెట్టారని, ఇదేమని ప్రశ్నిస్తే, దాడులకు దిగి, కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.