సమాజ విముక్తికై సాగే విప్లవ పధంలో కార్మికవర్గ అగ్రగామి పాత్రని వెల్లడించే తాజా భౌతిక ప్రాతిపదికలు - ఒక పరిశీలన!*
శ్రామికవర్గ విప్లవ ప్రియులారా!
సామాజిక విప్లవాలలో కార్మికవర్గ పాత్రపై ఇటీవల కాలంలో అనేక వింత వాదనలు వినిపిస్తున్నాయి. వాటి వెనక "పూసల్లో దారం" లా దాగి వుండేది భావి విప్లవాలలో కార్మికవర్గ చారిత్రిక విప్లవకర పాత్రకి కాలదోషం పట్టిందనే వాదనే! ఇంకా చెప్పాల్సి వస్తే, కమ్యూనిజానికి ఇక ముందుకాలదోషం పట్టిందని కూడా!
మార్క్స్ చెప్పిన సిద్దాంతం మార్క్స్ కాలానికే వర్తిస్తుందని చెప్పే వాదనలివి. అది ఇప్పడు వర్తించే సిద్దాంతం కాదనడమే! అందులో ఒక వాదనని నా వ్యాస అవసరం కోసం ప్రసావిస్తున్నా. అదే రేపటి విప్లవాల్లో కార్మికవర్గం పోషించే చారిత్రక విప్లవకర పాత్ర గూర్చి!
" *పెట్టుబడి* " తన అభివృద్ధి, విస్తరణల క్రమంలో సమాజంలోని అనేక తరగతుల ప్రజా సమూహాల్ని నిరాస్తిపరులుగా మార్చుతోందని, ఫలితంగా వారు కార్మికవర్గంలోకి మా(జా)రతారనీ, అలా మార్చబడే నిరాస్తిపర కార్మికవర్గమే స్వంతఆస్తి పునాదిపై గల పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థని కూల్చివేసే సోషలిస్టు విప్లవాన్ని చేపడుతుందని మార్క్స్, ఎంగెల్స్ లు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో సూత్రీకరించారు. లెనిన్ తర్వాత రంగంలోకి వచ్చి సామ్రాజ్యవాద యుగస్వభావాన్ని బట్టి పెట్టుబడిదారీయేతర దేశాల్లో కూడా సోషలిస్టేతర విప్లవాలకి ప్రాతిపదిక ఏర్పడిందన్నాడు. వాటిపేర్లు జనతా ప్రజాతంత్ర లేదా నూతన ప్రజాతంత్ర విప్లవాలుగా వుంటాయనే లెనిన్ సూత్రీకరణ తర్వాత ఆచరణ నిరూపించింది. అవి కార్మికవర్గ విప్లవాలు కాదు. కానీ అవి కార్మికవర్గ నాయకత్వంలో జరిగే విప్లవాలే!
ఆయాదేశాల్లో ఏఏ తరహా ఆర్ధికఉత్పత్తి వ్యవస్థలు ఉనికిలో వున్నాయనేది మరో సైద్ధాంతిక చర్చనీయాంశం. అది అప్రస్తుతం అంశం. వర్తమాన కాలంలో ఏ తరహా విప్లవాల్లోనైనా కార్మికవర్గం చారిత్రిక విప్లవకరపాత్రని విధిగా పోషిస్తుంది. అవి స్వయంగా కార్మికవర్గ విప్లవాలా? లేదంటే కార్మికవర్గ నాయకత్వంలో జరిగే విప్లవాలా? అనే ఒక్క ప్రశ్నే తప్ప కార్మికవర్గ పాత్ర లేకుండా ఇందులో ఏ విప్లవాలు కూడా వుండవనేది నిర్వివాదాంశం. అట్టి చారిత్రిక విప్లవకరపాత్రని ఆయా విప్లవాల్లో కార్మికవర్గం పోషిస్తుందని మార్క్స్ నుండి లెనిన్ వరకి సూత్రీకరించిందే! అట్టి కార్మికవర్గం అలాంటి విప్లవకర పాత్రను ఇకముందు పోషించదనే వాదనలు గత కొన్నేళ్లుగా ఉనికిలో ఉన్నాయి. పైగా అది "లేబరు వర్గం" పేరుతో నేడు హీనసంస్కృతికి ఒక ప్రతీకగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే "లేబరు వర్గం" విప్లవకర వర్గం గా తన చారిత్రిక పాత్రని పోషించి తీరుతుందని చెప్పడమే ఈవ్యాసం ద్వారా నేను చెప్పదలుచుకున్నది.
పై వాదన మార్క్సిస్టు మూల సిద్ధాంతానికి వ్యతిరేకమైనది. కమ్యూనిస్టు సానుభూతిపేరుల మీద కూడా ఈ వాదనల ప్రభావం ఎంతో కొంత వుంది. ఇది మార్క్సిస్టు రాజకీయ శ్రేణుల్లో సైతం ఒకవైపు మార్క్సిస్టు సిద్దాంతంపట్ల యాంత్రిక నిబద్ధతని ప్రదర్శిస్తూనే, మరోవైపు సందేహాల్ని వ్యక్తం చేసే రూపంలో ఉండటం గమనార్హం! అట్టి కొన్ని సందేహాలు నేడు ఎలా ఉన్నాయో ఈ క్రింద ఉదహరిస్తున్నాను.
"నాడు మార్క్స్ నిర్వచించిన కార్మికవర్గం నేడు లేదు", "మార్క్స్ చెప్పినట్లు నిరాస్తిపర వర్గంగా నేటి కార్మికవర్గం లేదు", "స్వంత ఆస్తి కోసం వెంపర్లాట సాగిస్తోన్న నేటి కార్మికవర్గం స్వంతఆస్తి పునాదిపై నిర్మితమైన వ్యవస్థను కూలదోసే విప్లవకర చారిత్రిక పాత్రను పోషించ లేదు", "పెటీ బూర్జువావర్గం క్రమంగా కార్మికవర్గంలో చేరుతుందని నాడు మార్క్స్ చెబితే, తద్భిన్నంగా నేడు మధ్యతరగతి వర్గంలోనే కార్మికవర్గం క్రమంగా చేరుతోంది", "మధ్యతరగతి వర్గం ఇలా పెరుగుతుందని మార్క్స్ ఊహించలేక పోయాడు, రానున్న సామాజిక విప్లవాలు కూడా అదే మధ్యతరగతి వర్గం తెస్తుంది", "మార్క్స్ సిద్ధాంతం యాంత్రిక యుగానికి వర్తించేది మాత్రమే, నేటి కంప్యూటర్ & ఇంటర్నెట్ యుగాలకి వర్తించేది కాదు", "మార్క్స్ చెప్పిన కార్మికవర్గ విప్లవాలకు చారిత్రికంగా కాలదోషం పట్టింది" వంటి రకరకాల మార్కిస్టేతర వాదనల ప్రభావం నేడు మార్క్సిస్టు శ్రేణుల్లో శంకలు, అనుమానాల రూపంలో ఉన్నాయి. అవిఅలా ఉండటానికి కూడా ఓ గత నేపధ్యం ఉంది. దాన్ని అవలోకిద్దాం.
గతంలో విప్లవాశయపదంలో ఉద్యమాలు వెల్లువెత్తిన ఓ మంచి కాలం వుంది. నాటి భౌతిక రాజకీయ స్థితిగతులు నిజంగానే ఒకింత వేరుగా వుండేవి. నాడు "ప్రపంచ కార్మికులారా ఏకంకండి" నినాదం వింటే కష్టజీవుల్లో ఉప్పొంగి పోయే స్థితి ఉండేది. "పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్లు తప్ప" అనే సూక్తి వింటే నరనరాల్లో భావావేశం ఉడుకెత్తే స్థితి ఉండేది. "ఆకలి మంటల మలమల మాడే అనాధులంతా లేవండోయ్" అనే సందేశగీతం వింటే రక్తనాళాలు కవోష్ణరక్తంతో సలసల మండే స్థితి ఉండేది "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు" అనే శ్రుతి గీతం ఆలకిస్తేనే హృదయాల్లో విప్లవ విద్యుదావేశం ఆవహించే పరిస్థితి ఉండేది. "మరో ప్రపంచం" పిలుస్తోందంటే కట్టలు తెంచుకొని కదనోత్సాహం పొంగి పొరలే పరిస్థితి ఉండేది. అది నాటి విప్లవ సిద్ధాంత అభిమాన శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఉండేది. అది ఒకనాటి భౌతికస్థితి!
ఇంకా చెప్పాల్సి వస్తే ఆనాడు మేడే వస్తున్నదంటే తమ బానిస సంకెళ్లు తెంచుకుని పోరాట దీక్ష చేపట్టే పర్వదిన కాంతులు కార్మికుల కళ్ళల్లో నిండేవి. ఆకలి, కన్నీళ్లు, దారిద్య్రం, దాస్యం, దోపిడి, పీడన, అణచివేతలు లేని ఓ నవ సమాజ నిర్మాణ ప్రక్రియలో కార్మికవర్గ అగ్రగామి పాత్ర గూర్చి వింటే వారి పట్ల ఎనలేని రాజకీయ గౌరవం కలిగేది. సామాజిక విప్లవ పరివర్తన లో కార్మికవర్గానిది శిఖర పాత్ర అనే సిద్ధాంత సూక్తిని ఆలకిస్తే, "ఔనుమరి కష్టజీవులు అంతటి ప్రాధాన్యత గల పాత్రనుపోషిస్తారు" అనే నమ్మకాన్ని కలిగించేది. అలా గర్వించే పరిస్థితి నాడు విప్లవ ప్రియుల్లోనూ వుండేది. ఇది విప్లవరాజకీయ వైభవోజ్వల కాంతుల్లో వర్ధిల్లిన నాటి దృశ్యం!
కారణాలు ఏమైనప్పటికీ, కారకాలు ఏవైనప్పుటికీ పైన పేర్కొన్న కాలపు చరిత్ర గమనం మందగించింది. నాటి విప్లవ రాజకీయ పురోగమన క్రమం కుంటుపడింది. యథాతథంగా అట్టి చరిత్ర గమనం తదనంతర కాలంలో ముందుకు సాగలేదు. నాటి విప్లవ రాజకీయ ప్రవాహం మందగించి ఆకర్షణను కోల్పోయిందా? అది కలుషితమై ఆదరణ కోల్పోయిందా? ఘనీభవించి గడ్డకట్టిందా? స్తబ్దతకు గురైనదా? లేదంటే అది పూర్తిగా స్తంభించి పోయిందా? ఇందులో ఏది నిజమనే సమీక్ష చరిత్రకే వదిలేద్దాం.
మధ్యలో నడమంత్రపు చీకటి కాలం ముంచుకొచ్చింది. ప్రపంచ కార్మికులారా ఏకంకండని నినదిస్తే హాస్యాస్పదపు వ్యాఖ్యలు వినిపించే కొత్తస్థితి నేడు ఏర్పడింది. పోరాడితే పోయేది కేవలం బానిస సంకెళ్లని అంటే అవి ఇంకెక్కడ వున్నాయని ప్రశ్నలు ఎదురయ్యే కొత్త పరిస్థితి వచ్చింది. "ఆకలి మంటలు" గూర్చి మాట్లాడితే ఎప్పుడో మాయమైన "ఆకలి" గూర్చి ఇంకా మాట్లాడటం ఏమిటనే వ్యంగ్య వ్యాఖ్యలు వినబడే స్థితి వచ్చింది. "మరో ప్రపంచం" గూర్చి ప్రస్తావిస్తే, "అది మరో ఎండమావి" అని ఎద్దేవా చేసే స్థితి వచ్చింది. విప్లవపథంలో కార్మికుడిదే అగ్రగామి పాత్ర అని మాట్లాడితే అదో పాత చింతకాయ పచ్చడి వంటి పనికిమాలిన సిద్ధాంతమని కొట్టివేసే కొత్తస్థితి ఏర్పడింది. ఆకలి, కన్నీళ్లు లేని సమాజం గూర్చి మాట్లాడితే అవి పగటి కలలుగా వెక్కిరించే కొత్తస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు శ్రామికవర్గ విప్లవ శ్రేణులను సైతం ఏదో మేరకు వెంటాడుతోన్న సందిగ్ద స్థితే!
పైన పేర్కొన్న నడమంత్రపు స్థితిగతులు సదా చెల్లవు. అది రేపు రుజువు కానున్న నిప్పు లాంటి నిజ చరిత్రే! కరోనా కాలంలో కొన్ని కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయంగా కరోనా అభివృద్ధి నిరోధక శక్తులకే ఎక్కువస్థాయిలో లాభిస్తున్నది. అదో నిజం. అదే సమయంలో చారిత్రికంగా కార్మికవర్గ విప్లవకర పాత్రకి గల ప్రాధాన్యతను గుర్తింపజేయడానికి సహాయకారిగా అది మారిందనవచ్చునేమో! వాటి దాఖలాలు కొన్ని నేడు బీజరూపం లో వెల్లడవుతున్నాయి. ఇప్పుటి వరకూ చెలామణిలో ఉన్న కుహనా నాగరిక రాజకీయ సంస్కృతి శాశ్వతం కాదు. అది శ్రమదోపీడీ పునాదిపై నిర్మించింది. అదో పరమ గబ్బుకోట్టే పెంటకుప్ప వంటిది. ఆ పెంటకుప్ప పై అత్తరు, పన్నీరు చల్లి, దాని కంపుని శ్రామిక, పీడిత వర్గాల ప్రజల ముక్కుపుటలకి సోకకుండా శ్రమదోపీడీ వ్యవస్థ పన్నే కుట్రలు ఎల్లకాలం కొనసాగవు. అవి రేపు కొత్తచరిత్ర నిర్మాణ క్రమంలో గాలిలో ఎగిరిపోతాయి. అట్టి సానుకూల భౌతిక స్థితిగతుల్ని విప్లవ నిర్మాణ సంస్థలు ఎలా సద్వినియోగం చేసుకోగలవనేది మరో విషయం! నేను అందులోకి వెళ్లడం లేదు. కానీ నేడు అందుకు సానుకూల భౌతిక ప్రాతిపదిక ఏర్పడే విషయం నా ప్రస్తుత ప్రస్తావనాంశం. రేపటి విప్లవాలలో కార్మికవర్గం తనదైన చారిత్రిక పాత్రను పోషించగలదా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేయడమే నా వ్యాస లక్ష్యం!
తన చారిత్రిక పాత్రను విధిగా చేపట్టే దిశలో కార్మికవర్గం నేడు ముందడుగులు వేయక తప్పని స్థితికి నేటి రాజ్యవ్యవస్థ (కార్పొరేట్ వ్యవస్థ) నెడుతోంది. కార్మికవర్గానికి సమాజంలో తిరిగి "ఆకర్షణ" పెరుగుతోంది. "ఆదరణ" పెరిగే ముందు "ఆకర్షణ" ఒక మెట్టు వంటిది. "అనుసరణ" దశకు చేరే ముందు "ఆదరణ" కూడా ఒక ముందడుగే! నేడు సమాజంలో వేళ్లూనుకున్న కుహనా నాగరిక సాంస్కృతిక పొరల్ని చీల్చుకొని, వాటి అట్టడుగున పడి నలిగే నేటి కార్మికవర్గాన్ని పౌరసమాజం తమ కళ్ళతో దర్శించే సంకేతాలు నేడు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. కార్మికవర్గం పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూల వాతావరణం పెరిగే ఓ కొత్తభౌతిక ప్రాతిపదిక తిరిగి ఏర్పడుతోంది. ఔను, రేపటి చరిత్ర నిర్మాణ క్రమంలో రథసారధిగా మారాల్సిన కార్మికుడి/కార్మికురాలి తరపున నేడు సమాజం కన్నీరు కారుస్తోంది. ఇది ముమ్మాటికీ భావి విప్లవదీర్ఘయాత్రలో ఓ శుభారంభం.
ఈ కొత్త భౌతికస్తితి శ్రామికవర్గం పట్ల విప్లవ శ్రేయోభిలాషుల్లో ఓ కొత్త ఆసక్తిని కలిగిస్తుంది. ఇంతవరకూ శ్రమదోపీడీ వ్యవస్థచేత చీకట్లోకి నెట్టబడ్డ కార్మికవర్గ దుస్థితి పట్ల హృదయావేదన అనుభవిస్తోన్న శ్రామికవర్గ విప్లవ ప్రియుల్లో ముమ్మాటికీ ఇది కొత్త ఆశల్ని చిగురుస్తుంది. శ్రామికవర్గ విమోచనా విప్లవ సిద్ధాంతపరుల్లో ఇంతవరకూ ఉన్న రాజకీయ బాధని తొలగిస్తుంది. ముఖ్యంగా ఇటీవల సమాజంలో తెల్లచొక్కా సంస్కృతి పెరిగే కొద్దీ, శ్రామికవర్గానికి చెందిన ఖాకీబట్టల సంస్కృతి పట్ల చులకన భావన పెరుగుతోంది. అది తాత్విక విప్లవ మేధో వర్గాన్ని సైతం బాధకి గురిచేస్తోంది. ఇప్పుడు ఏర్పడే కొత్త భౌతిక స్థితి కొత్త భౌతిక సావకాశమే. అది తొలకరి జల్లుల వంటిదే. ఉషోదయానికి ముందు వేకువ వెలుగు రేఖల వంటి అట్టి కొంగొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి.
పైన పేర్కొన్న వెలుగు రేఖలు సునాయాసంగా పురులు విప్పలేవు. అవి చిమ్మచీకట్ల మధ్య, ఇంకా చెప్పాలంటే క్రూర, ఘోర, దుష్ట పెట్టుబడుల విషవలయం మధ్య గర్భధారణ చెందుతున్న ఆశా కుసుమాలివి. అవి పురిటి నొప్పుల దశకు చేరడానికి ఇంకెంతో కాలం పడుతుందనే చేదునిజం మరో మాట! అది శ్రామికవర్గ విప్లవ ప్రియులైన రాజకీయ మిత్రుల మనస్సుల్లో ఉండాల్సిందే! అదే సమయంలో కార్మికవర్గ విప్లవకర పాత్ర పట్ల విశ్వాసం కలిగించే కొత్త భౌతిక ప్రాతిపదికల్ని