గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందా? ప్రియాంక చోప్రా ప్రశ్నకు WHO సమాధానం

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందా?
ప్రియాంక చోప్రా ప్రశ్నకు WHO సమాధానం



*కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)పై ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో అర్థంలేని వదంతులు వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రముఖ నటి, యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా.. అనుమానాల నివృత్తి కోసం చక్కటి ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్ అధనోమ్‌తో మాట్లాడారు.అభిమానుల పంపిన ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు. తద్వారా పలు కీలక ఊహాగానాలకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు.*


‘‘కొవిడ్‌-19కు సంబంధించి పెద్దయెత్తున సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, దాంట్లో ఏది స్పష్టమైన సమాచారం అన్నదే మనకిప్పుడు కావాల్సింది. దీనిపై అవగాహన కల్పించడం కోసం సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌, టెక్నికల్‌ లీడ్‌ ఫర్‌ కొవిడ్‌-19 డాక్టర్‌ మరియా వన్‌ కెర్ఖోవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మనముందుకు వచ్చారు’’ అని ప్రియాంక తన ఖాతాలో రాసుకొచ్చారు. ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలేంటో చూద్దాం..! దీంట్లో తొలి ప్రశ్న ప్రియాంక భర్త, ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ సంధించడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారు.


*ప్రశ్న: నేను టైప్‌-1 డయాబెటిస్‌తో, ప్రియాంక ఆస్తమాతో బాధపడుతున్నాం. మాపై వైరస్‌ ప్రభావం ఉంటుందేమోనని భయంగా ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.*



సమాధానం: మీరు స్వీయ నిర్బంధంలో ఉండి మంచి పని చేస్తున్నారు. డయాబెటిస్‌, హృదయ, శ్వాస సంబంధిత, క్యాన్సర్‌, వయోభారం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వైరస్ ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్త వహించాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేనివారు కూడా ఇంటికే పరిమితం కావాలి. ఈ వైరస్‌కు ఎవరూ అతీతం కాదు. 


*ప్రశ్న: ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా?*


సమాధానం: కరోనా వైరస్‌ గాలి ద్వారా ఇతరులకు సోకదు. తుమ్మినపుడు లేదా దగ్గినపుడు ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఈ వైరస్‌ వారికి సంక్రమించే అవకాశం ఉంది. అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి.


*ప్రశ్న: వైరస్‌ నుంచి ఒకసారి కోలుకుంటే మళ్లీ వచ్చే అవకాశం ఉందా?*


సమాధానం: ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇప్పటికైతే లక్ష మందికిపైగా కోలుకున్నారు.